Sunday, June 16, 2024
Homeఓపన్ పేజ్Health for all: అందరికీ ఆరోగ్యం అందేనా?

Health for all: అందరికీ ఆరోగ్యం అందేనా?

ఇన్సూరెన్స్ తీసుకుని, హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోండి

ఆరోగ్యవంతులు ప్రజలు కలిగిన దేశాలలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దేశాభివృద్దిలో ప్రజారోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. ఆదాయ అసమానతలు, పేదరికం, విద్య, సామాజిక చైతన్యం, వైద్యుల అందుబాటు, నివసించే ప్రదేశం, భౌతిక వాతావరణం, పర్యావరణం, కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు మొదలగు అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

- Advertisement -

ఆరోగ్యం అంటే….
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే ఏ వ్యాధులు లేకపోవడమే కాదు. ఆరోగ్యం అనేది పూర్తి శారీరక మానసిక సామాజిక శ్రేయస్సు యొక్క స్థితిని కలిగి ఉండడం.

నా ఆరోగ్యం….నా హక్కు…
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య హక్కుకు ముప్పు పెరుగుతోంది. శిలాజ ఇంధనాల దహనం వాతావరణ సంక్షోభానికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును దూరం చేస్తోంది. ఇండోర్, అవుట్‌డోర్ వాయు కాలుష్యం ప్రతి 5 సెకన్లకు ఒక ప్రాణాన్ని తీస్తోంది. ప్రపంచంలో 140 దేశాలు తమ రాజ్యాంగంలో ఆరోగ్యాన్ని మానవ హక్కుగా గుర్తించాయి. అయినా కూడా చాలా దేశాలు తమ ప్రజలు ఆరోగ్య సేవలను పొందేందుకు అర్హులని నిర్ధారించడానికి చట్టాలను ఆమోదించడం ఆచరణలో పెట్టడంలేదు. 2021లో కనీసం 4.5 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్య హక్కుకు నోచుకోవడం లేదు. నాణ్యమైన ఆరోగ్య సేవలు, సురక్షితమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం, మంచి పని పర్యావరణ పరిస్థితులు స్వేచ్ఛను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.a

మన దేశంలో హక్కులు…
మనదేశంలో రాజస్థాన్ ప్రభుత్వం ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అన్ని ప్రజారోగ్య సౌకర్యాలలో ఉచిత సేవలను పొందే హక్కును కల్పించింది. పచ్చిమబంగా ఖేత్ మజ్దూర్ సమిటీ కేసులో సుప్రీంకోర్టు సంక్షేమ రాజ్యంలో ప్రజల సంక్షేమాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని ప్రజలకు తగిన వైద్య సదుపాయాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. పర్మానంద్ కటారా వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రతీ వైద్యుడు ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా మరేదైనా ఆసుపత్రిలోనైనా బాధితుడు అమాయకుడైనా లేదా నేరస్థుడైనా ప్రాణాలను రక్షించడానికి తగిన నైపుణ్యంతో తన సేవలను విస్తరించాల్సిన వృత్తిపరమైన బాధ్యతను కలిగి ఉంటాడని తెలిపింది.
మెడికల్ ప్రాక్టీషనర్‌గా తమ విధిని నిర్వహించడం బాధ్యతగల వారి విధి అని తెలిపింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పించింది. అలాగే ఆర్టికల్స్ 38, 39, 42, 43, 47 లలో రాష్ట్రాలు ప్రజలకు కల్పించవలసిన ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతలను తెలుపుతున్నాయి.

మన దేశంలో పరిస్థితి:
భారత్‌లో దాదాపుగా 10 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 11.4 శాతం మంది మధుమేహంతో జీవిస్తున్నారని ‘లాన్సెట్‌’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దాదాపు 13.6 ( 15.3 శాతం ) కోట్ల మందికి ప్రీడయాబెటిస్‌ ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మధుమేహం ఎక్కువగా ఉంది. మారుతున్న జీవనశైలి, మెరుగైన జీవన ప్రమాణాలు, నగరాలకు వలసలు, అస్తవ్యస్తమైన పని గంటలు, కూర్చునే అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్ సులభంగా అందుబాటులో ఉండటం వంటివి భారతదేశంలో మధుమేహం పెరగడానికి కొన్ని కారణాలు. క్షయవ్యాధి రోగుల సంఖ్య 2022లో 2.42 మిలియన్ల నుండి 2023లో 2.23 మిలియన్లకు స్వల్పంగా తగ్గింది. దేశంలో క్యాన్సర్ కేసులు 2023లో 1,496,972గా అంచనా వేయగా, 2022లో 1,461,427 కేసులు నమోదయ్యాయి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం పొగాకు మద్యం వినియోగం
భారతదేశంలో క్యాన్సర్ రోగులు పెరగడానికి కారణం. పౌష్టికాహార లోపం మరో సవాలు. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక వ్యత్యాసాలను కలిగిస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఐదు సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న పిల్లలలో 35.5 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. 19.3 శాతం మంది ఎత్తుకు తగిన బరువు లేరు. 32.1 శాతం మంది వారి వయస్సుకు తగ్గ బరువు లేరు. మూడు శాతం మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. 15 నుండి 49 మధ్య వయస్సు గల వారిలో 18.7 శాతం మందిలో పోషకాహరలోపం ఉంది. రక్తహీనత కూడా ఎక్కువ మందిలో ఉంది. ప్రపంచంలో తలసరి పడకల సంఖ్య తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రతీ పదివేల జనాభాకు 15 పడకలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ ఆరోగ్య విధానం 2017 అనేది అన్ని రంగాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వానికి మార్గదర్శకత్వం మద్దతునిచ్చే ప్రణాళిక. ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం, వ్యాధులను నివారించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి అనేక పనులను చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచాలని పాలసీ తెలిపింది. ఇది నాణ్యతతో పాటు సరసమైన ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2025 నాటికి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు మరియు మధుమేహం యొక్క అకాల మరణాలను 25 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశ వృద్ధాప్య జనాభా 2050 నాటికి మొత్తం జనాభాలో 20.8%కి రెట్టింపు అవుతుందని అంచనా. ఈ పెరుగుతున్న వృద్ధాప్య జనాభా వయస్సు సంబంధిత ఆరోగ్య సవాళ్లలో పెరుగుదలతో కూడి ఉంటుంది.

2022 ఆర్థిక సర్వేలో ఆరోగ్య సంరక్షణపై భారతదేశం యొక్క ప్రభుత్వ వ్యయం 2021-22 లో జిడిపిలో 2.1 శాతంగా ఉంది. ఇంతకు ముందు 2019-20లో 1.3 శాతంగా, 2020-21లో 1.8 శాతంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం ప్రతీ వేయి మంది జనాభాకు ఒక డాక్టర్ అవసరమని తెలుపగా మనదేశంలో 834 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉన్నారు. జాతీయ వైద్య కమీషన్ ప్రకారం 5.65 లక్షల ఆయుష్ వైద్యులు 13.809 లక్షల అల్లోపతి వైద్యులు ఉన్నారు. అంతేకాక 34 లక్షల నర్సింగ్ సిబ్బంది, 13 లక్షల అనుబంధ, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఉన్నారని తెలిపింది.

భారత్ ఎదుర్కుంటున్న సవాళ్లు:
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలో అత్యధిక సంఖ్యలో మన దేశంలోనే ఉన్నారు. ఇందులో 2019 మరియు 2021 మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క ఐదవ రౌండ్ ప్రకారం 15-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 6.4 శాతం మరియు పురుషులు 4.0 శాతం ఊబకాయంతో ఉన్నారు. దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుంచి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 80 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 135 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. హృదయ సంబంధ వ్యాధులు మన దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కారణంగా సంభవించే 17.9 మిలియన్ల మరణాలలో ఐదవ వంతు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. అదనంగా రక్తపోటు, అవయవాల జబ్బులు మొదలైనవి అదనం.

అనారోగ్యానికి కారణాలు:
ఒత్తిడితో కూడిన జీవనశైలి పెద్ద కారణం. క్రమరహిత ఆహారపు అలవాట్లుతో మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. రాత్రులు ఆలస్యంగా నిద్రపోతున్నారు. కనీసం వ్యాయామం చేయడం లేదు. ఒకే దగ్గర కూర్చొని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. యువతలో నిత్యం పొగాకు, మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. వీటి వినియోగం వలన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పాడైపోతున్నాయి. వివిధ కేన్సర్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నిర్మాణ కార్యకలాపాలు పెరుగుదల, ఎక్కువవుతున్న కర్మాగారాలు, వాహనాల సంఖ్య పెరగడం వలన గాలి కాలుష్యం అవుతుంది. దీనివలన ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. నీటి కాలుష్యము వలన, శుద్ధి చేయని నీరు త్రాగడం వలన పొట్టకు సంబందించిన వ్యాధులు పెరుగుతున్నాయి.
ప్రభుత్వాలు వాటి పరిధిలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి బాగానే కృషి చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక సేవలను అందించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) టెలిమెడిసిన్ ప్రాజెక్టును ప్రారంబించింది.

పరిష్కారాలు:
జాగింగ్ లేదా కనీసం అరగంట పాటు నడవడం లాంటి కనీసం వ్యాయామాలు చేయాలి. క్రమరహిత భోజనాలకు బాయ్ చెప్పాలి. శాఖాహారం ఎక్కువగాను , మాంసాహారం తక్కువగా ఉంటూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మద్యం తీసుకోకపోవడం మంచిది. యోగా, ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. వేళకు నిద్రకుపక్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు ఆరోగ్యబీమాలని తీసుకుంటున్నారు. మన దేశంలో కూడా ఆరోగ్య బీమాలను తీసుకుంటే అత్యవసర సమయంలో వారిని ఆదుకుంటుంది.

జనక మోహన రావు దుంగ
సోషల్ అనలిస్ట్
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News