Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Bhart Ratna to Advani: అద్వానీకి భారతరత్న వెనుక మోడీ వ్యూహం?

Bhart Ratna to Advani: అద్వానీకి భారతరత్న వెనుక మోడీ వ్యూహం?

అద్వానీ ఫ్యాన్స్ ను సంతృప్తిపరచటమే..

రాజకీయ కురువృద్దుడు లాల్‌ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో చేసిన కృషికి గుర్తింపుగా అద్వానీకి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం ఉంది. బీజేపీలో అద్వానీ గ్రూపును కూడా సంతృప్తపరచాలన్నదే నరేంద్రుడి వ్యూహం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఏ ఒక్క వర్గాన్ని దూరం చేసుకోకూడదన్నదే నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయం ఆలోచన అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఏ పావును కదపాలో ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసు. ఈ విద్యలో ఆయన ఘనాపాఠి. ఈ విషయంలో ప్రస్తుత భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీకి ఎవరూ సాటిరారు. ఓసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, కులగణనతో దేశంలోని ఓబీసీల చాంపియన్‌గా జేడీ ( యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవతరించారు. ఈ పరిణామంతో ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. ఇంకేముంది… కొన్ని దశాబ్దాల కిందట బీహార్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌కు ఇటీవల భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కర్పూరీ ఠాకూర్‌ బీహార్‌కు చెందిన ఓబీసీ నేత. సీనియర్ సిటిజన్లను మినహాయిస్తే ఇప్పటితరానికి కర్పూరీ ఠాకూర్‌ తెలియకపోవచ్చు. కర్పూరీ ఠాకూర్ నిజాయితీకి నిలువెత్తు ప్రతీక. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు…ఉండకూడదు కూడా. ఈ నేపథ్యంలో కర్పూరీ ఠాకూర్‌కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించి ఓబీసీల చాంపియన్‌ తానేనని సంకేతాలు పంపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదే తరహాలో రాజకీయ కురువృద్దుడు, బీజేపీ సీనియర్ నేత లాల్‌ కృష్ణ అద్వానీకి తాజాగా భారతరత్న పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అంటే ఒకప్పుడు బనియా, బ్రాహ్మణ్ సామాజికవర్గాలకే పరిమితమైన ఉత్తరాది పార్టీగా రాజకీయవర్గాల్లో ఒక అభిప్రాయం ఉండేది. అలాంటి తరుణంలో బీజేపీని దేశం నలుమూలలా విస్తరింపచేశారు లాల్‌ కృష్ణ అద్వానీ. ఆదివాసీలు, క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ కాలు మోపిందంటే ఆ ఘనత లాల్‌ కృష్ణ అద్వానీదే.

అద్వానీ రాజకీయ ప్రస్థానంలో కీలకఘట్టం రథయాత్ర
లాల్‌ కృష్ణ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రథయాత్ర ఒక కీలకఘట్టం. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని 90వ దశకంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. రామమందిర నిర్మాణానికి పునాది వేసిన అద్వానీ రథయాత్రను సెప్టెంబర్ 25న ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ జయంతి. దీన్ దయాళ్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ రథయాత్ర ప్రారంభించారు లాల్ కృష్ణ అద్వానీ. మొత్తం పది వేల కిలోమీటర్ల మేర రథయాత్ర చేసి చివరకు అక్టోబరు 30న అయోధ్య చేరాలన్నది అప్పట్లో అద్వానీ ఆలోచన. అయితే బీహార్‌లో అద్వానీ రథయాత్రకు బ్రేకులు వేసింది అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం. అయితే అది వేరే విషయం. 1990 నాటి అద్వానీ రథయాత్ర ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. అద్వానీ రథయాత్రకు సంబంధించి ఒక విశేషం ఉంది. 1990నాటి అద్వానీ రథయాత్రలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. నరేంద్రుడి రాజకీయ జీవితం, అద్వానీ రథయాత్రతో ముడిపడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. వాస్తవానికి అద్వానీ యాత్ర చేసిన రథం ఒక మినీ ట్రక్కు. యాత్ర కోసం ఈ మినీ ట్రక్కును రథంగా రీడిజైన్ చేశారు. రథయాత్ర సందర్భంగా రాత్రిళ్లు మితాహారంతో పాటు ఒక గ్లాసు పాలు తీసుకునే వారు అద్వానీ. వాహనంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్ పై నుంచుని ప్రజలనుద్దేశించి అద్వానీ ప్రసంగించేవారు. రథయాత్ర సందర్భంగా అద్వానీ చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండేవి. ప్రసంగం అంటే గంటలు గంటలు ఉండేవి కావు. చాలా క్లుప్తంగా ఉండేవి. ఎక్కడైనా సరే ఐదు నిమిషాలు మించకుండా అద్వానీ ప్రసంగించేవారు. ప్రధానంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆవశ్యకత చుట్టూనే అద్వానీ ప్రసంగాలు ఉండేవి. అంతకుమించి సాధారణ రాజకీయాలను అద్వానీ తన ప్రసంగాల్లో ఎక్కడా ప్రస్తావించేవారు కాదు. అంతేకాదు, అయోధ్య అంశంపై హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరేవారు. ఏమైనా రథయాత్ర తరువాత జాతీయ రాజకీయాల్లో అద్వానీ ఒక వెలుగు వెలిగారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ కూడా దేశవ్యాప్తంగా విస్తరించింది.

అద్వానీ వర్గాన్ని దగ్గరకు తీసుకోవడమే లక్ష్యం
ఇదిలా ఉంటే పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, కాంగ్రెస్‌ ముఠా కల్చర్ బీజేపీలోనూ కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ మోతాదులు ఉంటుంది కాబట్టి, ముఠా కలహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎవరు అవునన్నా, కాదన్నా బీజేపీలో అద్వానీకి ఒక వర్గం అంటూ ఉంది. బీజేపీలో చాలాకాలంపాటు అద్వానీ వర్గం హవా నడిచింది. అయితే నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయం తెరమీదకు వచ్చిన తరువాత అద్వానీ వర్గం ప్రాధాన్యం తగ్గిందంటారు రాజకీయ పరిశీలకులు. ఉద్దేశపూర్వకంగా అద్వానీ వర్గాన్ని నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయం దూరం పెట్టిందన్న గుసగుసలు హస్తిన రాజకీయవర్గాల్లో చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ మాట బహిరంగంగా అనే ధైర్యం ప్రస్తుతం ఏ బీజేపీ నాయకుడికి లేదు. ఈ సంగతి ఎలాగున్నా నరేంద్రుడి జమానాలో లాల్ కృష్ణ అద్వానీకి రావాల్సిన గౌరవం రాలేదన్నది లోలోపల ఆయన వర్గం ఆవేదన. ఇదిలా ఉంటే, దాదాపుగా ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలోని అద్వాన్ని వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకోవాలన్న వ్యూహంతోనే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఎంపిక చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

     - ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News