Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్No Capital punishment: మరణ శిక్షకు స్వస్తి చెప్పరా?

No Capital punishment: మరణ శిక్షకు స్వస్తి చెప్పరా?

మరణ శిక్షలు నేరాలను తగ్గిస్తున్న జాడలే లేవు

భారతీయ శిక్షా స్మృతి (ఐ.పి.సి) స్థానంలో ప్రవేశించబోతున్న భారతీయ న్యాయ సంహితను కూలంకషంగా పరిశీలిస్తున్న పార్లమెంటరీ మరణ శిక్ష రద్దుకు సంబంధించి ఎటువంటి సిఫా రసునూ చేయకపోవడం నిరుత్సాహం కలిగిస్తోంది. ఎందరో న్యాయ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు మరణ శిక్ష రద్దును కోరుతున్నప్పటికీ దేశీయాంగ వ్యవహారాలకు సంబంధించిన స్థాయీ సంఘం కూడా ఈ సూచనలకు ఎటువంటి ప్రాధాన్యమూ ఇవ్వకపోగా, ‘ఇది ప్రభుత్వం పరిశీలించాల్సిన విషయం’ అంటూ దీన్ని పక్కనపెట్టేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మరణ శిక్షకు సంబంధించిన వాదోపవాదాలను తాము సానుభూతితో పరిశీలించామని, న్యాయస్థానాలు ఒక్కోసారి పొరపాటున మరణ శిక్ష వేయడానికి అవకాశం లేకపోలేదనే విషయం తమకు కూడా అర్థమైందని, నిర్దోషులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మరణ శిక్ష పడకూడదనే అభిప్రాయంతో తాము కూడా ఏకీభవిస్తున్నామని ఈ స్థాయీ సంఘం పేర్కొంది. నిజానికి, పలువురు న్యాయ నిపుణులు మరణ శిక్షను రద్దు చేయడమే మంచిదని అనేక సూచనలు చేయడం జరిగింది. దేశంలో అనేక దిగువ స్థాయి న్యాయస్థానాలు అనేక పర్యాయాలు తీర్పులు వెలువరించినప్పటికీ, సుప్రీంకోర్టు అనేక సందర్భాలలోమ వాటిని కొట్టేయడం, అతియ తక్కువగా మాత్రమే మరణ శిక్షలు విధించడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఎక్కువ సంఖ్యలో మరణ శిక్షలు విధించడం వల్ల దేశంలో ఎక్కడా నేరాలు తగ్గుతున్న సూచనలు లేవని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేయడానికే అనుకూలంగా ఉన్నాయని కూడా వారు స్పష్టం చేశారు. 2007-22 సంవత్సరాల మధ్య సుప్రీంకోర్టు కేవలం ఏడుగురికి మాత్రమే మరణ శిక్షలు విధించిందని, 2023లో కూడా అనేక కేసుల్లో ఇవి ‘అత్యంత అరుదైన కేసులు’ కావంటూ పలువురి మరణ శిక్షలను జీవిత ఖైదులుగా తగ్గించడం కూడా జరిగిందని వారు గుర్తు చేశారు.
ఈ కమిటీల్లోని సభ్యులలో కొందరు మరణ శిక్ష విషయంలో తమ అసమ్మతిని అనేక పర్యాయాలు వెల్లడించారు. ఈ మరణ శిక్షలు నేరాలను, నేర ప్రవృత్తిని తగ్గిస్తున్న జాడలే లేవని, మరణ శిక్షలు విధించడం కంటే, మరింత కఠిన శిక్షలను అమలు చేయడం వల్ల నేరస్థులలో పరివర్తన వచ్చే అవకాశం ఉంటుందని వారు సూచించారు. మరణ శిక్షలు పడిన వారిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలకు చెందినవారనే విషయాన్ని కూడా విస్మరించకూడదని వారు స్పష్టం చేశారు.
ఐ.పి.సి, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌ ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టదలచుకున్న చట్టాలకు, వీటికి పెద్దగా తేడా ఏమీ లేదని కూడా వారు వ్యాఖ్యానించారు. ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంట్‌ పరిశీలనకు తీసుకున్నప్పుడు, మరణ శిక్ష రద్దు వంటి కొత్త అంశాలకు ఇందులో స్థానం కల్పించే ఆలోచన చేయాలని కమిటీల సభ్యులు అభ్యర్థించారు. భారతీయ న్యాయ సంహిత ఇప్పటికే ఇందులో జీవిత ఖైదు గురించి విస్తృతంగా వివరించిందని, అందువల్ల మరణ శిక్ష స్థానంలో జీవిత ఖైదును ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేయాలని న్యాయ నిపుణులు సలహా ఇవ్వడం జరిగింది. జీవిత ఖైదును నేరస్థులు తాము చేసిన నేరానికి జీవితాంతం బాధపడేలా, పశ్చాత్తాపం చెందేలా వేసే శిక్షగా ఇందులో అభివర్ణించాన్ని కూడా వారు గుర్తు చేశారు. దీన్నే మరణ శిక్ష విషయంలో కూడా ఆలోచించాలని వారు సూచించడం జరిగింది. జీవిత ఖైదు పడినవారిని రాజకీయ కారణాలపై విడుదల చేయడాన్ని మానుకోవాలని, జీవిత కాల శిక్షకు మధ్యలో విరామాలను, క్షమాపణలను ప్రకటించడానికి, శిక్షా కాలాన్ని తగ్గించడానికి కూడా స్వస్తి చెప్పాలని వారు ఈ సందర్భంగా సిఫారసు చేశారు. శిక్షా కాలాన్ని తగ్గించడమనేది మానవత్వంతో కూడుకున్న వ్యవహారం కావాలే తప్ప రాజకీయ కారణం కాకూడదని వారు స్పష్టం చేశారు. మరణ శిక్షను శాశ్వతంగా రద్దు చేయడం అనేది జరిగితే అది న్యాయ శాస్త్ర చరిత్రలో ఒక పెద్ద సంస్కరణగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News