Sunday, July 14, 2024
Homeఓపన్ పేజ్Elections & Technology: ఎన్నికల్లో సాంకేతికత ఫలించేనా?

Elections & Technology: ఎన్నికల్లో సాంకేతికత ఫలించేనా?

ఎన్నికల ప్రక్రియ మరింత సరళతరం చేసిన ఈసీ

ఎన్నికల సంఘం వినియోగించే ఆధునిక సాంకేతికత రాజకీయ నాయకుల ఆగడాలకు కళ్లెం వేసేనా ! ఓటు హక్కు ఉన్న వారికి దిక్సూచి అయ్యేనా ! అయితే ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్దతి గాడిలో పడినట్టే, ఎన్నికల నియమాలకు తిలోదకాలిచ్చి ఇష్టా రాజ్యముగా వ్యవహరించే నాయకులకు సీ విజిల్ యాప్ తో ముక్కు తాడు వేసినట్లే. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా నిబంధనను పాటించక పోయినా దానికి సంబంధించిన వీడియోలను చిత్రాలను యాప్ లో నమోదు చేస్తే రెండు గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకునే వెసలుబాటు కల్పించడం గొప్ప విషయం అయినా దీని గురించి ప్రజలలో అవగాహన లేదు. పబ్లిసిటీ అంతకన్నా లేదు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టవలసిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా సభలు సమావేశాలు జరిపిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడవు. ప్రధాన ఎన్నికల అధికారి నిర్లక్ష్యం వహించినా, అధికార పార్టీ ఒత్తిడికి లొంగిపోయినా ఫలితాలు శూన్యం. కొత్తగా వచ్చిన సువిధ యాప్ తో ఎన్నికల బరిలో దిగిన వారు కార్యాలయానికి వెళ్ళకుండానే సభలు నిర్వహించడానికి అనుమతులకు అవకాశం కల్పించింది. 48 గంటల ముందు ఈ యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది. పోలీస్ రెవెన్యూ ఎన్నికల సంఘం అధికారులకు సువిధ యాప్ లో లాగిన్ సౌకర్యం కూడా కల్పించబడినది.. నిభందనలు నియమావళికి అనుగుణంగా ఉంటేనే అనుమతులు మంజూరు చేయడం విరుద్ధముగా ఉంటే తిరస్కరించడం. కారణాలు సైతం చెప్పడం ద్వారా కొత్త విధానానికి నాంది పలికింది. ఎన్నికల సంఘం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నా అమలుకు నోచుకుంటాయా అన్నదే అనుమానం. ఓటును ఎలా సద్వినియోగం చెయ్యాలి, దాని విలువ ఏంటి మొదలైన విషయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలి. “ఓటు పిచ్చి వాడి చేతిలో రాయి” అయితే ప్రజాస్వామ్యం కుప్పకూలి పోతుంది. దీనిని తీవ్రంగా పరిగణించి ఆచి తూచి సమర్థవంతమైన అభ్యర్థికి ఓటేయాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి నేరచరిత్ర ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం మరో అడుగు ముందు వేసి “నో యువర్ కాండిడేట్ కె.వైసి” ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించడం ముదావహం. నామినేషన్ సందర్భముగా దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఇట్టి వెబ్సైట్ లో చూసే సౌకర్యం కల్పించారు. ఇది కాకుండా నలుబై శాతంపైగా వైఫల్యం ఉన్నా వారికి 80 ఏండ్లకుపై బడిన వారికి ఇంటి వద్దనుండే ఓటింగ్ లో పాల్గొనడానికి ఈసీ మొదటి సారి అవకాశం కల్పించడం గమనించదగిన విషయం. సెల్ ఫోన్ లో యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని, మొబైల్ నంబర్ సహాయంతో రిజిస్టర్ చేసుకొని, ఓటిపి ఆధారంగా పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పోటీ చేసే అభ్యర్థులకు వాహనాల వాడుకం కూడా కట్టుదిట్టం చేయడం శుభపరిణామం. సుగం యాప్ ద్వారా మాత్రమే అనుమతులు తీసుకోవాలి. రెండు వాహనాల కన్నా ఎక్కువ వాడుకోదల్చుకుంటే అనుమతి తప్పని సరి లేని యెడల వాహనాలు సీజ్ చేయబడుతాయి. ఎలక్షన్ లలో దొరికే నగదు మద్యము డ్రగ్స్ బహుమతులు ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేయడంతో పాటు ఐటి శాఖను సకాలములో అప్రమత్తం చేయడానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం అనే యాప్ ను తీసుకొని రావడముతో అభ్యర్థి ఆటలు సాగనివ్వకుండా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. దీనితో పాటు “ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం” ప్రవేశ పెట్టడంతో పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించవచ్చు. ఓటర్లకు సహాయకారిగా ఉండేందుకు మై ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను కూడా ప్రవేశ పెట్టి, ప్రత్యేకతను చాటుకున్నారు. సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని ఓటర్ కార్డ్ నంబర్ నమోదు చేస్తే ఏ పోలింగ్ కేంద్రములో ఓటు వేసే అవకాశం ఉందో వివరాలు తెల్సుకోవచ్చు. జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అన్న విషయం తెల్సుకోవచ్చు. ఎన్నికల దీపావళిలో నోట్ల కట్టలను గుట్టలుగా వెదజల్లే అవకాశం లేకపోవచ్చు. ఎన్నికల సంఘం మొదటి సారిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేయడంతో ఆర్థిక అవకతవలను అరికట్టవచ్చు. అభ్యర్థి ఆస్తులు, ఆదాయం, అప్పుల చిత్రాల విశ్లేషణ ప్రక్రియ కూడా చేపట్టడంతో అభ్యర్థి ఆగడాలకు కళ్లెం వేసినట్లే అవుతుంది. ఐ టి వారిని రంగంలోకి దించి, ఎన్నికల ఖర్చు కేసులు ఆస్తులపై డేగ కన్ను వేసింది. ఎన్నికల కమీషన్ గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమైంది.. నగదు వస్తు రూపేణా పంపకాలు చేయాలంటే జంకుతున్నారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ చర్యలు చేపట్టడముతో ఎన్నికలు సక్రముగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఓటర్లలో నీతి నిజాయితీ ఉండి ఓటును సద్వినియోగం చేసినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుంది. చట్టాలు నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ ఫలితం శూన్యమే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో అవినీతి పెచ్చుపెరిగితే ఆకలి కేకలు అంబరం అంటితే పాలకులతో పాటు ఓటు వేసిన వారిది కూడా తప్పే, ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోసింది ఓటర్లే కావడం విశేషం. ఓటు మన భవితకు పునాది. ఇప్పటికైనా ఓటు హక్కు గలవారు ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఓటును సద్వినియోగం చేసుకోవాలి “గొర్రెల మందకు తోడేలును మాత్రం కాపలా పెట్టవద్దు.

- Advertisement -

పూసాల సత్యనారాయణ
హైదరాబాద్
9000792400

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News