Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Russia-Ukraine war@2 years: రష్యా యుద్ధానికి రెండేళ్లు !

Russia-Ukraine war@2 years: రష్యా యుద్ధానికి రెండేళ్లు !

ఫిబ్రరి 24 ……రెండేళ్ల కిందట ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు మొద‌లు పెట్టిన రోజు. యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అయింది. రెండేళ్ల కిందటి వరకు జ‌నంతో కిట‌కిట‌లాడిన ఉక్రెయిన్ న‌గ‌రాల్లో ఇప్పుడు ఎటు చూసినా శ‌వాల గుట్టలే క‌నిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ఏమాత్రం వీలున్నా ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స‌పోతున్నారు. రాజ‌ధాని న‌గ‌ర‌మైన కీవ్ శివారు పట్టణమైన బుచాలో ర‌ష్యా సైనికులు చేసిన అకృత్యాలను చూస్తే స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌వంచుకోవాల్సిందే. ఇళ్లలో ఉన్న ఆడ‌వారిని తుపాకులు చూపించి భ‌య పెట్టి న‌డివీథుల్లోకి తీసుకువ‌చ్చి అఘాయిత్యాలకు పాల్పడినట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి.అంతేకాదు ఇళ్లలోకి జొర‌బ‌డి అంద‌రినీ బ‌య‌ట‌కు లాక్కొచ్చి చేతులు కట్టేసి బుచా పౌరుల‌ను ర‌ష్యా సైనికులు కాల్చి చంపిన‌ట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే బుచా పట్టణంలో రష్యా ఆర్మీ న‌ర‌మేథం కొనసాగించింది. బుచా రాక్షసకాండ యావ‌త్ ప్రపంచాన్నినివ్వెర‌ప‌ర‌చింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్‌ నాయ‌క‌త్వంలోని నాజీల సైన్యం చేసిన దారుణాల‌ను బుచా మార‌ణ‌కాండ గుర్తుకు తెచ్చింది. ర‌ష్యా సైనికులు యుద్ధ నేరాల‌కు పాల్పడిందని అగ్రరాజ్యమైన అమెరికా నిర్థారించింది. ఇదే విషయమై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా స్పందించారు. బుచా మారణకాండను సభ్యసమాజం మరువలేదన్నారు. మిగతా దేశాలతో కలిసి యుద్ద నేరాలకు పాల్పడిన రష్యాను అంతర్జాతీయ చట్టాల ముందు నిలబెడతామని కమలా హారిస్‌ హెచ్చరించారు. కిందటేడాది మ్యూనిచ్‌లో జరిగిన జీ -7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కూడా రష్యా దాష్టీకలపై తీవ్రస్థాయిలో మండిపడింది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తామని జీ -7 దేశాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు మాస్కోపై మరికొన్ని ఆంక్షలు విధిస్తామమని పేర్కొన్నాయి. రష్యా బలగాల దెబ్బకు విలవిలలాడతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని తెగేసి చెప్పాయి. నాటో కూట‌మిలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలే మౌలికంగా ర‌ష్యా దాడులు చేయ‌డానికి ప్రధాన కార‌ణంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ లోకి నాటో కూట‌మి సేన‌లు ప్రవేశిస్తే త‌మ దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుంద‌నేది ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ వాద‌న‌. దీంతో నాటో సేన‌ల నుంచి ర‌ష్యాను కాపాడుకోవ‌డానికే ఉక్రెయిన్ పై యుద్ధం మొద‌లుపెట్టిన‌ట్లు పుతిన్ త‌న వాద‌న వినిపించారు. అయితే ర‌ష్యా సేన‌ల దాడులు తీవ్రతరం కావ‌డంతో దేశ ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ రెండు నిర్దిష్ట ప్రతిపాదనలు చేశారు. మొద‌టిది, నాటో కూట‌మిలో చేర‌డానికి ఉక్రెయిన్ ఎలాంటి ప్రయత్నం చేయ‌దు. రెండోది ఉక్రెయిన్ లోని ర‌ష్యా జాతీయులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై రాజీకి సిద్ధం. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలు చాలా కీల‌క‌మైన‌వి. ర‌ష్యా బలగాల నుంచి తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఉక్రెయిన్ నాలుగు అడుగులు వెన‌క్కి వేసింది. జెలెన్‌స్కీ మెట్టు దిగి కీల‌కమైన ప్రతిపాదనలు చేసినా రష్యా దాడులు ఆగలేదు. భ‌విష్యత్తులో ర‌ష్యా చుట్టుపక్కల ఏ దేశ‌మైనా నాటో కూట‌మి పేరు ప్రస్తావించడానికి కూడా భ‌య‌ప‌డాలి అన్నట్లుగా ప్రవర్తించారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.

- Advertisement -

రష్యా యుద్ధానికి ముగింపు ఎప్పుడు ?
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణమాలను పరిశీలిస్తే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కిందటేడాది సెప్టెంబరులో రైలెక్కి రష్యా వెళ్లారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి రష్యా అధినేత పుతిన్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా బాగా అలసిపోయింది. ప్రస్తుతం రష్యా దగ్గర అవసరమైన ఆయుధాలు కూడా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయిగా ఉండేది. వాస్తవానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. దీంతో ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్‌ దేశాన్ని ప్రపంచపటంపై లేకుండా రష్యా చేస్తుందని అందరూ భావించారు. అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ నిలబడింది. భారీ సంఖ్యలో సైనికులు, ప్రజలను కోల్పోయిన ఉక్రెయిన్‌ మనోధైర్యం కోల్పోలేదు. రష్యా సేనలకు దీటుగా బదులివ్వడం మొదలెట్టింది. కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ కాచుకుంది. యుద్ధరంగంలో డిఫెన్స్ ఆడింది. రష్యాతో దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్‌ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. అలాంటి ఇలాంటి ఆయుధాలు కాదు. అత్యంత అధునాతన ఆయుధాలు. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్‌ యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. అప్పటివరకు ఆత్మరక్షణంలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా దాడులు చేసే స్థాయికి వెళ్లింది. రష్యాపై ఎడాపెడా దాడులు మొదలెట్టింది. ఉక్రెయిన్ ఎదురుదాడులు చేస్తుందని రష్యా ఊహించలేదు. ఉక్రెయిన్ బలగాలకు దీటుగా కౌంటర్‌లు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. ఆయుధాల విషయంలో మొదటినుంచి రష్యాకు అండగా నిలబడింది ఉత్తర కొరియానే. యుద్ధ ప్రారంభమైన తరువాత రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసింది. ఇదే విషయాన్ని అమెరికా అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై ఆరోపించింది. అయితే అమెరికా మాటలను, ఆరోపణలను పట్టించుకోలేదు ఉత్తర కొరియా.ఇదిలా ఉంటే యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయిగా మారడంతో మరోసారి ఆయుధాల కోసం ఉత్తర కొరియా వైపు చూశాడు పుతిన్. దీంతో పుతిన్‌తో ఆయుధాల సంగతి ముఖాముఖి మాట్లాడటానికి ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లి ఏకంగా ఒప్పందం చేసుకున్నారు కిమ్. రష్యాకు ఆయుధాలు సరఫరా చేయడానికి తాజాగా ఉత్తర కొరియా అంగీకరించింది. మొత్తానికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని కిమ్ ఎగదోశాడు.

యుద్ధం అంటే అంతులేని విషాదమే !
యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు. అంతులేని విషాద‌మే. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు అంతులేని విషాదాన్ని మోసుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే హింస‌కు తావులేని స‌మాజాన్ని ప్రపంచం కోరుకుంది. శాంతి కోసం ప‌రిత‌పించింది. జెలెన్ స్కీ నాలుగు అడుగులు వెన‌క్కి త‌గ్గినా ఉక్రెయిన్ పై దాడులు ఆపడానికి ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ సిద్ధంగా లేక‌పోవ‌డం ప్రపంచశాంతిని కోరేవారికి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఒక ప‌రిణ‌తి చెందిన దేశాధ్యక్షుడిలా పుతిన్ ప్రవర్తించడం లేద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధోన్మాదిలా పుతిన్ ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అగ్నికి వాయుడు తోడయినట్లు మరో యుద్ధోన్మాది కిమ్ కూడా పుతిన్‌కు తోడయ్యాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడదంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

పీపుల్స్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ !

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు జెలెన్‌స్కీ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు జెలెన్‌స్కీ. టీవీ రంగంలో ఆర్టిస్ట్‌గా జెలెన్‌స్కీ జీవితం ప్రారంభించారు. ఉక్రెయిన్ టీవీ షో ల్లో నటించారు. మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యారు. ఒకప్పుడు కమెడియన్‌గా అందరినీ నవ్వించిన జెలెన్ స్కీ ఇప్పుడు వార్ హీరో అవతారమెత్తారు. రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే తమను ఎవరూ పట్టించుకోవడం లేదనీ, అందరూ చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారని బేలగా ప్రపంచం ముందు ఆవేదన వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ ఆ తరువాత రాటు దేలారు. యావత్ ప్రపంచం దృష్టిలో ఓ హీరో అయ్యారు. రష్యా బలగాల దాడులతో యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి సైనికుడి దుస్తులు ధరించి వీథుల్లోకి వచ్చి అందరికీ ధైర్యం చెప్పారు. రష్యా బాంబు దాడులకు అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తా కానీ, తగ్గేదేలే అంటున్నారు. నిన్నమొన్నటివరకు ఉక్రెయిన్ ఆత్మరక్షణలోనే ఉంది.అయితే ఉక్రెయిన్ వైఖరిలో కొంతకాలంగా మార్పు వచ్చింది. యుద్ధంలో అఫెన్స్‌ కు వెళ్లాలని ఉక్రెయిన్ డిసైడ్ అయింది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్‌ కు అమెరికా, జర్మనీ దేశాలు అత్యంత ఆధునిక యుద్ధట్యాంకులు అందించాయి. ఇవి చాలవన్నట్లు మరిన్ని ఆయుధాల కోసం జెలెన్‌స్కీ యూరప్‌లోనూ పర్యటించారు.ఈ పరిణామాలను చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒక దశలో రష్యా అణ్వాయుధాలను కూడా ప్రయోగిస్తుందన్న వార్తలొచ్చాయి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని హెచ్చరించారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

                  -ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ , 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News