Thursday, April 18, 2024
Homeఓపన్ పేజ్Migratory species are very imp: వలస పక్షులు అంతరిస్తే మానవ మనుగడకే ప్రమాదం

Migratory species are very imp: వలస పక్షులు అంతరిస్తే మానవ మనుగడకే ప్రమాదం

పర్యావరణపరంగా ప్రపంచం పరిస్థితి మరింత దిగజారిపోయింది

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో ఇటీవల వలస పక్షులు, జంతువులపై జరిగిన అంతర్జాతీయ స్థాయి సమావేశం ప్రపంచవ్యాప్త వలస ప్రాణుల స్థితిగతుల మీద ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి విడుదల చేసింది. దాని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వలస పక్షులు, జంతువులు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంటోందని తెలిసింది. గాలిలోనూ, భూమి మీదా, నీళ్లలోనూ సంచరించే ఏ వలస ప్రాణికీ భద్రత మృగ్యమవుతోందని, వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి వలస ప్రాణుల సంరక్షణ సదస్సు గతంలో తయారు చేసిన వలస ప్రాణుల జాబితాలో పేర్కొన్న సంఖ్య 44 శాతానికి పైగా తగ్గిపోయింది. అంతేకాదు, ఇందులో అయిదవ భాగం వలస జీవులు క్రమంగా అంతరించిపోవడం కూడా జరుగుతోంది. కాగా, ఈ జాబితాలో పేర్కొన వలస చేపల్లో 97 శాతం చేపలు ఇప్పటికే అంతరించిపోవడం జరిగింది. ఇక ఈ జాబితాలో పేర్కొనని వలస జీవులు కూడా సంఖ్యాపరంగా కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం అనేక విధాలుగా ప్రమాదంలో పడిన వలస జీవులలో 76 శాతం జీవులు దాదాపు అంతరించిపోయాయి. మరో 87 శాతం జీవుల జనాభా అనేక కారణాల వల్ల బాగా తగ్గిపోయింది. ఈ ప్రమాదం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ఈ ధోరణి ప్రపంచమంతా కనిపిస్తోంది.

- Advertisement -

ఆహారం కోసం, సంతానాన్ని కనడం కోసం ఏటా కోట్లాది జంతువులు, పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి లక్షల మైళ్లు ప్రయాణం చేస్తుంటాయి. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడంలో అవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇవి పుప్పొడిని తీసుకు వెళ్లడం ద్వారా హరితదనం విస్తరించడానికి తోడ్పడుతుంటాయి. పౌష్టికాహారాన్ని రవాణా చేస్తుంటాయి. ప్రాణాంతక క్రిమికీటకాలను అంతం చేస్తుంటాయి. అయితే, వాటి ఉనికిని, అస్తిత్వాన్ని మానవ కార్యకలాపాలే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గాలిని, నీటిని, భూమిని కలుషితం చేస్తుండడం వల్ల వాటి ఆయుష్షు క్రమంగా తగ్గిపోతోంది. పురుగుల మందులు, క్రిమిసంహారక మందులను అతిగా ఉపయోగిస్తుండడంతో అవి వాటికి విషతుల్యంగా మారి వాటి ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఇక అడవులు క్షీణించిపోతుండడం, వాటి ఆవాస ప్రాంతాల్లోకి మనుషుల చొచ్చుకుపోతుండడం వగైరా కారణాల వల్ల వాటి ఆశ్రయాలు, ఆహార వనరులు దారుణంగా దెబ్బతింటున్నాయి.

ముఖ్యంగా వాటి ఆశ్రయాలను, ఆవాసాలను మనుషులు ఆక్రమించుకుంటుండడం, అడవులను నరికివేస్తుండడం, వాటిని వేటాడడం వంటి కార్యకలాపాల వల్ల వాటి ఉనికికి ప్రమాదం వచ్చి పడుతోందని ఆ నివేదిక పేర్కొంది. జల చరాల విషయానికి వస్తే, జల ప్రాంతాలను కూడా మనుషులు కబ్జా చేయడం, వాటిని అతిగా వేటాడడం వంటి కారణాల వల్ల అవి అంతరించిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. వ్యవసాయ భూములు విస్తరించడం, రవాణా సౌకర్యాలు, ప్రాథమిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల కూడా కొన్ని భూమి సంబంధమైన జంతువులు కనుమరుగైపోతున్నాయి. నగరాల్లోని వీధి దీపాల వల్ల కూడా అవి తమ మార్గం తెలుసుకోలేకపోతున్నాయని, అందువల్ల అవి వలసపోవడం తగ్గిపోతోందని నివేదిక పేర్కొంది. ఈ మధ్య కాలంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెనుమార్పులు కూడా వాటికి తీవ్ర ప్రమాదంగా, ప్రతిబంధకంగా మారాయి.

దేశ స్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి దారుణ, ఆందోళనకర పరిస్థితులను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. వాతావరణ మార్పులను చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు, కాంతి, వాయు, జల, భూకాలుష్యాల నివారణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమున్నా లేకపోయినా వాటిని చంపడం, వేటాడడం, వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించి, సంరక్షించడం, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వలస జీవుల సదస్సు రూపొందించిన జాబితాలోని వలస జీవులన్నిటికీ వీలైనంతగా రక్షణ కల్పించడం, వాటి ఆవాసాలను, ఆశ్రయాలను కాపాడడం వంటివి చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. విధానాలను మార్చడం ద్వారా, సానుకూల చర్యలు చేపట్టడం ద్వారా కొన్ని వలస జీవుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వలస పక్షులు అంతరించిపోయే పక్షంలో పర్యావరణపరంగా ప్రపంచం పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. అసలు మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మానవ జీవితాలు, ఇతర ప్రాణుల జీవితాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News