ఒక మనిషి ఒక భాషలో పరిపూర్ణుడు కావడానికే ఒక జీవిత కాలం సరిపోదు. అటువంటిది ఒక వ్యక్తి ఏకంగా 15 భాషలను నేర్చుకోవడమే కాకుండా వాటన్నిటిలోనూ పాండిత్యాన్ని సంపాదించడం చాలా అరుదైన, అసాధ్యమైన విషయం. అటువంటి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన మహా మనీషి పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయనకు ఛాందసభావాలు గిట్టేవి కావు. దైవం ఎంతో మానవుడు కూడా అంతేనని నమ్మిన మానవతావాది ఆయన. తన జీవిత కాలంలో దాదాపు 150 గ్రంథాలను రాసినప్పటికీ నిత్య విద్యార్థి లాగే ప్రవర్తించే నిగర్వి ఆయన. అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో 1914 మార్చి 28న శ్రీనివాసాచార్యులు, లక్ష్మీదేవి అనే దంపతులకు జన్మించిన నారాయణాచార్యులు ఇంటి పేరు తిరమల. అయితే, ఆయన వంశీయులు పుట్టపర్తిలో స్థిరపడడం వల్ల ఆయన ఇంటి పేరు పుట్టపర్తి అయింది. చిన్నప్పుడే తల్లి మరణించడంతో కుటుంబ సన్నిహితుడొకరు ఆయనను పెనుగొండకు తీసుకు వెళ్లి పిట్ దొరసానికి పరిచయం చేశారు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యులుని ఆంగ్ల భాషలో గొప్ప ప్రవీణుడిని చేసింది. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ ఈయనకు మేనమామ.
పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యంలోనే భారతం, భాగవతం, రామాయణం వంటి ఇతిహాసా లను అభ్యసించడంతో పాటు, సంగీత, నాట్య శాస్త్రాల్లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీపాత్రలను కూడా ధరించారు. రంగ స్థలం మీద నాట్య ప్రదర్శనలిచ్చారు. ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలను తిరిగి చివరికి కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలా కాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి, తన ఇంటినే సాహితీ నిలయంగా మార్చేశారు. ఆయన 12 ఏళ్ల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే కావ్యాన్ని రాశారు. విచిత్రమేమిటంటే, తెలుగు విద్వాన్ పరీక్షలు రాసేటప్పుడు ఈ పెనుగొండ లక్ష్మి అనే కావ్యమే ఆయనకు పాఠ్య గ్రంథంగా ఉండేది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ కావ్యానికి సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబు రాయడానికి ఆయనకు సమయం సరిపోలేదు. ఆ ఒక్క ప్రశ్నకే సుమారు 40 పేజీల జవాబు రాయడంతో ఆయన ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘ఏకవీర’ నవలను ఆయన మలయాళంలోని అనువదించారు. మరాఠీ నుంచి ధర్మానంద కోశాంబి, వినాయక సావర్కర్ వంటి రచయితల రచనలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్ల భాష నుంచి అరవిందుల గ్రంథాలను కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. సంస్కృతంలో శివకర్ణామృతం, అగస్త్యేశ్వర సుప్రభాతం, మల్లికార్జున సుప్రభాతం తదితర గ్రంథాలను రాశారు. ఆయన తన భార్య కనకమ్మతో కలిసి సాహితీ గోష్ఠులను నిర్వహించారు. ఆమె కూడా విదుషీమణి. వీరిద్దరూ కలిసి వందలాది మంది శిష్యులను తయారు చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆయన రాసిన ‘శివ తాండవం’ మరో ఎత్తు. ఆయన వైష్ణవ సాంప్రదాయంలో పుట్టి పెరిగినప్పటికీ, పార్వతీ పరమేశ్వరుల నాట్య హేలను, లాస్యాన్ని గురించి కమనీయంగా రాసిన కావ్యమే శివ తాండవం. విశ్వనాథ సత్యనారాయణ సమక్షంలో ఆయన శివ తాండవం ప్రదర్శన నిర్వహించినప్పుడు, విశ్వనాథ ఆనందం పట్టలేక ఆయనను భుజాల మీదకు ఎత్తుకున్నారు. రుషీకేశ్ లో నారాయణాచార్యుల పాండిత్యాన్ని పరీక్షించిన స్వామీ శివానంద సరస్వతి ఆయనను ‘సరస్వతీ పుత్ర’ బిరుదుతో సత్కరించారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. ఆయన రాసిన పెనుగొండ లక్ష్మి, మేఘదూతం, షాజీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం, సంస్కృతంలో రాసిన త్యాగరాజ స్వామి సుప్రభాతం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆంగ్లంలో ఆయన రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ ది హీరో కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన 1990 సెప్టెంబర్ 1వ తేదీన గుండెపోటుతో కాలధర్మం చెందారు.
Telugu Vanam: సరస్వతీ పుత్రుడు నారాయణాచార్యులు
దైవం ఎంతో మానవుడు కూడా అంతే..