ప్రౌఢ, బాల సాహితీ, సవ్యసాచి చెన్నూరి సుదర్శన్… కలం శరం నుండి వెలువడిన.. రామచిలుక, రామబాణం, పిల్లల కథా సంపుటాలు, రెండు రెండు విశేషమైన కథల కలబోతగా అలరిస్తాయి. రెండు సంపుటాల్లో కలిసి మొత్తం 46 కథలు మనలను పల కరిస్తాయి, మొదటి కథా సంపుటి ‘రామచిలుక‘ లో 18 కథలు వున్నాయి, ‘చిలుక‘ను కేంద్రంగా చేసుకొని ఐకమత్యం విలువను చాటిచెబుతూ నీతులు సొంత వారు చెప్పడం కన్నా పొరుగువారు చెబితేనే రుచిస్తాయి, అమలు అవుతాయి అనే సత్యాన్ని తనదైన వ్యంగ్యభాణిలో అక్షరీకరించారు రచయిత సుదర్శనం,
వాస్తవానికి ప్రతిరూపంగా అనిపించిన, అది పిల్లల స్థాయిలో అంత ప్రాక్టికల్ గా చెప్పాల్సిన కథా? అనే సందేహం కలిగించే కథ ‘న్యాయ అవస్థ‘, కథలు కోస మెరుపుగా సాక్షాత్తు జిల్లా జడ్జి ఆలోచనలోనే మార్పుకు కారణమైన అతని కుమారుడు ‘చైతన్య‘ సార్థక నామధేయుడవుతాడు,
సాధారణంగా ప్రతి తరగతిలో ఒకరు ఇద్దరు వెనుక బడిన విద్యార్థులే కాదు, పొగరుబోతు పెంకి విద్యార్థులు ఉండటం సహజం, అలా తన బోధనా ప్రస్థానంలో ఒక అల్లరి పిల్లాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం యశోద టీచర్ తీసుకున్న నిర్ణయంతో అల్లరి పిల్లవాడు ‘చిరంజీవి’లో కలిగిన పశ్చాత్తాపం గురించి ‘పాఠం’ కథ ద్వారా చక్కని చమత్కారంతో వివరించారు రచయిత.
పొరపాట్లు పిల్లలే కాదు పెద్దలు చేస్తుంటారు అవి పిల్లల కంటపడితే ఎంత చులకన అవుతారు అనే అంశాన్ని చక్కని హెచ్చరికతో అక్షరబద్దం చేయబడిన కథ ‘అమ్మమ్మ తాతయ్య’ , సంతకం విలువను చూపిస్తూనే వేలిముద్రలోని ప్రామాణికతను వివరిస్తూ చమత్కారంగా చెప్పిన ‘అమ్మ సంతకం’ కథ ద్వారా విద్యార్థులు అధ్యాపకుని స్వీయ అనుభవ బోధనలను ఎంత చక్కగా స్వీకరిస్తారో కళ్ళకు కట్టారు రచయిత సుదర్శనం.
పిల్లల్లోని ఆకతాయి పనులు వారికి తెలియకుండానే వాళ్లలో ఎలాంటి అనర్ధాలు కలిగిస్తాయో వివరించే కోతి చేష్టలు కదా సమాజ ఉన్నతికి రచయిత పాత్ర బాధ్యత వివరిస్తూనే నేటితనం రచయితలు పాఠకులకు స్థితికి కలత చెందిన ఈ కథా రచయిత సుదర్శనం, తన వారసునిగా తన మనవడినే తీర్చిదిద్దుకునే ఆశాభావం కలిగించే కథ ‘వారసుడు‘, స్నేహ భావనలోని విశాల దృక్పథాన్ని చాటిన మరో కథ స్నేహం, గురు శిష్యుల మధ్య ఉండాల్సిన సంస్కార బంధం గురించి వివరించే చదువు సంస్కారం కదా ఇలా ప్రతి కథ రచయిత అనుభవ సంఘటనలకు సాక్షిభూతాలుగా ఆవిర్భవించి నిండైన సహజత్వంతో తొణికి సలాడుతుంటాయి.
రెండో కథా సంపుటి ‘రామబాణం‘ దీనిలో మొత్తం 27 కథలు కనిపిస్తాయి. పిల్లల్లో చిన్నతనం నుంచి పెరిగి పెద్దవ్వాలసిన, ధైర్యం, నీతి, తదితర గొప్ప గుణాల గురించి ఆధునిక టెక్నాలజీ సాయంగా వీరత్వాన్ని రంగరించి చెప్పిన కథ రామబాణం, కథ నిడివిలో సాగదీత ధోరణి కనిపించిన, కనిపించని ఆసక్తి మాత్రం కథను ముందుకు నడుపుతుంది.
ఒక సాధారణ యువతి ముందుండి నడిచి తన గ్రామాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చక్కగా ఆవిష్కరించింది ‘భారతి‘ కథ, అదే తీరుగా నడిచిన మరికొన్ని కథలు ఇందులో సాక్షాత్కరిస్తాయి.
పురుగు సేవ ద్వారా లభించే సంతృప్తిని ఆవిష్కరిం చిన అందమైన కథ ‘నా సంపాదన నాతోనె’ పిల్లల్లో జీవ కారుణ్యం కలిగించాలనే చక్కని సందేశాన్ని పంచిన కథ ‘మేకపిల్ల‘, నిజాయితీలో గల శక్తి అది మనిషి వ్యక్తిత్వానికి గీటురాయిగా ఎలా తోడ్పడుతుందో నిరూపించిన మంచి కథ ‘అమ్మ చెప్పింది’, అహంకారం మనిషిని ఎంతగా దిగజారుస్తుందో.. వినయ విధేయతలు ఉన్నత స్థాయికి ఎలా తీసుకువెళ్తాయో ‘దైవ పూజ’ ద్వారా వివరించారు.
కొడుకులోని దొంగబుద్ధిని మార్చడం కోసం తండ్రి పన్నిన ఉపాయం ఎంతగా సఫలం అయిందో తెలుసు కోవాలంటే ‘నాన్నమ్మ కాదు నాన్న’ కథ విధిగా చదివి తీరాల్సిందే..!
విద్యలోని గొప్పతనాన్ని, మానవ జీవితానికి విద్య కలిగించే గౌరవ మర్యాదలు ఆవిష్కరించే అందమైన కథ ‘నాన్నమ్మకు ప్రేమతో..’
కులం కన్నా గుణం ముఖ్యమని చాటే కథలు కొన్ని పర్యావరణ పరిరక్షణే మనిషి సంరక్షణ అని వివరించే కథలు మరికొన్ని. ‘ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం ఎక్కడిది?’ అన్న కోతి ప్రశ్నను ప్రతి ఒక్కరూ జీవకారుణ్య దృక్పథంతో అర్థం చేసుకొని అందులోని అంతరార్థం గమనించి ఆచరించాలి. నేటి ఆధునిక కాలంలో పంటల సంరక్షణలో భాగంగా కరెంటు తీగలతో రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పంటల సంరక్షణ దేవుడెరుగు ఆ కరెంటు కంచెల్లో పడి ఎన్నో అమాయకపు జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి, ఒక్కో సారి మనుషులు బలవుతున్నారు, అనే హెచ్చరిక లాంటి సందేశం కలిగిన కథ ‘కోతి సూటి ప్రశ్న’.
‘విద్వేషాలు పెంచుకోవడం కన్న సాయం చేసుకోవ డమే మిన్న‘ అనే గుణపాఠం చెప్పే కథ ‘సాయమే మిన్న‘ అలాగే ఉచిత పథకాల వల్ల పాలకులు ఎలాంటి ఇక్కట్లు పాలవుతారో వివరించడమే కాదు, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో కూడా ఆవిష్కరించే కథ, ‘ఉచితం ఉచితం!!’
ఇలా ప్రతి కథ ఓ పరమార్థం నిండి ఉండటమే కాక, కథ చివర సందర్భోచితమైన నీతి వాక్యంతోపాటు, కథ లక్ష్యాలను అందంగా ఆవిష్కరించడంలో రచయిత వినూ త్న దృక్పథం ఆవిష్కరించబడుతుంది.
ప్రతి కథ దిగువన రెండు లేదా మూడు సూక్తులు, సామెతలు, తదితర విలువైన సమాచారం భద్రపరచ బడింది, ఇలా బాల సాహిత్యానికి అవసరమైన సమాచా రం పుష్కలంగా కనిపించే ఈ కథా సంపుటి ద్వయం..
రచయిత చెన్నూరి సుదర్శన్ బహుముఖ ప్రతిభ.. ఆసాంతం అగుపిస్తుంది, ఇవి కథలు, కల్పనలు, కావు ఆ భూత కల్పితాలు అసలే కావు, రచయిత సహజంగా తన ఉపన్యాసక జీవితం నుంచి గమనించిన సంఘటనలు అనుభవాలే వస్తువులుగా స్వీకరించి ఈ కథలు రాశారు. ప్రౌఢ సాహిత్యం బాల సాహిత్యంరెండూ…,
రెండు కళ్ళుగా భావించే సుదర్శనం మాస్టారు కలం నుంచి జాలువారిన ఈ బాల సాహితి కథా సంపుటి ద్వయం, ప్రతి ఒక్కరూ విధిగా చదవాల్సిన… తరుణమిది.
- డా॥ అమ్మిన శ్రీనివాసరాజు
7729883223.