Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్A big test to BJP: బీజేపీకి అగ్నిపరీక్షగా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు

A big test to BJP: బీజేపీకి అగ్నిపరీక్షగా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు

కశ్మీరీలు, జాట్స్ ఓటెవరికి?

మరికొన్ని రోజుల్లో జరగనున్న జమ్మా కాశ్మీర్ , హర్యానా ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరగబోతున్న తొలి జమ్మా కాశ్మీర్ ఎన్నికలు ఇవి. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే కీలకమైన కాశ్మీర్ లోయలో కొన్ని నియోజకవర్గాలకే కమలం పార్టీ పోటీ చేస్తోంది. దీంతో కాశ్మీర్ బీజేపీలో అసంతృప్తి నెలకొంది. కాగా హర్యానాలో ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. కీలకమైన జాట్ సామాజికవర్గం బీజేపీకి వ్యతిరేకంగా మారింది. అంతేకాదు స్టార్ రెజ్జర్లు వివేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనీ అంతిమంగా తమకు మేలు జరుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుత పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక సాహసంతో కూడుకున్న పనే. నరేంద్ర మోడీ ఈ సాహసానికి ఒడిగట్టారు. కాశ్మీర్లో ఎన్నికలను నిర్వహించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను తీసుకురావడానికే జమ్మూ కాశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా జమ్మూలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగింది. ఆ దామాషాలో కాశ్మీర్‌లో సీట్లు తగ్గాయి. మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 90కు చేరింది. ప్రస్తుతం జమ్మూలో 43 సీట్లు ఉంటే కాశ్మీర్‌లో 47 సీట్లున్నాయి. ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ ఎన్నికల్లో కాశ్మీర్‌లోని 47 నియోజకవర్గాల్లో కేవలం 19 సీట్లకే బీజేపీ అభ్యర్థులను బరిలో దించింది. బీజేపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక కమలం పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న తమకు ఢిల్లీ పెద్దలు అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే కాశ్మీర్ లోయలో ఇలా కేవలం 19 సీట్లకే కమలం పార్టీ పోటీ చేయడం వెనుక వ్యూహం ఉంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో గెలిచి తాము అధికారానికి వస్తామన్న భ్రమలు బీజేపీ పెద్దలకు లేవు. పోటీ ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి – బీజేపీ మధ్యనే జరుగుతుంది. ఈసారి మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ( పీడీపీ) పోటీ నామమాత్రంగా మారింది. నామ్‌కే వాస్తే అన్నట్లు మెహబూబా ముఫ్తీ పార్టీ పోటీలో ఉంది. అయితే కచ్చితంగా గెలుస్తామనుకున్న నియోజకవర్గాల్లోనే బీజేపీ తన అభ్యర్థులను నిలబెట్టింది. మరికొన్ని సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమికి గట్టి పోటీ ఇస్తారనుకున్న స్వతంత్రులకు మద్దతు ఇస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి వ్యతిరేక ఓటమి చీలిపోకూడదన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు పొందుతున్న స్వతంత్ర అభ్యర్థుల్లో రషీద్ ఇంజనీర్ లాంటి పలువురున్నారు. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే కింగ్ మేకర్ అవుదామన్న ఆలోచనతో ఉంది భారతీయ జనతా పార్టీ.

హర్యానాలో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ
ఇక హర్యానా విషయానికొస్తే, కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటివరకు దూకుడు మీద ఉంది. అయితే తాజాగా విడిగా పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఆప్ విడివిడిగా పోటీ చేశాయి. అయితే శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి స్వంతంగా మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనీ, అంతిమంగా తమకు లాభం జరుగుతుందని కమలం పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట మనదేశ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ అక్టోబరు ఐదో తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి వినేశ్ ఫోగట్ పోటీలో ఉన్నారు. కాగా బజరంగ్ పూనియాకు వేరే బాధ్యత అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. . వినేశ్ ఫోగట్‌కు జాతీయస్థాయిలో ఒక ఇమేజ్ ఉంది. భారత్‌కు స్వర్ణం తీసుకురావాలన్న సంకల్పంతో పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన వినేశ్ ఫోగట్ పై దురదృష్టవశాత్తూ అనర్హత వేటు పడింది. దీంతో భారత్ కలలు కల్లలయ్యాయి. కేవలం వంద గ్రాముల అధిక బరువు ఉండటం వినేశ్ ఫోగట్ ఆశలను ఛిద్రం చేసింది. అలాగే బజరంగ్ పూనియా కూడా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రెజ్లరే. ఈ ఇద్దరు స్టార్ రెజ్లర్లు చేరడం నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే.

బీజేపీకి వ్యతిరేకంగా జాట్ కమ్యూనిటీ
వాస్తవానికి హర్యానాలో జాట్ సామాజికవర్గం అత్యంత బలమైంది. ప్రస్తుతం జాట్ సామాజికవర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. హర్యానా జనాభాలో జాట్ సామాజికవర్గం 27 శాతం ఉంది. ఇప్పటి వరకు హర్యానాకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది జాట్‌ సామాజికవర్గానికి చెందినవారే. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో 57 నియోజకవర్గాల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో జాట్ కమ్యూనిటీ ఉంది. ఈ 57 నియోజకవర్గాల్లో జాట్ జనాభా పది శాతం కంటే ఎక్కువ ఉంది. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటన్ని సీట్లు రాలేదు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 నియోజకవర్గాలుంటే బీజేపీ 40 గెలుచుకుంది. జాట్ వర్గ ప్రముఖుడైన దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన్నాయక్ జనతా పార్టీకి 10 సీట్లు లభించాయి. దీంతో భారతీయ జనతా పార్టీ, జన్నాయక్ జనతా పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అప్పటికే బీజేపీలో జాట్ సామాజికవర్గానికి చెందిన కెప్టెన్ అభిమన్యు ప్రముఖ నేతగా ఉన్నారు. అంతేకాదు కెప్టెన్ అభిమన్యుకు రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌విల్ ఉంది. దీంతో ముఖ్యమంత్రి పదవి కెప్టెన్ అభిమన్యుకే లభిస్తుందని రాజకీయవర్గాలు భావించాయి. అయితే కెప్టెన్ అభిమన్యుకు ముఖ్యమంత్రి పదవి లభించలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెనుకబడిన తరగతులకు చెందిన మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది బీజేపీ హైకమాండ్‌. కమలం పార్టీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం జాట్ సామాజికవర్గ పెద్దలకు మింగుడుపడ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా కాలం ఈ విభేదాలు నడిచాయి. ఒకదశలో విభేదాలు తీవ్రతరమయ్యాయి. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో ఖట్టర్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అయితే ఖట్టర్‌ వారసుడిగా తమ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి బీజేపీ అవకాశం ఇస్తుందని జాట్ సామాజికవర్గం భావించింది. అయితే ఈసారి కూడా జాట్‌ సామాజికవర్గాన్ని బీజేపీ పక్కన పెట్టింది. మనోహర్ లాల్ ఖట్టర్ వారసుడిగా ఓబీసీ నేత అయిన నాయబ్‌ సింగ్ సైనీని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై జాట్ సామాజికవర్గం మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి రాకుండా హస్తిన బీజేపీ పెద్దలు కుట్ర పన్నారని జాట్ సామాజికవర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదిలా ఉంటే హర్యానాలో బీజేపీతో జాట్ సామాజికవర్గం కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దాదాపు మూడేళ్ల కిందట మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకువస్తే అందుకు వ్యతిరేకంగా పదకొండు నెలల పాటు ఢిల్లీ శివార్లలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది హర్యానా రైతులే. మొత్తంమీద హర్యానా జాట్‌లు బీజేపీకి దూరమయ్యారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం సీట్లను కమలం పార్టీ గెలుచుకుంది. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లలో విజయం సాధించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందన్న నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొత్తంమీద ప్రధానంగా జాట్‌, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఈసారి కాంగ్రెస్ పార్టీ భరోసా పెట్టుకుంది.

-ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News