Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Rahul leadership: రాహుల్ నాయకత్వానికి అగ్నిపరీక్షగా లోక్‌సభ ఎన్నికలు

Rahul leadership: రాహుల్ నాయకత్వానికి అగ్నిపరీక్షగా లోక్‌సభ ఎన్నికలు

రాహుల్ బలాబలాలు ఏంటి?

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత హస్తం పార్టీ ఆగమాగం అయింది. అయితే కర్ణాటక, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ మరోసారి బలం పుంజుకుంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యం పెరిగింది. ఇదిలా ఉంటే కొంతకాలం కిందట రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సూపర్ డూపర్‌గా హిట్ అయింది. ప్రజల ముంగిట ఓ సరికొత్త రాహుల్ గాంధీని జోడోయాత్ర ఆవిష్కరించింది. ఈ విజయం స్ఫూర్తితో ఇటీవల మణిపూర్‌ నుంచి ముంబై వరకు మరో యాత్ర చేపట్టారు. అయితే యాత్రలకు ఓట్లు రాల్తాయా ? అనే ప్రశ్న తాజాగా తెరమీదకు వచ్చింది.

- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు, అగ్నిపరీక్షగా మారాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడయ్యారు. అయితే మల్లికార్జున ఖర్గే అధికారికంగా ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటికీ, కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టేది గాంధీ కుటుంబమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో రాహుల్ గాంధీదే కీలక పాత్ర. కాంగ్రెస్ గెలిస్తే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంలోనూ అలాగే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలోనూ రాహుల్ గాంధీ మాటే చెల్లుబాటు అయింది. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీయే అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో కూడా నెలకొంది.
అయితే గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా, అది రాహుల్ ఖాతాలోకి రాదు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీ. అంతేకాదు….ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై హిమాచల్ ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఘనత గా చెప్పుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా స్వంత రాష్ట్రం. సాక్షాత్తూ బీజేపీ జతీయ అధ్యక్షుడి రాష్ట్రంలోనే కమలం పార్టీని ఓడించామని చెప్పుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ గెలుపు కాంగ్రెస్ నాయకులకు ఆస్కారం ఇచ్చింది. ఇక కిందటేడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నాటికి కర్ణాటక లో బస్వరాజ్ బొమ్మై సర్కార్ నలభై శాతం కమిషన్ ప్రభుత్వం అనే విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల్లో బొమ్మై సర్కార్ అవినీతే కీలకాంశంగా మారింది. బీజేపీ నాయకుల హిందూత్వ అజెండాను కన్నడ ప్రజలు పట్టించుకోలేదు. అవినీతి ప్రభుత్వాన్ని దింపివేయాలని కన్నడ ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు జై కొట్టారు. కర్ణాటక తరువాత కిందటేడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటికి గులాబీ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం అప్పగించారు తెలంగాణ ప్రజలు. అయితే నీళ్లు…నిధులు…నియామకాలు …అనే అజెండాను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గులాబీ పార్టీ పాలన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ ప్రభుత్వంపై వ్యక్తమైన అసంతృప్తి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి వరమైంది. చివరకు అనూహ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా ప్రత్యర్థి శిబిరాలపై వ్యక్తమైన అసంతృప్తే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చింది.

రాహుల్ నాయకత్వంలో లోపం ఉందా ?
వాస్తవానికి ఇండియా కూటమికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడం లేదు. అయినప్పటికీ ఇండియా కూటమి అనగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానగల కూటమి అని అందరూ భావిస్తారు. భావించడమే కాదు…ఇది వాస్తవం కూడా. అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నిటి మద్దతు పొందడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారు. అసలు ఇండియా కూటమి ఏర్పాటులో చొరవ చూపిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను రాహుల్ గాంధీ రాజకీయంగా పోగోట్టుకున్నారు. నితీశ్ కుమార్ అవకాశవాదా ? కాదా ? అనేది వేరే ముచ్చట. రాజకీయంగా యూ టర్న్ తీసుకున్న నితీశ్ కుమార్ ఆ తరువాత ఎన్డీయే కూటమిలో చేరడం, బీహార్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. అలాగే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రాహుల్ కు దూరమయ్యారనే చెప్పుకోవాలి. మమతా బెనర్జీ స్వంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఈసారి బెంగాల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు మమతా బెనర్జీ. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా చాలావరకు మమతా బెనర్జీ బాటలోనే నడిచారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది. అయితే ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇదొక ఊరటనిచ్చే అంశమే. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఆత్మరక్షణలో పడేయటంలో రాహుల్ గాంధీ విజయం సాధించారని చెప్పవచ్చు. ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో పెనుమార్పులు సంభవిస్తాయనీ అలాగే బలహీనవర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సామాన్య జనంలోకి వెళ్లాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు ఉండవని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీయే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ చేసిన రిజర్వేషన్ల రద్దు ఆరోపణ కూడా హాట్‌టాపిక్‌గా మారింది. అప్పటివరకు కమలం పార్టీకి కరడుగట్టిన ఓట్‌బ్యాంక్‌గా ఉన్న కొన్ని సామాజికవర్గాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ విషయంలో రాహుల్ గాంధీ విజయం సాధించారనే చెప్పవచ్చు.

జోడోయాత్రతో మారిన రాహుల్ ఇమేజ్ !
రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్‌ జోడోయాత్ర ఓ కీలక ఘట్టం. సామాన్య ప్రజల ముందు ఒక సరికొత్త ఇమేజ్‌ను ఆవిష్కరించింది జోడోయాత్ర. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జోడోయాత్ర సాగింది. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడోయాత్రలో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు రాహుల్‌ గాంధీ అడుగులో అడుగేసి నడిచారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఓ ఇరవై నిమిషాలపాటు వ్యాయామం. ఆ తరువాత తేలికపాటి బ్రేక్ ఫాస్ట్. ఇక రోజంతా నడకే నడక. అలసట అనేదే లేకుండా అడుగులో అడుగేసుకుంటూ మైళ్లకు మైళ్లు నడిచారు రాహుల్.జోడోయాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఇటీవల న్యాయ్‌యాత్ర పేరుతో మరోసారి పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. గతంలో చేసిన భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగా ఈ న్యాయ్‌యాత్రను చెప్పుకోవచ్చు. ఈశాన్య ప్రాంతమైన మణిపూర్‌లో ప్రారంభమైన న్యాయ్‌యాత్ర పశ్చిమ భారతం మీదుగా కొనసాగి చివరకు ముంబైలో ముగిసింది. మణిపూర్ నుంచి న్యాయ్‌యాత్ర ప్రారంభించడం వెనుక ఓ పరమార్థం ఉంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో సంభవించిన మణిపూర్ అల్లర్లను వ్యూహాత్మకంగా దేశమంతా ప్రచారంలోకి పెట్టడమే ఇందులోని పరమార్థం అంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే రెండు విడతలుగా రాహుల్ చేసిన యాత్రల విజయవంతమయ్యాయి. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. అయితే రాహుల్ యాత్రలు, ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లు రాలుస్తాయి ? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇక్కడో విషయం గమనించాలి. రాహుల్ గాంధీ ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. కుటుంబం అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఫలితంగా బలవంతంగా రాజకీయాల్లోకి రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగతంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి ఆయన. కొంతకాలం రాజకీయాలపై దృష్టి పెడతారు.మరికొంతకాలం నెలల తరబడి విదేశాలకు విహారానికి వెళుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే పేరు సామాన్య ప్రజల్లో తెచ్చుకున్నారు. రాహుల్‌కున్న ఈ ఇమేజే ఆయన పట్ల ప్రజలకు నమ్మకం కలగకపోవడానికి కారణమైందంటారు రాజకీయ విశ్లేషకులు. అయితే భారత్ జోడోయాత్రతో ప్రజల్లో ఉన్న నెగెటివ్ ఇమేజ్‌ను రాహుల్ గాంధీ చెరిపేసుకోగలిగారు.

- ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News