Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్AFSPA extended in Manipur: మణిపూర్‌ లో సైనిక చట్టం పొడిగింపు

AFSPA extended in Manipur: మణిపూర్‌ లో సైనిక చట్టం పొడిగింపు

మరో 6 నెలలు పొడగింపు

మణిపూర్‌ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలు మరో ఆరు నెలల పాటు సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం కిందనే ఉంటాయి. ఈ అక్టోబర్‌ నెల నుంచి ఈ పొడిగింపు ప్రారంభం అవుతుంది. మణిపూర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్ది, శాంతిభద్రతలు నెలకొల్పడానికి ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతోంది. ఇంఫాల్‌ లోయలోని 19 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మినహా మిగిలిన రాష్ట్ర మంతటికీ ఈ చట్టం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలు అవసరమైతే బలప్రయోగం జరపడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. మామూలు పరిస్థితుల్లో అయితే, ఆ చట్టాన్ని ఇంతకాలం అమలు చేయడం అవసరమా అనే ప్రశ్న ఉదయించేది. కానీ, గత మే నెల నుంచి ఇక్కడ కుకీలు, మైతీల మధ్య హింసాత్మకంగా ఘర్షణలు చోటు చేసుకుంటుండడంతో ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం, ఆ తర్వాత దీన్ని మరో ఆరు నెలలు పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.
ఒక్క ఇంఫాల్‌లో తప్ప మిగిలిన మణిపూర్‌లో ఈ చట్టాన్ని పొడిగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంఫాల్‌ లో కొద్దిగా ప్రశాంత పరిస్థితులు ఏర్పడినందు వల్ల ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ రాజధాని నగరాన్ని మినహాయించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నిజానికి, రాష్ట్రంలో ఈ చట్టాన్ని పొడిగించడం అవసరమనే అభిప్రాయాన్ని సైనిక దళాల అధికారులే వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి చట్టం లేనందువల్లే చొరబాటుదార్లు విజృంభించడం జరుగుతోందని, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాల నుంచి మణిపూర్‌లో ప్రవేశిస్తున్న కుకీలు, రోహింగ్యాలు ఇక్కడ స్థానికులను రెచ్చగొట్టి సమస్యలను సృష్టిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం మీద పట్టు సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఈ వర్గాలు అశాంతిని సృష్టిస్తున్నాయని సైనికాధికారులు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా, మరికొంతకాలం పాటు ఈ చట్టాన్ని అమలు చేయాలన్న అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని అత్యధిక సంఖ్యాకులు హర్షిస్తున్నారు. కొంతకాలం అమలు చేసిన తర్వాత, హింసాత్మక ప్రాంతాలలో దీన్ని సడలించడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
చొరబాట్లను నిరోధించడానికి కృషి చేస్తున్న సైనికుల భద్రత కోసమే ఈ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతోంది తప్ప, శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసులు, అధికారుల భద్రతకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు సాగిస్తున్నాయి. ఈ చట్టం ఉభయ తారకంగా ఉపయోగపడుతోందనే అభిప్రాయంతో వారు ఏకీభవించడం లేదు. కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ చట్టాన్ని అమలు చేస్తూ, మైతీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దీన్ని సడలించడం జరుగుతోందనే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. అయితే, పొరుగు దేశాల నుంచి రాష్ట్రంలోకి చొరబడుతున్న కుకీలు, రోహింగ్యాలను నిరోధించడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. భద్రతా దళాలు, సైనిక దళాలు శాంతిభద్రతలు కాపాడుతున్న సమయంలో ఇక్కడ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడం లేదా మదింపు చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. వాస్తవానికి ఒక ప్రదేశాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించడం అనేది స్థానికుల్లో ఒక విధమైన అసమ్మతికి, అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మైతీలు హింసాత్మక ధోరణులకు దూరంగా ఉంటున్నారని, ఇతర దేశాల నుంచి వచ్చిన కుకీలు, రోహింగ్యాలే స్థానిక కుకీలను మైతీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం జరుగుతోందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇది పక్షపాత ధోరణి అని కుకీ నాయకులు భావిస్తున్నారు. అస్సాం రైఫిల్స్‌ దళాలపై ఈ కారణంగా వారు గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదో ఒక క్షణంలో వారు పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇదే గనుక వేళ్లుపాదుకుంటే, మరోసారి హింసా విధ్వంసకాండలు చెలరేగే అవకాశం ఉందనే భయాందోళనలు కూడా బయటపడుతు న్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఏదో విధంగా సమన్వయాన్ని, సామరస్యాన్ని సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రప్రాధాన్యం ఇవ్వడం మంచిదనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News