Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్All eyes are on Poor: బడుగు వర్గాల మీదే కన్ను

All eyes are on Poor: బడుగు వర్గాల మీదే కన్ను

మరో ఏడాదిలో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న సమయంలో దేశంలో దాదాపు ప్రతి పార్టీ ప్రస్తుతం బడుగు వర్గాల మీదే కన్ను వేసింది. వారిని తమకు అనుకూలంగా ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. వారికి కేటాయించిన రిజర్వ్‌ స్థానాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పార్టీలు ఏ వ్యూహాన్ని రూపొందించినా అది అట్టడుగు వర్గాల చుట్టూనే తిరుగుతోంది. 2024 మేలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవసారి ప్రధాని కావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించగా ఆయన ప్రయత్నం విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నాయి. మరో 15 నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం పాలక, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బీజేపీ కార్య నిర్వాహక వర్గ సమావేశం జరిగినప్పుడు నరేంద్ర మోదీ తన మొదటి అస్త్రం గురించి ప్రస్తావించి, పార్టీ శ్రేణులకు అందుకు తగ్గట్టుగా పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి బడుగు, బలహీన వర్గాలకు తెలియజెప్పే విధంగా ప్రచార వ్యూహాలను రూపొందించాలని ఆయన కార్యకర్తలకు స్పష్టం చేశారు.
సాస్మాండ ముస్లింలు, బొహ్రా వర్గాలు వంటి నిమ్న వర్గాలకు, ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు ఒక వారధిలా పనిచేయాలని మోదీ సూచించారు. బీజేపీకి సంబంధించిన సామాజిక, ఓటర్ల పునాదులను వీలైనంతగా విస్తరించడానికి బీజేపీ చాలా కాలం కిందటే ప్రయత్నాలు, కార్యక్రమాలు ప్రారంభించింది. దళితులు, బలహీనవర్గాలకు, ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిలా పని చేయాలి. వారి దగ్గరకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలి. వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి సమాచారం చేర వేయాలి. వారి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు వారికి చేరుతున్నాయో లేదో తెలుసుకుని, వారికి తగిన విధంగా సహాయం చేయడమే కాకుండా, వాటిపట్ల వారికి పూర్తి అవగాహన కలిగించాలి. ఓట్ల కోసం మనం ఇటువంటివి చేయకూడదు. శక్తివంతమైన దేశంగా మన దేశాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యమనే సంగతి గుర్తుపెట్టుకోవాలి అని ఆయన పార్టీ రెండు రోజుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నందువల్ల బీజేపీ చాలా కాలం నుంచే దళితులను, బలహీనవర్గాలను ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టింది. దళితవాడలలో కార్యక్రమాలు చేపట్టడం, వారి కోసం ప్రత్యేకంగా ప్రాథమిక సదుపాయాలను నిర్మించడం వంటివి ఈశాన్య రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలలో ప్రారంభం అయిపోయింది.
ఎవరి వ్యూహం వారిది
వాస్తవానికి, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇటువంటి కార్యక్రమాన్నే చేపట్టింది. బలహీన వర్గాల కోసం, పేదల కోసం, దళితుల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారికి తెలియజేసింది. దేశంలోని సుమారు 32 కోట్ల మంది బలహీన వర్గాలు, దళితుల కోసం తాము చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, గృహనిర్మాణం, బ్యాంకు ఖాతాల ప్రారంభం, వంట గ్యాస్‌ పంపిణీ, రైతులకు రూ.6,000ల పంపిణీ వంటి పథకాల గురించి వారికి అవగాహన కలిగించింది. ఈ పథకాలను బీజేపీ ప్రభుత్వం చాలావరకు విజయ వంతంగానే అమలు చేసింది. పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన, పట్టబోతున్న అనేక పథకాల గురించి ప్రధానమంత్రే కాక, పలువురు కేంద్ర మంత్రులు కూడా దేశమంతా పర్యటన చేసి ప్రజానీకానికి వివరించడం కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిచ్చాయనడంలో సందేహంలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది.
కాగా, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 56 రిజర్వ్‌ నియోజకవర్గాలను సరైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ 56 నియోజక వర్గాల కోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి, ఏర్పాట్లు చేస్తున్న పార్టీ వ్యూహబృందం గత జనవరి 21న ఢిల్లీలో సమావేశమై, సుదీర్ఘంగా చర్చించింది. దేశంలో మొత్తం 131 రిజర్వ్‌ స్థానాలున్నాయి. ఇందులో 84 స్థానాలను షెడ్యూల్డ్‌ కులాలకు, 47 స్థానాలను షెడ్యూల్డ్‌ తెగలకు కేటాయించడం జరిగింది. ఇందులో చెరి 28 స్థానాలలో తమ అభ్య ర్థులను నిలబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానాలలో కాంగ్రెస్‌ రెండవ స్థానంలో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 121 స్థానాలలో పరాజయం పాలయింది. అయితే, ఈ రిజర్వ్‌ స్థానాల మీద ఈసారి మరింతగా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో కొత్త నాయకుల కోసం, కొత్త అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాం. ఈసారి 56 స్థానాలకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాం అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పి.ఎల్‌. పూనియా వివరించారు. ఇది వరకు గెలిచిన పది స్థానాలు కాకుండా ఈసారి 56 స్థానాలకు పోటీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
తెలంగాణపై దృష్టి
మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో నాలుగేసి చొప్పున షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్‌ స్థానాలలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక తెలంగాణలో మూడు స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది. బీహార్‌, గుజరాత్‌, హర్యానాలలో కూడా రెండు చొప్పున రిజర్వ్‌ స్థానాలలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేసుకుంటోంది. షెడ్యూల్డ్‌ తెగల స్థానాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్లో ఆరు స్థానాలు, గుజరాత్‌, రాజస్థాన్‌, చతీస్‌గఢ్‌లో నాలుగేసి స్థానాలు, జార్ఖండ్‌ లో మూడు స్థానాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలలో రెండేసి స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రిజర్వ్‌ నియోజక వర్గాలలో బాగా లబ్ధి పొందిన పార్టీ బీజేపీ. 2019 ఎన్ని కల్లో మొత్తం 131 రిజర్వ్‌ స్థానాలకు గాను బీజేపీ 86 స్థానాలను చేజిక్కించుకుంది. సుమారు 65 శాతం ఓట్లు ఈ పార్టీకే పడడం జరిగింది.
2014 ఎన్నికల్లో ఈ పార్టీకి 60 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం 545 లోక్‌సభ స్థానాలలో నాలుగవ వంతు స్థానాలు షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు కేటాయించినందువల్ల, అంటే సుమారు 24 శాతం సీట్లు ఈ వర్గాలకే ఉన్నందువల్ల దాదాపు ప్రతి పార్టీ ఈ స్థానాల మీదే దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ 56 స్థానాలకు పోటీ చేస్తోందంటే దాని ఉద్దేశం మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు వదిలివేయడం జరుగుతుంది. చాలా ఏళ్ల పాటు, ఈ రిజర్వ్‌ స్థానాలలో ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించేది. దళితులు, బలహీనవర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్కే మద్దతునిస్తుండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులను బీజేపీ హస్తగతం చేసుకుంటోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తన ఓటు బ్యాంకులను మళ్లీ చేజిక్కించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News