Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Elections-women voters: నారీ శక్తి చుట్టూ పార్టీల ప్రదక్షిణలు

Elections-women voters: నారీ శక్తి చుట్టూ పార్టీల ప్రదక్షిణలు

మహిళా ఓటర్లను ఆకట్టుకుంటే గెలుపు కేక్ వాకే

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ఓటు బ్యాంకుల మీద శ్రద్ధ పెరుగుతుంది. కొన్ని వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. రాజకీయ పార్టీల తీరే వేరు. ఎంతకైనా తెగి స్తాయి. ఎంతకైనా దిగ జారుతాయి. లోక్‌ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఒకటి రెండు నెలల పాటు దేశ మంతా మహిళల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనీ వినీ ఎరుగని వాగ్దానాలు, అనేకానేక హామీలతో పాటు అనేక విధాలుగా మహిళల అడుగులకు మడుగొలొత్తడం కూడా ప్రారంభమవుతుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని పార్టీల నుంచి మెజారిటీ స్థానాలు సంపాదించి అధికారానికి రాగల పార్టీల వరకు స్త్రీ జనోద్ధరణకు, మహిళా సాధికారికతకు రాజా రామ్మో హన్‌ రాయ్‌, వీరేశలింగం పంతులు వంటి సంస్కరణ వాదులు కూడా ఎన్నడూ ఊహించని సంస్కరణలెన్నిటినో ప్రకటించడం జరుగుతుంది. గత దశాబ్ద కాలంలో మహిళా ఓటర్లు బాగా పెరగడం, వారిలో ఓటింగ్‌ శాతం దాదాపు రెట్టింపు కావడం వంటి కారణాల వల్ల మహిళా మణులకు దండ ప్రమాణాలు ఆచరించని పార్టీ అంటూ ఉండక పోవచ్చు. తాము చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను ఆచరించినా ఆచరించకపోయినా మహిళలను ఆకట్టుకోవడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రం వరాల వర్షం కురిపించడం జరుగుతుంది.
దాదాపు ఆరు నెలల నుంచి మహిళా ఓటర్లను ఆకట్టు కోవడానికి, ఎన్నికల సమయంలో వారి అనుగ్రహం సం పాదించడానికి దాదాపు ప్రతి పార్టీ చేయని ప్రయత్న మంటూ లేదు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవా లని ఆరాటపడుతున్న పాలక పక్షాలు సహజంగా ఈ విష యంలో ప్రతిపక్షాల కంటే ఒక అడుగు ముందుంటు న్నాయి. సంఘటితంగా కృషి చేసి పాలక పక్షాన్ని గద్దె దించి, అధికారంలోకి వచ్చి దేశాన్ని ఉద్ధరిద్దామని కొం డంత ఆశతో చేతులు కలిపిన ప్రతిపక్షాలు చెల్లాచెదురై పోయాయి. ప్రాంతీయ పార్టీలు ఆర్థికంగా సొంత బలాన్ని సంపాదించుకోలేక, అప్పుల పాలై జాతీయ స్థాయి పాలక పక్షం మీద తప్పనిసరిగా ఆధారపడవలసి వస్తోంది. మొత్తం మీద సొంత బలం లేని ప్రతిపక్షాలు, ప్రాంతీయ పక్షాలు సైతం మహిళల ఉద్ధరణకు కంకణం కట్టుకుని ఇప్పటికే అనేక వరాలు అనుగ్రహించాయి.
సరికొత్త పథకాలు
మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నరేంద్ర మోదీ నుంచి మమతా బెనర్జీ వరకు, రాహుల్‌ గాంధీ నుంచి యోగి ఆదిత్యనాథ్‌ వరకు ప్రతి నాయకుడి ప్రసంగంలోనూ ‘నారీ శక్తి’కి పెద్ద పీట వేయ డం కనిపిస్తోంది. నిజానికి, మహిళలను ఆకట్టుకోవడానికి పోటీ పడడం అనేది 2019 ఎన్నికల నుంచి మరింతగా కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళా ఓటర్ల సంఖ్య పెర గడం, వారికి పథకాలు ప్రకటించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగడం వంటివి ఇందుకు దోహదం చేస్తోంది. గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికల మధ్య మహిళా ఓటర్ల సంఖ్య 5.1 శాతం పెరిగింది. వారు ఎన్నికల్లో పాల్గొ నడమనేది బాగా ఎక్కువైంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో వారి ప్రాధాన్యం మరింతగా పెరిగింది. అయితే, ఈ మార్పులకు తగ్గట్టుగా లోక్‌ సభ, శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలు మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినా, పెంచక పోయినా, ఓటర్ల మీద మాత్రం వారు దృష్టి కేంద్రీకరిం చడం అంచనాలకు మించి పెరిగిపోయింది. గత ఎన్నికల్లో మహిళలకు 40 శాతం స్థానాలివ్వడమే కాకుండా, 2021 శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళలకు దాదాపు 40 శాతం సీట్లిచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్ప, మరే పార్టీ మహిళలకు ప్రాధాన్యమిచ్చిన సూచనలు కనిపించడం లేదు. మహిళల్లో గెలిచే అవకాశాలున్నవారు సంఖ్య బహు తక్కువ అని ఇతర పార్టీల నిశ్చితాభిప్రాయం.
బీజేపీ ప్రస్తుత లోక్‌ సభకు ప్రకటించిన మొదటి దఫా అభ్యర్థుల జాబితాలో 155 స్థానాలకు 18 స్థానాలను మహిళలకు ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు దాదాపు 50 స్థానాలు కేటాయించిన బీజేపీ మహిళలకు 33 సీట్లను రిజర్వు చేస్తూ గత ఏడాది పార్లమెంటులో చట్టం చేయడం కూడా జరిగింది. అయితే, లోక్‌ సభ ఎన్నికల్లోనూ, కొన్ని రాష్ట్రాలలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లోనూ తాను 33 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తుందా అన్నది చూడాలి. మూడం చెల పాలనా వ్యవస్థలున్న భారతదేశంలో పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే మహిళలకు అత్యధిక స్థానాలను కేటాయించడం జరుగుతోంది. పంచాయతీ స్థాయిలో మహిళలకు ప్రాధాన్యం పెంచినప్పటికీ ఆశించిన ఫలితాలు అనుభవానికి రావడం లేదు. పంచాయతీల్లో సాధారణంగా పురుషులకే ప్రాధాన్యం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
వంటింటికే పరిమితం
ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన డానికి కారణమేమిటి? తమకు సంబంధిం చిన అభ్యర్థి లేకపోయినా వారు పోలింగ్‌ బూత్‌ల ముందు ఎక్కువ సంఖ్యలో బారులు తీరడానికి ప్రధాన కారణమేమిటి? బాలికలకు ఉచిత విద్య, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రుణ మాఫీలు, ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు, ఉపాధి కల్ప నలు, ఉద్యోగావకాశాలు, పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, డ్వా క్రాలు వగైరాలు మహిళలకు, మహిళల సాధికారికతకు అనువుగానే ఉన్నాయి. వీటిని కల్పించడంతో సరిపెట్టుకో వచ్చని, మహిళలు సంతృప్తి చెందుతారని పార్టీలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. అయితే, మహిళలు చదువు ల్లోనూ, ఉద్యోగావకాశాల్లోనూ పురోగతి చెందడానికి అవ సరమైన ప్రత్యేక ప్రాథమిక సదుపాయాల కల్పనకు మాత్రం అవకాశం ఉండడం లేదు. అనేక సందర్భాల్లో ప్ర భుత్వాల్లోని పురుషాధిక్యత కూడా రకరకాల రూపాల్లో ప్రత్యక్షమవుతూనే ఉంది. మొత్తానికి ఎన్నికల సమయంలో నారీ శక్తిని తక్కువ అంచనా వేయలేమనే సంగతి పార్టీలకు పూర్తిగా అవగతమవుతోంది.
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న సందేశ్‌ ఖలీ సంఘటన ఎన్నికల మీద తన ప్రభావాన్ని ప్రసరించే అవకాశం ఉంది. దేశంలో మహిళల భద్రత, వారి స్థితిగతులు, వారికి సంబంధించిన చట్టాలు, వారి పట్ల ప్రభుత్వాల ధోరణి వంటివి ప్రాధాన్యం సంతరించు కోవడానికి సందేశ్‌ ఖలీ అవకాశమిచ్చింది. గత కొద్ది కాలంగా పశ్చిమ బెంగాల్‌లో మహిళలను ఓటు బ్యాం కుగా మార్చుకోవడంలో కృతకృత్యురాలైన మమతా బెనర్జీకి ఇప్పుడు పెద్ద దెబ్బే ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌ లో అఖిలేశ్‌ యాదవ్‌ హయాంలో మహిళలకు జరిగిన అన్యాయాలను, మహిళల పట్ల జరిగిన అక్రమాలను బీజేపీ తనకు అవకాశంగా మార్చుకుని, గూండా రాజ్‌ ను అంత మొందిస్తామని వాగ్దానం చేసి విజయాలు సాధించడం జరిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అఖిలేశ్‌ యాదవ్‌ స్థానంలో ఉన్నారు.
నిజానికి, మహిళా ఓటర్లు భావోద్వేగాల మీద ఆధార పడి ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. ఎవరికి ఓటు వేయా లన్నది వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదని అనేక ఎన్నికల్లో నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారికి ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పథకాలన్నీ, వారు ఇంటికే పరిమితం కావడా నికి, అందులోనూ వంటిళ్లకే పరిమితం కావడానికి అవ కాశం కల్పిస్తున్నవే. వారు ప్రస్తుతం వృత్తి, ఉద్యోగాల్లో ఎదు ర్కొంటున్న కష్టనష్టాలు, వేధింపులు, అణచివేతలు, వివక్ష లకు పరిష్కారం దొరకాల్సి ఉంది. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నది చాలా తక్కువ. వారికి కార్మిక శక్తిలో ప్రాధాన్యం ఉండడం లేదు. లోక్‌ సభ ఎన్ని కల్లో పార్టీలు చేస్తున్న వాగ్దానాలను, ఇస్తున్న హామీలను గమనించిన వారికి మహిళలకు వృత్తి, ఉద్యోగాలపరంగా లభించాల్సిన సాంత్వన కనిపించడం లేదు. బీజేపీ ఎక్కువ మంది మహిళలకు అభ్యర్థులుగా అవకాశం కల్పించే అవకాశం ఉన్నా ఈ ప్రధాన ‘ఉద్యోగ’ సమస్యల మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది.

  • ఎస్‌. విశ్వేశ్వర రావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News