Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్America in Crisis: ఆర్థిక సంక్షోభంలో అమెరికా ఉక్కిరిబిక్కిరి

America in Crisis: ఆర్థిక సంక్షోభంలో అమెరికా ఉక్కిరిబిక్కిరి

అమెరికా అప్పుల్లో కూరుకుపోవడమన్నది ఎవరూ ఊహించని పరిణామం. అది ఇప్పటికే తన రుణ పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరువగా వచ్చేసింది.ఏదో ఒక క్షణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోవచ్చు. చట్టపరంగా చెల్లించాల్సిన జీతభత్యాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఇప్పటికే తాను సేకరించాల్సిన రుణాల విషయంలో ఉక్కిరిబిక్కిరవుతోంది. జాతీయ రుణానికి వడ్డీ చెల్లించాల్సి ఉంది. రక్షణ శాఖ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. పన్నుల రిఫండులు ఉండనే ఉన్నాయి. ఇక సామాజిక భద్రతా పథకాలు కూడా చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నాయి. రుణ పరిమితిని జూన్‌ 1వ తేదీలోగా ఉల్లంఘించే పరిస్థితి ఏర్పడి ఉంది. ఇదే జరిగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కోవిడ్‌ ప్రభావం ఇంకా పని చేస్తూనే ఉంది. వడ్డీ రేట్లు పెరిగి, అన్ని రుణాల మీదా అదనంగా చెల్లించడం జరుగుతోంది. స్టాక్‌మార్కెట్లపై ఇప్పటికే వీటన్నిటి ప్రభావం కనిపిస్తోంది. వ్యాపారాలు, వాణిజ్యాలు, ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళనలు, ఆవేదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు కోవిడ్‌ ప్రభావం నుంచి, ఆర్థిక మాంద్యం నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతున్న సమయంలో అమెరికా ప్రభుత్వ రుణ పరిమితి అస్తవ్యస్తంగా మారడం ఆర్థిక వ్యవస్థను ప్రతిష్ఠంభనకు గురి చేస్తోంది.
ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనమైనదనే అభిప్రాయం కలుగుతోంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు లాక్‌డౌన్లు ప్రకటించినా, ఉద్యోగులకు ఉద్వాసనలు పలికినా దేశ విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉంది. చట్టసభల సభ్యుల నుంచి, ఇతర పార్టీల నుంచి సహకారం పొందడానికి, ఒక రాజీమార్గం ఏర్పరచుకోవడానికి, రుణ పరిమితిని తొలగించడానికి ప్రస్తుతం పాలనా వ్యవస్థ నానా కష్టాలూ పడుతోంది. జూన్‌ 1 లోగా రుణ పరిమితిని తొలగించని పక్షంలో నిరుద్యోగ సమస్య 5 శాతం పెరుగుతుందని, 83 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని, జీడీపీ 6.1 శాతం పడిపోతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
పార్టీల మధ్య, పార్లమెంట్‌ సభ్యుల మధ్య సయోధ్య, సామరస్యం లేకపోవడం వల్లే దేశాన్ని అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. రుణాలపై పరిమితి విధించిన కారణంగా ప్రతిసారీ దేశాన్ని ఏదో ఒక సమస్య పీడిస్తోందని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. నిజానికి రుణ పరిమితి అనేది దేశానికి ఉపయుక్తమేనని, ప్రభుత్వ దుబారా తగ్గడానికి, ఆచితూచి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రుణ పరిమితి పెంచాల్సిన అవసరం తలెత్తినప్పుడలా తప్పనిసరిగా చట్టసభల అనుమతి, ఆమోదం అవసరమవుతాయి. ప్రభుత్వం తన చేతుల్ని తానే కట్టేసుకోవడం వల్ల ప్రభుత్వం మీద విశ్వసనీయత కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అమెరికా దేశానిది పటిష్ఠమైన, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అనీ, రుణ పరిమితి అనేది కాలం చెల్లిన పద్ధతి అనీ, రుణ పరిమితిని విధించుకోవాల్సిన అవసరం లేదనీ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఇదివరకటి రుణాలను తీర్చడానికి, బాధ్యతలనునెరవేర్చడానికి కూడా ఈ రుణ పరిమితి అడ్డుపడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తోందని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వాలుతాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చడానికి హద్దూ పద్దూ లేకుండా రుణ భారం పెరుగుతోందని పలువురు పార్లమెంట్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను బలిపెట్టడం జరుగుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి, జూన్‌ 15లోగా ప్రభుత్వం అతి పెద్ద మొత్తంలో ఒక పెద్ద రుణాన్ని చెల్లించాల్సి ఉంది. హౌస్‌ ఆఫ్‌ రిప్రెజంటేటివ్స్‌ స్పీకర్‌, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు అయిన కెవిన్‌ మెక్‌కార్తీ ఇదే అదనుగా పాలక పక్షాన్ని ఇబ్బందులు పెడుతున్నట్టు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశ క్షేమాన్ని, విశ్వసనీయతను తాకట్టు పెడుతున్నారని, రుణ పరిమితిని పెంచకుండా అడ్డుపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఆర్థిక సంక్షోభంలో ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికాను కాపాడడానికి, ఆదుకోవడానికి పార్టీలన్నీ ఒకే తాటి మీద నడవాల్సిన అవసరం ఉందనీ, లేనిపక్షంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలు రాజకీయ నాయకులను క్షమించరనీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News