సమకాలీన తెలుగు సాహితీ రంగంలో ఒక వెలుగు వెలిగిన సి. ఆనంద రామం వందలాది మంది యువ రచయితలకు, సాహితీవేత్తలకు ఒక దిక్సూచిగా గుర్తింపు పొందారు. ఆమె కాగితం మీద కలం పెడితే చాలు దానికొక ప్రత్యేక సాహితీపరమైన వైశిష్ట్యం లభిస్తుంది. అటు బోధనా రంగంలోనూ, ఇటు సాహితీ రంగంలోనూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1935 ఆగస్టు 20న ఏలూరు పట్టణంలో జన్మించిన ఆనంద రామం 60 నవలలు, 100కు పైగా కథలు, మరికొన్ని విమర్శన గ్రంథాలు రాసి, నవలా, కథా సాహిత్యాన్ని కొత్త మలుపులు తిప్పారు. ఆమె రాసిన నవలలో అనేక నవలలను సినిమాలుగా కూడా నిర్మించడం జరిగింది. ఆమె నవలా వస్తువు, కథా వస్తువు జనరంజకంగా ఉండడంతో పాటు, వీటిల్లో సామాజిక స్పృహ, చైతన్యం, సరైన సందేశం కూడా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా చలన చిత్ర నిర్మాణాలకు కూడా ఉపయోగపడ్డాయి. ఆమె నవలలు, కథలే కాక, ఆమె సినిమాలు కూడా ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించాయి.
ఆమె రాసిన ఆత్మబలి అనే నవల తెలుగు నవలా సాహిత్యంలో ఒక చరిత్ర సృష్టించిందంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఈ నవలను ఆ తర్వాత సంసార బంధం పేరుతో సినిమాగా నిర్మించారు. అదే నవలను ఆ తర్వాత జీవన తరంగాలు సీరియల్‌గా కూడా నిర్మించారు. ఈ సినిమా, సీరియల్ రెండూ అటు ప్రేక్షకులను, ఇటు వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె రాసిన జాగృతి అనే నవలను త్రిశూలం సినిమాగా నిర్మించారు. మమతల కోవెల అనే నవలను జ్యోతి పేరుతో సినిమాగా తీయడం జరిగింది. ఆమె రాసిన కథలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. ముఖ్యంగా తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లో ఆమె కథనలనేకం తర్జుమా కావడం విశేషం. ఆమె రచనల మీద అనేక మంది విద్యార్థులు పరిశోధనలు చేసి డాక్టరేట్లు పొందారు. ఆమె ఒక అధ్యాపకురాలుగా సుమారు 30 మంది విద్యార్థులకు ఇతర అంశాల్లో గైడు కింద సహాయ సహకారాలు అందజేయడం జరిగింది.
ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఆనంద రామం ఏలూరులోని ఈదర వెంకట్రామారెడ్డి పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసిం చారు. ఇంటర్మీడియట్ వరకూ చదివిన తర్వాత ప్రైవేట్ గా బి.ఎ డిగ్రీ పూర్తి చేశారు. ఏలూరులోని సి.ఆర్.ఆర్ కళాశాలలో కొద్ది కాలం పాటు తెలుగు ట్యూటర్ గా పనిచేశారు. 1957లో వివాహం అయిన తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చారు. 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎం.ఏ చేశారు. ఆ తర్వాత డాక్టర్ సి. నారాయణ రెడ్డి సారథ్యంలో ఆమె పిహెచ్.డి చేసి డాక్టరేట్ పొందారు. హోం సైన్స్ కాలేజీలోనూ, నవజీవన్ కాలేజీలోనూ కొంత కాలం అధ్యాపకురాలిగా పనిచేసిన తర్వాత, 1972లో కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసి, 2000లో పదవీ విరమణ చేశారు. 2021లో హైదరాబాద్ లోనే కాలధర్మం చెందారు.
ఒక రచయితగా ఆమెది మహోన్నత వ్యక్తిత్వం. రచయితల్లో ఒక మకుటం లేని మహారాణిలో ఆమె రాణించారు. ఆమె రాజీపడని ధోరణి, సంస్కారం, విలువలు ఆమె రచనల్లో ప్రతిబింబిస్తాయి. సంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆమె ఆధునిక భావాలు కలిగిన రచయిత్రి. ఎక్కడా ఎప్పుడూ మూఢ నమ్మకాలను గానీ, దురాచారాలను గానీ ప్రోత్సహించకుండా హేతుబద్ధ వైఖరిని గట్టిగా సమర్థించారు. ఆమె కథలు, నవలలు వేలాది మంది మహిళలకే కాకుండా పురుషులకు కూడా మార్గదర్శకం నెరిపాయి. ఆమె జీవితం కూడా అందరికీ ఆదర్శం.