ఇందుగలదందు లేదను సందేహంబు వలదు.. ఎందెందు వెదకిన అందందే గలదు మద్యం కుంభకోణం అన్నట్లు తయారైంది మన దేశంలో పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన మద్యం ప్రకంపనలు.. ఇటు దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోనూ వినిపిస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యక్షంగా సంబం ధం ఉన్న మాట అందరికీ తెలిసిందే. మరోవైపు తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల మేరకు మద్యం స్కాం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రంగప్రవేశం చేసింది. కానీ… ఇవన్నీ ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని చెబుతున్న కుంభకోణం వీటన్నింటికీ తాత లాంటిది. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది. ఎక్కడా లైసెన్సుల వేలం నిర్వహించలేదు. మద్యం కొనుగోళ్లలో అన్ని దశల్లోనూ చెల్లింపులన్నీ కూడా ప్రభుత్వమే చేసింది. మొత్తం 99 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో దాదాపు రూ. 690 కోట్లు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. మిగతా సొమ్ము అంతా ఏమైంది? అంటే, దాదాపు 98 వేల 310 కోట్ల రూపాయల సొమ్ము ఏ బ్యాంకు ఖాతాలోకీ వెళ్లలేదని చెబుతున్నట్లే కదా? అయితే, ఇందులో రూ.4 వేల కోట్ల మేరకు సొమ్మును జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు తరలించేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పోనీ.. ఇదంతా కూడా తీసేశారనుకున్నా… మరి మిగిలిన దాదాపు రూ.94 వేల కోట్లు ఏమైపోయినట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు? గతంలో వైసీపీలో ఉండి, ఎన్నికలకు కొన్ని నెలల ముందు తన ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరి మళ్లీ 2024 ఎన్నికల్లో ఎంపీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ వ్యవహారంలో తేనెతుట్టె కదిలించారు. ఈ మొత్తం వ్యవహారం గురించి ఆయన సాక్షాత్తు లోక్‌సభలోనే ప్రస్తావించారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కృష్ణదేవరాయలను పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. వాళ్లిద్దరూ చర్చించుకుంటున్న ఫొటోను కూడా మీడియాకు విడుదల చేశారు. లోక్‌సభలో చర్చ ముగిసిన తర్వాతే వీరిద్దరి భేటీ జరిగిందని.. అంటే ఈ విషయం మీద ఇక తాము దృష్టి సారించ బోతున్నామని ప్రజల్లోకి ఒక సందేశం పంపాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా మార్గనిర్దేశం మేరకు ఈ ఫొటో బయటకు వచ్చిందని అనుకోవాలి.
ఇక్కడ ఎంత వద్దనుకున్నా కూడా ఒక విషయం మాత్రం మెదడును పదే పదే తొలిచేస్తోంది. జగన్ పరిపాలన సాగిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాల తీరు గురించి, ఎక్కడా డిజిటల్ చెల్లింపులు లేని విషయం గురించి అస్సలు కేంద్రప్రభుత్వానికి తెలియదా? ఆ మాట అంటే ఎవరైనా నమ్మగలరా? ఎందుకంటే.. ఆ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాల గురించి ప్రధాన పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. కేంద్రం ఆధ్వర్యంలోనే ఉండే పీఐబీ లాంటి వార్తాసంస్థలు ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా ఉండవు. పైగా.. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు నిత్యం డేగకళ్లతో పరిశీలిస్తూనే ఉంటాయి. అలాంటి వాటి దృష్టికి ఈ వ్యవహారం తెలియదంటే ఎవరైనా నమ్మగలరా? కేవలం రూ.500 కోట్ల స్కాం జరిగితేనే ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని వెంటాడి.. వేటాడి మరీ జైల్లో కూర్చోబెట్టారు. చివరకు గద్దెదించే వరకు తీసుకొచ్చారు. మరోవైపు తమిళనాడులోనూ వెయ్యికోట్ల మేర కుంభకోణం జరిగిందని తెలుసుకుని, దాని మూలాలు వెతుకుతున్నారు. రేపో మాపో ఆ వ్యవహారం కూడా బయటపడి తీరుతుంది. ఇంత చేస్తున్న సీబీఐ, ఈడీ లాంటి మేటి దర్యాప్తు సంస్థల దృష్టికి అసలు ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారం గురించి ఏమాత్రం తెలియలేదా? ఇంత పెద్ద మొత్తంలో డబ్బు.. దాదాపు లక్ష కోట్లు అంటే ఒక చిన్న రాష్ట్రం ఏడాది బడ్జెట్ అవుతుంది. అలాంటిది అదంతా ఏమైపోయింది, ఎవరెవరి జేబుల్లోకి వెళ్లిందన్న విషయం ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండిపోయిందంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నట్లని అను కోవాలి? నిజానికి పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతూ, తనను ఎవరూ చూడట్లేదని అనుకుంటుందట. కానీ, ఇక్కడ పిల్లి (జగన్ ప్రభుత్వం) పాలు తాగుతుంటే పక్కనే ఉన్న యజమాని (కేంద్ర ప్రభుత్వం) కూడా కళ్లు మూసుకునే ఉన్నారని అనుకోవాలా?
ఢిల్లీలో ఏం జరిగింది ?
కేవలం రూ.500 కోట్ల మేర జరిగిందంటున్న ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నాయకుల నుంచి తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, నాటి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నాటి అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డితోపాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమీప బంధువు పెనాక శరత్ చంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ కుంభకోణంలో ముందుగా అరెస్టయిన నాయకుడు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా. ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కటకటాల వెనక్కి వెళ్లారు. ఇంతలో ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. అసలు ముందు ఢిల్లీ మద్యం విక్రయ విధివిధానాల్లో మార్పుచేర్పులు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుకు సంబంధించిన ఫైల్ ఆమోదం కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపింది. ఈ ఫైల్‌లోని పలు అంశాల పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో దీనిపై విచారణ జరపాలంటూ ఈడీకి ఆయన సూచించారు. అలా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు రూ.1,100 కోట్ల నేరపూరిత ఆర్జనను గుర్తించినట్లు ఈడీ తాజాగా కోర్టులో దాఖలుచేసిన ఛార్జిషీట్‌లో తెలిపింది. ఇందులో కవితతో పాటు చరణ్ ప్రీత్ సింగ్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మల పాత్రను వివరించింది. మొత్తం 36 మంది నిందితులుంటే.. వాళ్లలో కవితను 32వ నిందితురాలిగా చెప్పింది. మద్యం విధి విధానాలను మార్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇచ్చిన కవిత.. తిరిగి రాబట్టుకోవడానికి ఇండోస్పిరిట్ అనే సంస్థ ద్వారా లాభాల రూపం లో రూ.193 కోట్లు ఆర్జించారట!!
తమిళనాట ప్రకంపనలు..
తమిళనాడులో మద్యం అమ్మకాలను నియంత్రించడానికి, నాటు సారాను నిరోధించడానికి 1983లో నాటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ టస్మాక్ అనే సంస్థను ఏర్పాటుచేశారు. క్రమంగా దాని పుణ్యమాని ఆ రాష్ట్ర ఖజానాలో కాసుల గలగలలు కాస్త గట్టిగానే వినిపించాయి. టస్మాక్ ఆధ్వర్యంలో 7వేల రిటైల్ దుకాణాలున్నాయి. ఏడాదికి 3 లక్షల బాటిళ్ల మద్యం అమ్ముతారు. ఇందులోనే అక్రమాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. అవినీతి నిరోధక చట్టం కింద పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసినట్లు మార్చి 13న ప్రకటించింది. మద్యం టెండర్లు, అధికారుల బదిలీలు, రిటైల్ దుకాణాల్లో మద్యం ధరలు అసాధారణంగా పెంచేయడంలో అవినీతి జరిగిందని ఈడీ చెబుతోంది. కొన్ని డిస్టిలరీ కంపెనీలు వ్యవస్థీకృతంగా మద్యం ధరలు పెంచేసి, నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా వెనకేసుకు న్నాయని, అందులో చాలావరకు తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలకు లంచాలుగా ఇచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. సహజం గానే కేంద్ర ప్రభు త్వంపై అనేక అంశాల్లో కాలు దువ్వుతున్న అధికార డీఎంకేకు ఈ వ్యవహారంతో గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. కానీ.. ఈ వ్యవహారంలో డీఎంకే నేతలతో పాటు అన్నాడీఎంకే నేతలకు కూడా హస్తం ఉందన్నది తాజాగా తెలుస్తున్న విషయం. టస్మాక్ అవినీతిపై మొత్తం 41 కేసులు నమోదైతే.. అందులో 34 కేసులు అన్నాడీఎంకే హయాంలోనివేనని, కేవలం ఏడు మాత్రమే డీఎంకే హయాంలో జరిగిన విషయాలపై నమోదయ్యాయన్నది సరికొత్త సమాచారం. గతంలో అవినీతి కేసులో జైలుశిక్ష పడి, మంత్రిపదవి పోగొట్టుకుని.. మళ్లీ అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టిన సెంథిల్ బాలాజీ పేరే ఈ కుంభకోణంలోనూ వినిపిస్తోంది.
ఏపీలో ఎప్పుడు మొదలుపెడతారు?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఎప్పుడు ఊపుతుందన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. జగన్ మీద, ఆయన అనుయాయుల మీద ఉన్న కేసులు అన్నీ ఇన్నీ కావు. నిజంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనుకుంటే ఈపాటికి ఎన్నికల ఫలితాలు విడుదలైన మర్నాటి నుంచి ఏ క్షణంలోనైనా వారందరి బెయిల్ రద్దు చేయించి మరీ జైల్లోకి పంపేది. కానీ.. ఎందుకో గానీ ఇప్పటికీ ఆ పని చేయడం లేదు. మద్యం కుంభకోణంలో అత్యంత కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది నుంచి మొదలుపెట్టి సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో పనిచేసిన వారి వరకు అందరూ ఇరుక్కుపోయినట్లే. కానీ, దర్యాప్తు మొదలైన తర్వాత వాళ్లంతా సహజంగానే “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా” అంటూ అదుర్స్ సినిమా డైలాగులు వల్లిస్తార న్నది అందరికీ తెలిసిందే.
ఎవరైనా ప్రస్తుత ప్రభుత్వం మీద గట్టి నమ్మకం ఉంచి.. అప్రూవర్లుగా మారిపోవడానికి ముందు కొస్తేనే అసలు విషయాలన్నీ బయటపడతాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కొంత ఉప్పందిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మొత్తానికి పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డేనని (రాజ్‌కసిరెడ్డి) విజయసాయి ఇటీవల ఓ పెద్ద బాంబు పేల్చారు. సదరు కసిరెడ్డి … జగన్‌కు దూరపు బంధువు, అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన ఈ విషయం బయటపెట్టి ఇప్పటికి రెండు వారాలు దాటి పోతోంది. అయినా దీని గురించి ఆ తర్వాత ఎవరూ ఏమీ చెప్పిన పాపాన పోలేదు. ఇప్పుడైనా మరి ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ముందుకొచ్చి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఏమైనా విచారణ మొదలుపెడతాయో.. లేదో చూడాలి.
[email protected]
98858 09432