తమిళనాడు రాజకీయ తెర మీద మరో స్టార్ అవతరించాడు. అన్నె వరార్, వళి విడుంగొ (అన్న వస్తున్నారు. దారి వదలండి). తమిళ సినిమా హీరో విజయ్ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే నినాదంతో పోస్టర్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 5న రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి విజయ్ ముహూర్తం పెట్టుకున్నారు. ఇది రాజకీయ ప్రవేశానికి సంబంధించిన నినాదమే అయినప్పటికీ, ఇందులో కొంత నాటకీయత కూడా కనిపిస్తోంది. ఇందులోనే ‘కొత్త నాయకుడు వస్తున్నారు. కొత్త బాధ్యతలు చేపడతారు’ అనే ట్యాగ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఆయనకు తనకు మహాత్మా గాంధీయే ఆదర్శమని కూడా చెబుతున్నారు.
ఆయన నటించిన సినిమాల మాదిరిగా అట్టహాసంగా కాకుండా ఇటీవల ఆయన ఎంతో నిరాడంబరంగా, చడీ చప్పుడూ లేకుండా తమ పార్టీ జెండాను, లోగోను ఆవిష్కరించారు. ఆయన తన పార్టీకి తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టారు. తన పార్టీ జెండా మీద రెండు ఏనుగులు పోరాట భంగిమలో నిలబడి, ఘీంకరిస్తున్నట్టు కనిపిస్తాయి. ఈ రెండు ఏనుగుల మధ్యలో ఒక పువ్వు గుర్తు కూడా ఉంటుంది. ఆయన ఉద్దేశంలో పువ్వు కూడా విజయానికి సంకేతమే. సాధారణంగా ఇక్కడి ద్రవిడ పార్టీల ఉపయోగించే నలుపు రంగు స్థానంలో ఆయన ఎరుపు రంగును, పసుపు రంగును ఎక్కువగా ఉపయోగించారు.
నిజానికి ఆయన తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్టు గత ఏడాది చివర్లోనే ప్రకటించారు కానీ, తన రెండవ చిత్రం పూర్తయ్యే వరకూ ఆగి, ఆ తర్వాతే రాజకీయ పార్టీని ప్రారంభించాలని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. “ఇక నుంచి మేం తమిళనాడు కోసం, తమిళ ప్రజల కోసం పాటుబడబోతున్నాం” అని ఆయన ఇటీవల ప్రకటించారు. సెప్టెంబర్ రెండవ వారంలో చెన్నైలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన పార్టీ సిద్ధాంతాలను, ప్రణాళికలను, ఆశయాలను ప్రజల ముందుంచాలని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులో మరో నటుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పలువురు ప్రముఖులు, ముఖ్యంగా సినీ ప్రముఖులు గతంలో స్టూడియోల నుంచి సెయింట్ జార్జ్ ఫోర్ట్ కు వెళ్లారు. ఎం.జి. రామచంద్రన్, జయలలిత, అన్నాదురై, కరుణానిధి, విజయకాంత్ వంటివారు సినిమా రంగం నుంచి వెళ్లినవారే. అయితే, శివాజీ గణేశన్, కమల హాసన్ వంటి వారు మాత్రం మొదటి అడుగుతోనే రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్న పక్షంలో కేవలం జనాకర్షణ, నటన సరిపోదని, మరెన్నో ఎత్తులు, జిత్తులు అవసరమని వారికి కొద్ది కాలంలోనే అర్థమైపోయింది. 2006లో రాజకీయ ప్రవేశం చేసిన విజయకాంత్ ఈ రంగంలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. రజనీకాంత్ కూడా కొద్దిపాటి ప్రయత్నం చేశారు కానీ, చేతులు కాలకుండానే బయటపడిపోయారు.
అడుగడుగునా అడ్డంకులు
అయితే, విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్) ఈ రంగంలో విజయం సాధిస్తారా, లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాకపోయినా ఆయన రాజకీయ ప్రవేశం మాత్రం తమిళనాడు ప్రజల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. రాజకీయాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కు ఉన్నట్టే సినిమా రంగంలో దళపతి అనే బిరుదున్న విజయ్ రాజకీయాల్లో కూడా దళపతిగా నిలవగలరా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అనేక కారణాల వల్ల ఆయన అభిమానులు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన వయసు ఆయనకు బాగా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న విజయ్ సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు. అనేక సినిమా అవకాశాలు ఆయనకు అందుతూనే ఉన్నాయి. సినిమా రంగం నుంచి రిటైర్ అవడానికి ఆయనకు ఇంకా సమయం ఉంది. రాజకీయాలను ఎంచుకోవాల్సిన వయసు ఆయనకు ఇంకా రాలేదు. కమల హాసన్ మాదిరిగా ఆయన ఒక కాలు సినిమాల్లోనూ, మరో కాలు రాజకీయాలోనూ పెట్టలేదు. దర్శకుడు హెచ్. వినోద్ తో నిర్మాణమవుతున్న తన 69వ సినిమా తన ఆఖరు సినిమా అని విజయ్ ఎప్పుడో తేల్చి చెప్పేశారు. 2025 ఫిబ్రవరిలో ఆ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే సరిగా తమిళనాడు ఎన్నికలకు ఏడాది ముందన్న మాట.
ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్.జి.ఓ ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తోంది. న్యాయ సహాయం, వైద్య సహాయం, పిల్లలకు గ్రంథాలయాలు వగైరా కార్యక్రమాలతో తమిళనాడు ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ 2021 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి, 129 స్థానాలు గెలుచుకుంది. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులను బట్టి చూస్తే ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం తప్పటడుగు కాదేమోననిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ మాదిరిగానే ఆయన కూడా యువత, మహిళల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న అన్నా డి.ఎం.కె, డి.ఎం.కెలకు ప్రత్యా మ్నాయంగా ఎదగడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆయన ఎవరి ఓట్లను కొల్లగొడ తారన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం. ఎం.జి.ఆర్, జయలలిత నాయకత్వంలో ఎక్కువగా యువజనులు, మహిళల ఓటు బ్యాంకులను సృష్టించుకున్న అన్నా డి.ఎం.కె ఓట్లే విజయ్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా అన్నా డి.ఎం.కె ఓట్లు బాగా తగ్గిపోయాయి. పైగా అంతర్గత కుమ్ములాటలతో ఈ పార్టీ సతమత మవుతోంది. ఏళప్పాడి పళనిసామి, ఆయన బృందం ఈ పార్టీని పటిష్ఠం చేసే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి.
మారుతున్న సమీకరణాలు
విజయ్ రాజకీయ ప్రవేశం వల్ల డి.ఎం.కెకు ఏమన్నా ముప్పు ఉంటుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్టాలిన్ కుమారుడు, నటుడు అయిన ఉదయనిధి స్టాలిన్ 2026 శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే, ఇది ఇద్దరు యువ నటుల మధ్య పోటీగా మారే అవ కాశం ఉంటుంది. ఐ.పి.ఎస్ ఆఫీసర్ గా రాజీనామా చేసి, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. అణ్ణామలై మూడవ యువ అభ్యర్థిగా ఈ ఇద్దరితో పోటీ పడడం కూడా జరుగుతుంది. అంటే, 2026 తర్వాత తమిళనాడు రాష్ట్రం పూర్తిగా కొత్త తరం చేతిలో పడుతుందన్న మాట. రాష్ట్రంలో పార్టీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ డి.ఎం.కె వ్యతిరేక ఓట్లు చీలే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 2026 ఎన్నికల్లో డి.ఎం.కె ప్రభుత్వం పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగానీ, ఇతర పార్టీలు గానీ దీన్ని ఒక సదవకాశంగా మలుచుకునే అవకాశాలు చాలా తక్కువ. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇది నిర్ధారణ అయింది. వీటితో పాటు, రజనీకాంత్, కమల హాసన్ రాజకీయ ప్రయత్నాలను కూడా దృష్టిలో పెట్టుకున్న విజయ్ ఎక్కడా తొందరపడడం లేదు. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం కూడా ఒకే నాయకుడి మీద ఆధారపడిన పార్టీ. సినిమాలో హీరో మాదిరిగానే రాజకీయాల్లో కూడా విజయం మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది.
- కె. ఎస్. రావు, చెన్నై