Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Anti defection law: ఫిరాయింపుల చట్టంలోప్రక్షాళన అవసరం

Anti defection law: ఫిరాయింపుల చట్టంలోప్రక్షాళన అవసరం

ఆయారాం, గయారాం సంస్కృతికి అడ్డుకట్ట వేయలేక పోతున్న చట్టం

మహారాష్ట్రలో ఎనిమిది మంది శాసనసభ్యులతో ఎన్‌.సి.పి నాయకుడు అజిత్‌ పవార్‌ పార్టీ ఫిరాయించి రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఫిరాయింపుల నిరోధక చట్టంపై మరోసారి దేశ ప్రజల దృష్టి పడేలా చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ మీదా, అందులోని లోపాలు, లొసుగుల మీదా మళ్లీ చర్చ మొదలైంది. 1985లో 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలో స్థానం సంపాదించిన పదవ షెడ్యూల్‌ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ఒక రాజకీయ పార్టీ టికెట్‌ మీద గెలిచి, ఆ తర్వాత ప్రజాభిప్రాయానికి భిన్నంగా శాసనసభ్యులు మరో పార్టీలోకి ఫిరాయించడాన్ని నిషేధించడం ఈ చట్టం ఉద్దేశం. కాగా, రాజ్యాంగంలోని 91వ సవరణ ప్రకారం, ఒక పార్టీ నుంచి మూడు వంతుల మంది శాసనసభ్యులు లేదా పార్లమెంట్‌ సభ్యులు చీలిపోయి మరో పార్టీలోకి మారినప్పుడు మాత్రమే ఆ చీలిక వర్గం చట్టబద్ధం అవుతుంది.
అయితే, ఈ సవరణ ఆయారాం, గయారాం సంస్కృతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. చట్ట సభ్యులు నిర్విఘ్నంగా, యథేచ్ఛగా పార్టీలు మారడం జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రభుత్వాలు పేకముక్కల్లా పడిపోవడం కూడా కొనసాగుతూనే ఉంది. ఇదివరకటి కంటే ఎక్కువగా గత దశాబ్దంలో ఈ కారణంగా ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం జరిగింది. శాసన సభ్యులు పార్టీ ఫిరాయించడం, ఇతర పార్టీలకు అనుకూలంగా కొందరు శాసనసభ్యులు రాజీనామాలు చేయడం వంటి చర్యలు ప్రభుత్వాల పతనానికి దోహదం చేస్తున్నాయి. గోవాలోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో, ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. పదవ షెడ్యూల్‌ కానీ, ఇతర సవరణలు గానీ ఈ ఫిరాయింపుల ధోరణిని అరి కట్టలేకపోతున్నాయి.
ఈ ఫిరాయింపుల చట్టంలో అతి పెద్ద లోపం స్పీకర్‌ వ్యవహరించే తీరు. పార్టీలో చీలికను నిర్ధారించవలసిన వ్యక్తి స్పీకరే. స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి, తన నిర్ణయాన్ని ప్రకటించడా నికి కాల వ్యవధిని లేదా గడువును నిర్ధారించడం జరగలేదు. స్పీకర్లు కూడా పార్టీ సభ్యులే అయినందువల్ల వారు పక్షపాత వైఖరినే ప్రదర్శించడం జరుగుతోంది. ఈ చీలికలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు స్పీకర్లు శాసనసభ పదవీ కాలం ముగిసే వరకూ కాలయా పన చేయడం కూడా జరుగుతోంది. అయితే, ప్రస్తుత మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు కల్పించుకుని, ఈ ఆనవాయితీని కొద్దిగా మార్చింది. శివసేన పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు హేతుబద్ధమైన కాల వ్యవధి లోగా స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. అయితే, ఏడాది గడుస్తున్నా స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇప్పుడు మరో చీలిక చోటు చేసుకుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం, స్పీకర్‌ నిర్దిష్ట కాల వ్యవధిని పాటించాల్సిన అవసరం లేనందువల్ల, సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ప్రభుత్వాలలో సుస్థిరత ఏర్పడదు. ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు కుప్పకూలడం కూడా ఆగదు. అది జరిగితే తప్ప ప్రజాభిప్రాయానికి విలువ, గౌరవం ఉండవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News