Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్AP-Odissa border problem: సరికొత్త సరిహద్దు సమస్య

AP-Odissa border problem: సరికొత్త సరిహద్దు సమస్య

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య సరికొత్త సరిహద్దు సమస్యకు తెరతీశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఉన్న కోటియా అనే ప్రాంతంనుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వెంటనే వైదొలగాలంటూ ఆయన చేసిన ప్రకటన ఈ రెండు రాష్ట్రాల మధ్య కొద్దిగా చిచ్చు రేపింది. కోటియా అనే ప్రాంతంలో 21 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలంటూ ఆయన ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఇది ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రస్తుతం ఒక వివాదాస్పద వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. సరిగ్గా ఒడిశా అవతరణ దినోత్సవం నాడు ఆయన ఈ ప్రకటన చేయడంతో అది వెంటనే ప్రజల్లోకి పాకిపోయింది. దీని మీద రాజకీయంగా స్పందన, ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి వివాదాస్పద ప్రకటన చేసినందుకు ప్రధాన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పి. రాజన్న దొర గట్టిగా డిమాండ్‌ చేశారు. అంతేకాదు, దీని మీద ఒడిశాలోని పాలక పక్షం బిజూ జనతాదళ్‌, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కూడా మొదలైంది.

- Advertisement -


సహజంగానే బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన్‌ ప్రకటనను సమర్థిస్తూ ఆయనను వెనకేసుకు రాగా, బిజూ జనతా దళ్‌ నాయకురాలు, రాష్ట్ర రెవెన్యూ అయిన మంత్రి ప్రమీలా మల్లిక్‌ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఎన్‌.డి.ఏ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధాన్‌ ప్రకటన ఈ వివాదాన్ని ఇప్పుడు ఏమాత్రం పరిష్కరించలేదు. కారణం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల నాయకులూ చర్చలు జరపడం అవసరం. లేదా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకూ నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే, ఇది సుప్రీం కోర్టు విచారణలో ఉండగా కేంద్ర మంత్రి దీని గురించి వ్యాఖ్యానించవచ్చా, ఈ విధంగా వ్యాఖ్యానించడం రాజ్యాంగబద్ధం అవుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఆయన ఒడిశాకు అనుకూలంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. అంతేకాదు, ఈ రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆయన కొద్ది కాలం క్రితం ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు కూడా రాశారు.
కాగా, ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనాలను ఆశించినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన బీజేడీని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలనుకున్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న కోరాపుట్‌ జిల్లా గత ఇరవై ఏళ్లుగా బీజేడీ ఓటు బ్యాంకుగా, పటిష్ఠమైన కంచుకోటగా మారింది. ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో బీజేడీకి పది శాసనసభ స్థానాలు ఉండగా బీజేపీ కేవలం రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది. కోరాపుట్‌ జిల్లాలో మాత్రం బీజేపీ పాగా వేయలేకపోయింది. అప్పటి నుంచి కోరాపుట్‌ జిల్లా మీద బీజేపీ కన్ను వేసింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ లేక గిరిజన ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో భాగంగా కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో కూడా ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. అయితే, ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వయంగా కొన్ని పథకాలను ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తోంది. ఎత్తులు, పైఎత్తులు వేయడంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను మించిన వారు లేరు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని ఏవిధంగానైనా ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ సరిహద్దు సమస్యకు తెర తీశారు.
ఈ కొటియా ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులకు బాగా దగ్గరగా ఉంది. ఇక్కడ చాలా కాలంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అయితే, ఒడిశాలో కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటుచేయాలని ఒడిశా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. ఈ 21 గ్రామాల కొటియా ప్రాంతాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కలపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టుబడుతోంది. పార్వతీపురం నుంచి కొటియా సుమారు 40 కిలోమీటర ్లదూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని తమ రాష్ట్రంలో కలుపుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని అక్కడి మంత్రులు తరచూ ఫిర్యాదు చేయడం కూడా జరుగుతోంది. గత ఏడాది జనవరిలో నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి సమావేశమై, ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక కమిటీని వేసి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గం సుగమం చేశారు కానీ, అది ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. మొత్తానికి కోటియా కేంద్ర బిందువుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా సరిహద్దు వివాదం రాజుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News