ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగంలో ‘గుండెకాయ‘ లాంటివి సెమికండక్టర్ మైక్రోచిప్స్ అని గుర్తించబడినవి. అంతర్జాతీయ స్థాయిలో సెమికండక్టర్ (అర్థవాహకాలు) చిప్స్ తీవ్ర కొరతతో ఆటోమొబైల్ రంగంలో వాహనాలు, ముఖ్యంగా కార్ల ఉత్పత్తి, మార్కెటింగ్, రెవిన్యూ పూర్తిగా పడిపోవడంతో కార్ల కొనుగోలు దారులు ఆరు నెలల వరకు వేచిచూడాల్సిన అగత్యం ఏర్పడింది. గత ఏడాది నుంచి మైక్రోచిప్స్ కొరత వల్ల ప్రముఖ ఆపిల్ కంపెనీ 6 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని కోల్పోవలసి వచ్ఛింది. సెమికండక్టర్ చిప్స్ తయారు చేసే ప్రముఖ కంపెనీలుగా ఇంటెల్, సామ్‌సంగ్, టియస్‌యంసి-థైవాన్, యస్‌కె హైనిక్స్, మైక్రోన్, క్వాల్కమ్, బ్రాడ్‌కమ్, విడియా, టిఐ, ఇన్ఫ్నియాన్ లాంటివి పేరుగాంచాయి.
సెమికండక్టర్ చిప్స్ కొరత:
గతంతో పోల్చితే ప్రస్తుత ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7.1 మిలియన్ల వాహనాల ఉత్పత్తి తగ్గవచ్చని అంటున్నారు. కరోనా విపత్తు, చైనా-అమెరికా వాణిజ్య పోరాటాలు, జపాన్ కంపెనీలో అగ్ని ప్రమాదం, వాతావరణ విపత్తులు లాంటి ఇతర కారణాల ఫలితంగా వాహనాల ఉత్పత్తి కొంత వరకు పడిపోవడం గమనించారు. సెమికండక్టర్ చిప్స్ కొరతతో ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలీ కమ్యూనికేషన్లు, వైద్య ఉపకరణాలు, ల్యాబ్‌టాప్‌లు, గేమింగ్ పిసీలు, ఐపాడ్స్, టాబ్లెట్ పిసీలు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, సెక్యూరిటీ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, వీడియో గేమ్స్ లాంటి 169 పరిశ్రమల ఉత్పత్తులు తగ్గిపోయాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా లాంటి కంపెనీల కార్లకు గిరాకీ ఉన్నప్పటికీ చిప్స్ కొరతతో కార్ల ఉత్పత్తులు తగ్గడం నమోదైంది.
కుదేలైన ఆటోమొబైల్ రంగం:
మారుతీ కంపెనీ కార్లు ఏప్రిల్-2021లో 1,35,879 ఉత్పత్తి జరుగగా, నవంబర్-2021లో 1,09,722 మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. హూండయ్ కంపెనీ కార్లు ఏప్రిల్-2021లో 49,002 తయారు కాగా, నవంబర్-2021లో 37,001 మాత్రమే మార్కెట్‌కు అందుబాటులోకి వచ్చాయి. హీరో స్కూటర్ల అమ్మకాలు 24 శాతం, హోండా అమ్మకాలు 6 శాతం పడిపోయాయి. చిప్స్ కొరతతో పాసింజర్ వాహనాల తయారీ 27 శాతం పడి పోయింది. ప్రతి సాధారణ కారులో కనీసం 150 వరకు మైక్రో చిప్స్, అత్యాధునిక కారులో దాదాపు 1,400ల వరకు మైక్రోచిప్స్ వాడడం జరుగుతుంది. 2022, 2023 వరకు మైక్రో చిప్స్ కొరత వెంటాడవచ్చని అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 2020 అమ్మకాలతో పోల్చితే 2021 డిసెంబర్ మాసంలో 3-వీలర్స్, కమర్షియల్ వాహకాలు, ఇతర వాహన ఉత్పత్తి, అమ్మకాలు పడిపోవడం గమనించారు. డిసెంబర్ 2020లో 18.6 లక్షల వాహనాలు అమ్మకం కాగా, డిసెంబర్ 2021 మాసంలో మాత్రం 15.6 లక్షలుమాత్రమే అమ్ముడయ్యాయి. గత డిసెంబర్‌తో పోల్చితే 2021 డిసెంబర్‌లో 3-వీలర్ వాహనాల అమ్మకాలు 59.5 శాతం పెరిగాయి. అదే విధంగా ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం 10.3 శాతం తగ్గాయి.
ప్రపంచ స్థాయి కంపెనీలు:
ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్, మైక్రో చిప్స్ అని పిలుచుకునే సెమికండక్టర్లు పరిశుద్ధ సిలికాన్ లేదా జెన్మేనియంలను వాడుతూ, వాహకత పెంచడానికి డోపింగ్ ప్రక్రియ ద్వారా స్వల్ప వాంఛనీయ మలినాలను కలిపి తయారు చేస్తారు. ప్రపంచ దేశాల్లో 51 శాతం చిప్స్‌ను థైవాన్‌కు చెందిన టియస్‌యంసి కంపెనీ మాత్రమే తయారు చేస్తున్నది. అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, నెథర్‌లాండ్స్ కూడా సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 100 శాతం విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడిన భారతంలో మైక్రోచిప్స్ తయారీని పెంచడానికి రానున్న 2-3 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం ₹ 76,000/- వేల కోట్ల నిధితో పలు రాయితీలు, ఆర్థిక చేయూతలను కల్పిస్తున్నది. టాటా గ్రూప్, మైక్రోన్, ఇస్రో, డిఆర్‌డిఓ, పలు అంకుర సంస్థలు భారత్‌లోనే చిప్స్ తయారు చేయడానికి కృషి చేస్తున్నాయి.
కారు డ్రైవర్లకు చేయూత, భద్రత వ్యవస్థలు, కెమెరాలు, జిపియస్ వ్యవస్థ, వినోద ఉపకరణాలు, అటోమెటిక్ డ్రైవింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, బ్యాటరీలు, డిస్‌ప్లే, లేజర్ డయోడ్స్, యల్‌ఈడీలు, ఫోటో సెల్స్, ట్రాన్సిస్టర్స్, బ్లూటూత్ లాంటి వేల ఉపకరణాలలో చిప్స్‌ను వాడతారు. ప్రజా రవాణాలో ప్రధాన భాగమైన పలు వాహనాల డిమాండ్, సప్లైల మధ్య అంతరానికి కారణమైన మైక్రోచిప్స్ తీవ్ర కొరతను అధిగమించడానికి ఇండియా స్వదేశీ పరిజ్ఞానాన్ని, తగు పరిశ్రమలను నెలకొల్పాలని ఆశిద్దాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ - 9949700037