మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో మట్టుబెట్టడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఇటువంటి తక్షణ న్యాయాలపై తీవ్రస్థాయిలో చర్చ ప్రారంభమైంది. థానే జిల్లా బద్లాపూర్ లో ఇద్దరు మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగిన కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్ షిండే అనే వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేయడం మహారాష్ట్రలోనే కాక, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అనడానికి పరిసర సాక్ష్యాలు నిదర్శనంగా నిలిచాయని, పోలీసులు కావాలనే అతన్ని హత్య చేశారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం ప్రారంభించాయి. దర్యాప్తు కోసం నిందితుడిని జైలు నుంచి తీసుకు వెడుతుండగా, అతను ఒక పోలీస్ దగ్గర నుంచి రైఫిల్ లాక్కుని, పోలీసుల మీద కాల్పులు జరపబోయాడని పోలీసులు ఆరోపించారు. అయితే, తన జీవితంలో ఏనాడూ తుపాకిని చూసి కూడా ఉండని ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసుల దగ్గర నుంచి రైఫిల్ లాక్కుని పోలీసులను కాల్చేందుకు ఎలా ప్రవర్తిస్తాడని, పైగా చేతికి సంకెళ్లు ఉన్న స్థితిలో వేగంగా వెడుతున్న వ్యానులోని పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టడం ఎలా సాధ్యపడుతుందని ప్రతిపక్షాలు, మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాక, నిబంధనల ప్రకారం పోలీసులు అతని చేతి మీదో, కాలి మీదో కాల్చవలసి ఉండగా గుండె మీద ఎలా కాల్పులు జరుపుతారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇవి న్యాయబద్ధమైన ప్రశ్నలేననడంలో సందేహం లేదు.
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారనడానికి కారణాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కొద్ది వారాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అత్యాచార నిందితుడిని పట్టపగలు కాల్చి చంపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాక, ఆ ఇద్దరు బాలికలు చదువుకుంటున్న పాఠశాల యాజమాన్యానికి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందు వల్ల యాజమాన్యానికి మేలు చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎన్ కౌంటర్ చేయించిందనే అభిప్రాయం కూడా వినవస్తోంది. పాఠశాలలో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికల మీద అత్యాచారం జరగడంతో ప్రభుత్వ తీరుతెన్నుల మీద ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పోలీసులు ఈ తక్షణ న్యాయానికి ఒడిగట్టడం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు పాఠశాల యాజమాన్యానికి, మరోవైపు పోలీసులకు ప్రతిష్ఠను పెంచినట్టు కనిపిస్తోంది.
ఈ హత్యను శివసేన నాయకులు గట్టిగా సమర్థించారు. పోలీసుల కట్టుకథకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. అత్యాచారం జరిగినట్టు వార్తలు బయటికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్థులకు రక్షణగా ప్రతిపక్షాలు కూటమి కట్టినట్టు కనిపిస్తోందని బీజేపీ కూడా వ్యాఖ్యానించింది. నిందితుడిపై కనీస విచారణ జరపకుండా, ప్రభుత్వం, పాలక పక్షం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం, అతన్ని కాల్చి చంపడం ఎంత వరకూ సమంజసం? పోలీసులు కూడా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని తక్షణ న్యాయం కలిగించడం ఏ మాత్రం న్యాయబద్ధం, చట్టబద్ధం కాదు. రాజ్యాంగం, చట్టాలు అమలులో ఉన్న దేశంలో కనీస విచారణ జరపకుండా, న్యాయపరమైన ప్రక్రియను అనుసరించకుండా తక్షణ శిక్షలు వేయడం ఏమాత్రం ఆరోగ్యకరం, శ్రేయస్కరం కాదు.
తక్షణ న్యాయం, తక్షణ శిక్షలు అనేవి దేశంలో న్యాయ వ్యవస్థ, చట్టాలు కుప్పకూలిపోయాయనడానికి నిదర్శనం. నిందితులు ఎటువంటి ఘాతుకానికి పాల్పడినప్పటికీ, శిక్ష పడే ముందు వారు పూర్తి స్థాయి న్యాయ ప్రక్రియకు అర్హులు. తక్షణ న్యాయానికి, తక్షణ శిక్షలకు మద్దతునిచ్చే పక్షంలో మనలో మానవత్వం నశించిపోయిందని, మనం పౌరులమే కాదని, ఈ సమాజంలో ఉండడానికి మనకు అర్హత లేదని అర్థం. గతంలో సుప్రీం కోర్టు ఇటువంటి తక్షణ శిక్షలను సూమోటో కేసులుగా తీసుకుని విచారించేది. థానే కేసుపై సమగ్ర దర్యాప్తు జరపడానికి సుప్రీం కోర్టు లేదా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల చట్టాలను, న్యాయాన్ని, మానవత్వాన్ని కాపాడిన ట్టవుతుంది. నిర్దోషులని రుజువయ్యే వరకూ పోలీసులు కూడా నిందితులే అవుతారు.
Badlapur encounter: తక్షణ న్యాయం న్యాయబద్ధమేనా?
బూటకపు ఎన్ కౌంటర్ ఈ సాక్ష్యాలే నిదర్శనం..