Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Bathukamma: పూలను పూజించే అతిగొప్ప పండుగ బతుకమ్మ

Bathukamma: పూలను పూజించే అతిగొప్ప పండుగ బతుకమ్మ

పూలకే పూజ చేసే అరుదైన సంప్రదాయం

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా పూలను పూజించరు. అయితే ఒక్క తెలంగాణలోనూ పూలను పూజించే గొప్ప సంస్కృతి కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ జరుపుకునే తొమ్మిది రోజులూ తెలంగాణలోని ప్రతి పల్లె పాటలతో హోరెత్తుతుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే సంబురాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.
సహజంగా ఏ పండగలోనైనా దేవుడు లేదా దేవతను పూజించడానికి పూలను ఉపయోగిస్తుంటారు. అంతకు మించి పూలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు. అయితే అలాంటి పూలనే పూజించే వినూత్న పండుగే… బతుకమ్మ. ప్రపంచ చరిత్రలో పూలను దేవతల సమానంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపి స్తుంది. అదే తెలంగాణ సంస్కృతి గొప్పదనం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణలో జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతారు. చోళుల కాలంలో బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయంటారు చరిత్రకారులు. అసలు బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో చెప్పడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బృహదమ్మ అనే పదం నుంచి బతుకమ్మ అనే పేరు వచ్చింటారు చరిత్ర కారులు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూల ను నీటిలో వదులుతారు.
తొమ్మిదిరోజుల పాటు తొమ్మిదిరకాల నైవేద్యాలు
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజాన్ని పలకరిస్తుంది. భూమితో, నీటి వనరులతో పెన వేసుకున్న మానవ అనుబంధాన్ని బతుకమ్మ సంబురంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు జరిగే సంబురాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహిస్తారు. మహా అమవాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. ఇదొక ఆనవాయితీ. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ సంబురాలు చేస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను చేసుకుంటారు. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాల్గవ రోజు నానే బియ్యం బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఐదోరోజు అట్ల బతుకమ్మ ఉంటుంది. అట్లు లేదా దోశను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవరోజు అలిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏడవరోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. వెన్నముద్దల బతుకమ్మకు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారు. ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఇక పూల సేకరణ విషయం కూడా ఆషామాషీ విషయం కాదు. తంగేడు పూలు, గునుగు పూలను బతుకమ్మలను పేర్చడానికి మహిళలు ఉపయోగిస్తుంటారు. పవిత్ర మనసుతో, భక్తిభావంతో పూలను సేకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు. అంచెలంచెలుగా అన్నీ సమానంగా ఉండేలా బతుకమ్మలో పూలను చాలా శ్రద్ధతో పేర్చుతారు.
తెలంగాణ ఉద్యమానికి ఊతంగా బతుకమ్మ పండుగ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమంతోనే బతుకమ్మ సంబురాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ కూడా కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ మహిళలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో సెటిలైన తెలంగాణ బిడ్డలు ప్రతి ఏడాది అక్కడ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతారు. ఏమైనా తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సంతకం బతుకమ్మ పండుగ.
-ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌,
సీనియర్‌ జర్నలిస్ట్‌,

- Advertisement -

63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News