Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Bhartṛhari: అరుదైన నీతి సాహిత్యం

Bhartṛhari: అరుదైన నీతి సాహిత్యం

సాహిత్యంలో నీతి శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేమన శతకం, సుమతీ శతకం వంటి అరుదైన నీతి శతకాలే కాకుండా, చాణక్య నీతి, భర్తృహరి నీతి వంటి పుస్తకాలు కూడా కేవలం సాహిత్యాన్నే కాక, సమాజాన్ని కూడా చక్కని మలుపు తిప్పాయి. క్రీస్తుశకం 553వ సంవత్సరానికి చెందిన భర్తృహరి రాసిన నీతి శతకాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావం చేశాయి. అవి సంస్కృతంలో ఉన్నప్పటికీ అవి ఆ రోజుల్లో అతి ప్రధానమైన పాఠ్యాంశాలుగా ఉండి, సమాజంలో విలువలు, ప్రమాణాలను కొత్త పుంతలు తొక్కించాయి. రెండే రెండు నీతి శతకాలు రాసినప్పటికీ అవి భర్తృహరి సుభాషితాలుగా ప్రసిద్ధి చెందాయి. వేమన లాగానే ఆయన కూడా సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ సుభాషితాలను రాయడం జరిగింది. పరిశీలన, పరిశోధన, అనుభవం, అధ్యయనం వంటివి తనకు ఈ గ్రంథాలు రాయడానికి తోడ్పడ్డాయని ఆయన చెప్పుకున్నారు. అప్పట్లో ఉజ్జయిని రాజుగా ఉన్న భర్తృహరి ఆ తర్వాత రాజర్షిగా ప్రసిద్ధులయ్యారు. ఒక బాధ్యతగల పౌరునిగా, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా, రాజుగా, ప్రజలుగా మనుషులు పోషించే ప్రతి పాత్రా ఆయన నీతి శతకాల్లో కనిపిస్తుంది. సమాజ పురోగతికే కాక, ఆధ్యాత్మిక పురోగతికి కూడా వ్యక్తులు నడుచుకోవాల్సిన తీరు తెన్నుల గురించి ఆయన పద్య రూపంలో నీతి నియమాలను తెలియజేశారు.
ఈ రెండు నీతి శతకాలతో పాటు ఆయన ’పింగళ’ అనే శృంగార గ్రంథాన్ని కూడా రాశారు. అది వాత్స్యాన కామ సూత్రాలను తలదన్నే గ్రంథం. కేవలం శృంగార రసం గురించే కాక, స్త్రీలతో వ్యవహరించే తీరును, వారిని గౌరవించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఆ గ్రంథంలో అద్భుతంగా వివరించారు. ఈ నీతి శతకాలనే కాక, ’పింగళ’ గ్రంథాన్ని రాయడానికి కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఒకసారి ఆయన మారు వేషంలో తన రాజ్యంలో సంచరిస్తుండగా, ఒక మహిళ సతీసహగమనం చేయడం చూ శారు. భర్త పోవడంతో తాను బతికి ఉండడం వృథా అని ఆ మహిళ సతీ సహగమనం చేసిందని ఆయన ఆరా తీయగా తెలిసింది. తన భార్య సీతకు కూడా తన మీద అంతటి ప్రేమ ఉందా అని తెలుసుకో వాలనుకున్నాడు భర్తృహరి. వారిది అన్యోన్య దాంపత్యం. ఆమెకు భర్తృహరి మీద వల్లమాలిన ప్రేమ. తాను అడవిలో వేటలో మునిగి ఉండగా అడవి జంతువులు దాడి చేసి, చంపేశాయని అంతఃపురానికి కబురు పంపాడు. అది విని ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. అప్పటి నుంచి భర్తృహరి విషాదంలో కూరుకుపోయారు. రాజ్యానికి సంబంధించిన బాధ్యతలను కూడా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పింగళ అనే మహిళతో ఆయనకు అనుకోకుండా వివాహం అయింది. అప్పటి నుంచి ఆయనలో కొద్దిగా మార్పు వచ్చి, రాజ్యానికి సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించడం మొదలుపెట్టాడు. అయితే, పింగళ అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. ఆమెను సంప్రదించనిదే ఆయన ఏ పనీ చేసేవాడు కాదు. రాను రాను ఆమె ప్రాధాన్యం పెరిగి పోయింది. ఆమె కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. భర్తృహరిలో ఎటువంటి మార్పూ రాలేదు కానీ, పింగళలో మాత్రం బాగా మార్పు వచ్చింది. ఆమె విలాస జీవితానికి కూడా అలవాటు పడింది. తన అంగరక్షకుడితోనే సంబంధం పెట్టుకునేంత వరకూ వెళ్లింది. భర్తృహరి తమ్ముడు విక్రమాదిత్యుడు ఈ సంగతి గమనించాడు. విక్రమాదిత్యుడు తన అన్నకు నమ్మిన బంటు. అన్నకు తెలియకుండా ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో అతను ఆ అంగరక్షకుడిని దూర ప్రాంతానికి బదిలీ చేయించాడు.
జీవితానుభవాల సారం
పింగళ అప్పటి నుంచి విక్రమాదిత్యుడి మీద పగ పెంచుకుని, భర్తృహరికి అతని మీద చాడీలు చెప్పి, అతన్ని రాజ్య వ్యవహారాలకు దూరం పెట్టేటట్టు చేసింది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించేటట్టు కూడా చేసింది. కొద్ది రోజులకు ఒక సాధువు భర్తృహరి దర్బారుకు వచ్చి ఆయనకు ఒక పండు కానుకగా ఇచ్చాడు. ఆ పండు కాళీమాత వరప్రసాదమని, దీనిని తిన్నవారికి దీర్ఘాయుర్దాయంతో పాటు, దీర్ఘకాలం పాటు శృంగార జీవితం కూడా కొనసాగుతుందని చెప్పాడు. భర్తృహరి ఆ పండును ఆనందంగా తీసుకుని తన భార్య పింగళకు ఇచ్చాడు. పింగళ ఆ పండును తన అంగరక్షకుడికి బహూకరించింది. ఆ అంగ రక్షకుడికి ఒకామెతో సంబంధం ఉంది. అతను ఆ పండును తన ప్రేయసికి ఇచ్చాడు. ఆమె ఈ పండు రాజు తింటే మంచిదని చెప్పి భర్తృహరికి ఇచ్చింది. భర్తృహరికి ఆశ్చర్యం వేసింది. ఇది తాను పింగళకు ఇచ్చిన పండేనని ఆయనకు అర్థమైంది. ఆయన ఆరా తీయగా అసలు విషయం కళ్లకు కట్టింది. ఆయన ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. అయితే, ఆయన అప్పటి నుంచి పింగళ విషయంలో జాగ్రత్తగా ఉండడం ప్రారంభించారు. విక్రమాదిత్యుడిని పిలిపించి మళ్లీ పూర్వపు బాధ్యతలు అప్పగించా రు. ఈ అనుభవంతో ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టింది.
ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఆయన నీతి శతకాలు రాయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ’పింగళ’ పేరుతో ఒక శృంగార శాస్త్ర సంబంధమైన గ్రంథం కూడా రాశాడు. ఆయన రాసిన ఒక నీతి పద్యాన్ని వింటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. ఈ పద్యాన్ని చాలా మందివినే ఉంటారు. ఆ పద్యంలోని ఒకటి రెండు వాక్యాలు ఇలా ఉన్నాయి: న స్నానం న విలేపనం న కుసుమం…. వాగ్భూషణం భూషణం. ‘స్నానం వల్ల, లేపనాల వల్ల, పువ్వులతో అలంకరించుకోవడం వల్ల ఉప యోగం లేదు. నోటి మాట మంచిగా ఉంటేనే సమాజపరంగానూ, వ్యక్తిగతంగానూ మంచి జరుగుతుంది. నోటి మాటే పెద్ద అలంకారం‘ అనేది ఆ పద్య సారాంశం. ఈ పుస్తకాలను వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ కంపెనీ వాళ్లు ప్రచురించారు. వీటిని తెలుగులోకి కూడా అనువదించారు. ఒక్క తెలుగ భాషలోకే కాదు, భారతీయ భాషలన్నిటిలోకీ అనువాదం అయ్యాయి.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News