Saturday, July 27, 2024
Homeఫీచర్స్Eco friendly: మట్టితో భవనాలు కట్టేస్తోందామె

Eco friendly: మట్టితో భవనాలు కట్టేస్తోందామె

ఇక్కడ కనిపిస్తున్న ఇళ్లు ఎంతో బాగున్నాయి కదూ. ఇవి మట్టితో కట్టినవి. ఎకో ఫ్రెండ్లీ అయిన వీటిపై చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని పోగొడుతున్నారు బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్ శరణ్యా అయ్యర్. స్టూడియో వెర్జ్ ఎంటర్ ప్రైజ్ పేరుతో నిర్మాణసంస్థ ప్రారంభించి మట్టి ఇళ్ల నిర్మాణానికి శరణ్య పూనుకున్నారు. ఆ విశేషాలు..

- Advertisement -

ఎర్త్ ఫ్రెండ్లీ పద్ధతుల్లో మట్టితో భవనాలు నిర్మిస్తారు శరణ్యా అయ్యర్. ఆమె కట్టే మట్టి ఇళ్లల్లో సమకాలీన సౌకర్యాలన్నీ ఉంటాయి. అంతేకాదు అవి పర్యావరణహితంగా ఉండడం ఆమె మరో ప్రత్యేకత. ఆమె నిర్మించే మట్టి భవనాల్లో నిత్య జీవనశైలికి అవసరమయ్యే అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి. ఈస్థటిక్ విలువలను సైతం అవి ప్రతిఫలిస్తాయి. స్టూడియో వెర్జ్ ఎంటర్ ప్రైజ్ ను శరణ్య 2013లో ప్రారంభించారు. గత దశాబ్దకాలంలో కర్నాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడులలో ఇలాంటి ప్రాజక్టులను 50 వరకూ చేపట్టారు. వీటిల్లో 25 శాతం మట్టితో నిర్మించిన నిర్మాణాలే.

శరణ్యా చేసిన ప్రాజక్టుల్లో 75 శాతం సుస్థిర నిర్మాణ పద్ధతులతో నిర్మించినవే. ఇటీవల కనీసం ప్రతి ఏడు మందిలో ఐదుగురు మట్టితో కట్టే నిర్మాణాల గురించి ఆరా తీస్తున్నారని శరణ్య తెలిపారు. మట్టితో ఆమె నిర్మించిన భవనాలలో ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు అపార్టుమెంటులు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పాఠశాలలు, లర్నింగ్ సెంటర్లను కూడా ఆమె మట్టితో నిర్మించి ఇఛ్చారు

మట్టి ఇళ్ల నిర్మాణాల గురించి చాలామందిలో అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల మట్టి గోడలు కొట్టుకుపోతాయి. ఇళ్లు దెబ్బతింటాయనే అభిప్రాయం పలువురిలో ఉందంటారామె. పైగా మట్టి ఇళ్లంటే బాగా సంప్రదాయంగా ఉండే ఇళ్లనే దురభిప్రాయం ఉందంటారామె. కానీ ఇవి ఎంతో సౌందర్యవంతంగా, పటిష్టంగా, సకల సదుపాయాలు ఉండేలా , సులువుగా బాగోగులు చేసుకునేలా నిర్మించుకోవచ్చంటారు. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివేటప్పుడు మట్టితో నిర్మాణాలు చేపట్టే ఆలోచన శరణ్యకు వచ్చింది. కుటుంబ మిత్రులు ఒకరు స్వయం సహాయక బ్రుంద సభ్యులకు ఒక మీటింగ్ స్పేస్ కట్టాలని శరణ్యను అడిగారు.

అది నిర్మించాల్సిన ప్రదేశం తెలంగాణాలోని జహీరాబాద్ లో ఉంది. అందుకోసం శరణ్య స్థానికంగా రీసెర్చ్ చేస్తే అక్కడ లాటెరేట్ అనే స్టోన్ దొరుకుతుందని తెలిసింది. ‘ఆ స్టోన్ తోనే నా తొలి కట్టడాన్ని నిర్మించాను. అలా పర్యావరణహితమైన నా మట్టి ఇళ్ల నిర్మాణాల ప్రయాణం మొదలైంది. ఆ అనుభవం వల్ల స్థానికంగా దొరికే మెటీరియల్, నాలెడ్జ్, నైపుణ్యాలతోనే నిర్మాణరంగంలో సస్టైనబుల్ సొల్యూషన్స్ సాధ్యమవుతాయనే విషయం నాకు అర్థమైంది’ అని శరణ్య చెప్పారు. పాండిచ్చేరిలోని ఆరోవిల్లిలో ఉన్న ఎర్త్ ఇనిస్టిట్యూట్ లో నెలరోజుల పాటు మట్టి నిర్మాణాలపై వర్కుషాపు జరిగింది. అందులో పాల్గొనే అవకాశం శరణ్యకు వచ్చింది. ఆ అనుభవం కూడా మట్టి నిర్మాణాల పట్ల ఆమెలో మరింత అవగాహనను కల్పించింది.

ప్రత్యామ్నాయ నిర్మాణ పద్ధతులను నేర్చుకునే ప్రయత్నంలో కేరళలోని కోస్ట్ ఫోర్డులోని లారీ బేకర్ నిర్మాణశైలిని కూడా శరణ్య అధ్యయనం చేశారు. తర్వాత అమెరికాలోని సిన్సినాటీ విశ్వవిద్యాలయం నుంచి అర్బన్ డిజైన్ లో శరణ్య మాస్టర్స్ పట్టా తీసుకున్నారు. అక్కడే నాలుగు సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ నిర్మాణరంగంలో ఆమె పనిచేశారు కూడా. కానీ అది ఆమె మనసుకు పడలేదు. ఆ పని ఆమెకు చాలా బోరుగా అనిపించింది. అమెరికాలో లీడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ తీసుకున్నారు. మనదేశంలో గ్రుహ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత కొంతమందికి

ప్రాజక్టులు చేశారు కానీ అవి ఆమెకు సంత్రుప్తినివ్వలేదు. విలక్షణమైన పని ఏదైనా చేపట్టాలని ఆమె అనుకున్నారు. సింగిల్ మదర్ అయిన శరణ్య స్టూడియో వెర్జ్ కు శ్రీకారం చుట్టారు. అలా ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్టుగా మొదలైన తన ప్రయాణం దశాబ్దకాలం పాటు నిరాటంకంగా కొనసాగుతుందని తను అస్సలు ఊహించలేదని కూడా అంటారామె. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, కర్నాటక పర్యాటక శాఖ వంటి పేరున్న క్లయింట్లకు శరణ్య ప్రాజక్టులు చేశారు. ఎర్త్ బిల్డింగుల నిర్మాణానికి శరణ్య మూడు పద్ధతులను అనుసరించారు. అవే కోబ్, రామ్డ్ ఎర్త్, మడ్ బ్లాక్స్. సిమెంటు, సున్నం రెండింటినీ చేర్చడం వల్ల మట్టి నిర్మాణాలు పటిష్టంగా ఉంటాయని శరణ్య తెలిపారు. ద్రుఢమైన మట్టి గోడలు కట్టడానికి కోబ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎర్త్ బిల్డింగులు డిజైన్ చేసేటప్పుడు నీరు, ఎనర్జీ కన్సర్వేషన్ ను కూడా ప్లాన్ చేస్తామని శరణ్య చెప్పారు. అంతేకాదు పాసివ్ ( కిటికీలు, సహజకాంతి, షేడింగ్ వంటివి) మరియు యాక్టివ్ ( సోలార్ ఎనర్జీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) పద్ధతులను కూడా అనుసరిస్తామని తెలిపారు. మట్టి ఇళ్ల వల్ల ఎయిర్ కండిషనింగ్, హీటర్ల వంటివి అవసరం ఉండదు. వీటిని డిజైన్ చేసేటప్పుడు క్రాస్ వెంటిలేషన్ తో పాటు గ్లేర్ ఫ్రీ నేచురల్ లైటింగ్ ఉండేలా చూస్తామని శరణ్య తెలిపారు. వాడే మెటీరియల్ సైతం పర్యావరణ హితంగా ఉండేలా చూస్తామని శరణ్య వివరించారు. వేడిని గ్రహించే గోడలు, ఇంట్లోకి చల్లటి గాలి వచ్చేలా ఇళ్లు డిజైనింగ్ చేస్తామని అన్నారు.

స్థానికంగా దొరికే మెటీరియల్ తో, సంప్రదాయ విధానాలతో ఆ ప్రాంత వాతావరణానికి, పరిసరాలకు అనుగుణంగా నిర్మాణం కొనసాగిస్తామని శరణ్య చెప్పారు. స్థానికంగా దొరికే మెటీరియల్ తో నిర్మించడం వల్ల వాతావరణ కాలుష్యం బారిన పడమని శరణ్య చెప్పుకొచ్చారు. ‘ ఈ పద్ధతిలో కట్టడం వల్ల చుట్టూ పచ్చదనంతో, సహజ వెలుతురుతో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుందం’ టారామె. అయితే కన్వెన్షనల్ నిర్మాణాల కన్నా ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలకు లేబర్ ఖర్చులు, క్రాఫ్ట్స్ మాన్ షిప్ ఎక్కువ అవసరమవుతాయని ఆమె వెల్లడించారు. ‘మట్టి భవనాలకు మెయిన్ టెనెన్స్ ఖర్చు బాగా ఉండడం ఒక ఇబ్బంది. మరొకటేమిటంటే వీటికి తరచూ టర్మైట్ ట్రీట్మెంట్, రీప్లాస్టరింగ్ లను చేయిస్తుండాలి. అలాగే రూములు కూడా ఒక మేర ఎత్తు, పరిమాణంలోనే కట్టాల్సి ఉంటుంది. మట్టిని భద్రం చేయడానికి, ఇటుకలు తయారుచేయడానికి ఎక్కువ ప్రదేశం అవసరం అవుతుంది. మట్టితో కట్టే గోడలు మందంగా ఉండడంతో స్పేస్ ఎక్కువగా పడుతుంది కూడా. అయితే నూటికి నూరు శాతం మట్టితో ఇళ్లను నిర్మించకుండా ఉంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు’అని తెలిపారు. ‘స్టూడియో వెర్జ్’ సెమీ రూరల్, పూర్తి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రాజక్టులు చేపట్టింది. తను చేపట్టి నిర్వహిస్తున్న ఎకోఫ్రెండ్లీ మట్టి భవనాల నిర్మాణాల తీరుతెన్నుల గురించి బెంగళూరులోని రెండు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో విద్యార్థులకు శరణ్య బోధిస్తున్నారు కూడా. అంతేకాదు వీటిపై పిల్లలకు అవగాహనా వర్కుషాపులను సైతం ఆమె నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని ప్రక్రుతి ప్రేమికులతో కలిసి ఎర్త్ బిల్డింగుల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించే ఆలోచనలో కూడా శరణ్య ఉన్నారు. ఆమె చేపట్టి నిర్మిస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు పర్యావరణ స్ప్రుహతో పాటు ప్రజలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా పెంచుతాయనడంలో సందేహం లేదు…

శరణ్య తమిళనాడులోని తిరువదైమదూర్ గ్రామంలోఉన్న తన అమ్మమ్మగారింట పెరిగింది. వాళ్లది పూర్తిగా మట్టితో కట్టిన ఇల్లు. చుట్టూ పచ్చని వాతావరణంతో పాటు ఆ ఊళ్లో ప్రజలది నిరాడంబరమైన జీవనశైలి. పర్యావరణ స్ఫూర్తితో కూడిన అలాంటి వాతావరణంలో శరణ్య బాల్యం గడిచింది. ఆ స్ఫూర్తే శరణ్యను ఎకోఫ్రెండ్లీ నిర్మాణాల వైపు ప్రయాణించేట్టు చేసింది. అలా మట్టితో , మట్టి రాయితో, మట్టితో చేసిన ఇటుకలతో ఎకోఫ్రెండ్లీ ఇళ్లు కట్టడానికి శరణ్య పూనుకుంది. స్థానికంగా దొరికే మెటీరియల్ ఇచ్చిన స్ఫూర్తితో తన నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. స్థానికంగా దొరికే వాటితో సమకాలీన అవసరాలకు తగ్గట్టు అద్భుతంగా ఇళ్లు కట్టుకోవచ్చని , ఈ విషయంలో ప్రజల మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఎంతో ఉందని శరణ్య అంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News