Thursday, April 18, 2024
Homeఓపన్ పేజ్BJP 2024 strategy: ఎన్నికల పోరుకు ‍బీజేపీ సిద్ధం

BJP 2024 strategy: ఎన్నికల పోరుకు ‍బీజేపీ సిద్ధం

ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా టార్గెట్ 370

ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశాలతో ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వ్యూహం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 303 స్థానాలు గెలుచుకున్న తమ పార్టీ ఈసారి ఎన్నికల్లో 370 స్థానాలలో విజయం మీద దృష్టి పెట్టాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము రద్దు చేసిన ఆర్టికల్ 370కి ప్రతీకాత్మకంగానే ఆయన ఈ 370 లక్ష్యాన్ని మనసులో పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి తగ్గట్టుగానే ఆయన ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక హోదానిచ్చిన ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలనేది మొదటి నుంచి బీజేపీ లక్ష్యమనే సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఇవే అంశాలు పార్టీని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మరో లక్ష్యం కూడా ఉందని, అది దేశానికి మరింత ముఖ్యమైందని మోదీ ఈ సమావేశాల సందర్భంగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కనీసం 370 ఎక్కువగా పడే పక్షంలో తమ ఓట్ల వాటా 50 శాతాన్ని దాటుతుందని కూడా బీజేపీ ఆలోచిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో పార్టీ చిహ్నమే ముఖ్యమని, అభ్యర్థుల గురించి పట్టించుకోనవసరం లేదని మోదీ చెబుతున్నారు. ప్రస్తుత బీజేపీ ఎంపీల స్థానంలోనే అత్యధిక సంఖ్యలో కొత్తవారికి అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో మోదీయే ప్రధాన కేంద్రంగా, మోదీయే ప్రధాన ప్రచార సారథిగా ఈ సమావేశాల్లో ఇప్పటికే ఎన్నికల వ్యూహం రూపుదిద్దుకుంది. తాము ఇంత వరకూ చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంలో ముందుకు తీసుకురావడంతో పాటు, మోదీ నాయకత్వం గురించి ప్రధానంగా ప్రజలకు చెప్పడమే ధ్యేయంగా ప్రచారం కొనసాగించాలని కూడా వ్యూహం రూపుదిద్దుకుంది.
తమ సంస్థాగత ఇంజిన్ ను పూర్తి వేగంతో సర్వసన్నద్ధం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులను తమ వైపు తిప్పుకోవడం, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదర్చుకోవడం కూడా పార్టీ వ్యూహంగా భాగంగా మారింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆద్యంతం పేట్రేగిపోయిన అవినీతి గురించి, ఆ పార్టీలోని కుటుంబ పాలన గురించి హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, విమర్శలు సాగించడం మొదలుపెట్టారు.

బీజేపీ గత పదేళ్ల పాలనా కాలంలో ఎంత బాధ్యతాయుతంగా, ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించిందీ, ఎంత సమర్థవంతమైన పాలన అందించిందీ, ప్రచారం చేయబోతోందో వివరించబోతోంది. మోదీ హయంలో దేశం అంతర్జాతీయంగా ఏ స్థాయికి వెళ్లిందీ, దేశ ఆర్థిక వ్యవస్థ అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని ఏ స్థాయికి చేరుకుందీ అది గణాంకాలతో సహా వివరించబోతోంది. వీటన్నిటితో పాటు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హిందుత్వ వాద పురోగతి గురించి కూడా అడపాదడపా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక తీర్మానాన్ని బట్టి చూస్తే, అయోధ్య రామ మందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్య స్థాపనకు అవకాశం ఏర్పడిందనే ఆ పార్టీ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను అవకాశంగా తీసుకుని దేశంలోని హిందువులందరినీ సంఘటితం చేయాలని కూడా బీజేపీ భావిస్తోంది. దేశం మోదీ హయాంలో సాధించిన అభివృద్ధిని, పురోగతిని ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క రామాలయ నిర్మాణాన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీ అన్ని విధాలుగానూ దూకుడుగా వ్యవహరించే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News