తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసిన తీరు చూస్తే, ఆ పార్టీ ఎంత వ్యూహాత్మకంగా, ఎంత దూరదృష్టితో, ఎంత నిగూఢంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా జాట్ నాయకుడు సునీల్ జాఖ్‌డ్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సునీల్ జాఖ్‌డ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఈ చట్టాల వల్ల తమకు దూరమైన జాట్లకు మళ్లీ సన్నిహితం కావడానికే బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. గిరిజన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన బాబూలాల్ మరాండిని జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం జరిగింది. ఈ గిరిజన రాష్ట్రంలో గిరిజనేతరుడైన రఘువర్ దాస్ ను అధ్యక్షుడిగా నియమించి బీజేపీ ఇదివరకు చేతులు కాల్చుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షులను నియమించిన తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో విజయాలు అందిస్తున్న బండి సంజయ్‌కుమార్ స్థానంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని నియమించడం ఊహించని వ్యవహారమే. ఇది సాహసోపేత నిర్ణయమే అనిపిస్తుంది. బండి సంజయ్ ఈ రాష్ట్రంలో పార్టీకి జవజీవాలు అందించారు. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఘన విజయాలు సాధించడం జరిగింది. వెనుకబడిన వర్గాలనాయకుడైన సంజయ్ హిందుత్వకు మారుపేరుగా గుర్తింపు పొందారు. అయితే, ఆయన ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకుల కారణంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో అధినాయకత్వం కిషన్ రెడ్డి మీద ఆధారపడడం జరిగింది. కిషన్ రెడ్డి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు.
అప్పట్లో కిషన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమైనవి. ప్రస్తుతం ఆయన రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఘన విజయాల వైపు తీసుకు వెళ్లాల్సి ఉంది. లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అయితే, బీజేపీ వ్యూహమేమిటన్నది మాత్రం అంతుబట్టడం లేదు. ఒకవేళ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వలసలు జరగకూడదని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా, బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా ప్రకటించిన పేరు మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరిదే. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పట్ల విశ్వసనీయత పెంచగలిగిన నాయకురాలు పురంధేశ్వరేననడంలో సందేహం లేదు. అయితే, ఇది ఒక కోణం మాత్రమే. ఆమె తండ్రి నుంచి అధికారాన్ని లాక్కున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పురంధేశ్వరిని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా పక్కన పెట్టేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడుకు, ఆమెకు మధ్య సత్సంబంధాలు లేవనే విషయం జగద్విదితం.
చంద్రబాబు నాయుడు చేతుల్లో అవమానం పాలై, సొంతగా పార్టీ పెడదామనుకున్న నందమూరి హరికృష్ణకు పురంధేశ్వరి ఒకప్పుడు మద్దతునిద్దామని కూడా భావించారు. రాష్ట్రంలో అతి శక్తివంతం అయిన సంపన్న కమ్మ కులస్థులను ఆమె కూడగట్టగలరనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి ఈ కులమే పెద్ద అండ. ఆమె తన అపార రాజకీయానుభవంతో ఈ పని సాధించగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అంతేకాదు, ఆమె తన తండ్రి స్థాపించిన పార్టీకి తానే అసలైన వారసురాలినని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆమెకు అత్యంత సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ తో ఇటీవల హోం మంత్రి అమిత్ షా సమావేశం కావడాన్ని బట్టి ఆమె నియామకం ఎందుకు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పొత్తు విషయం ఎలా ఉన్నప్పటికీ ఆమె తప్పకుండా చంద్రబాబు నాయుడును దెబ్బతీసే అవకాశం మాత్రం ఉంది.