Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్BJP Prez: బీజేపీ బాస్ గా కొనసాగనున్న నద్దా, నెక్ట్స్ ధర్మేంద్ర ప్రధాన్ కు ఛాన్స్

BJP Prez: బీజేపీ బాస్ గా కొనసాగనున్న నద్దా, నెక్ట్స్ ధర్మేంద్ర ప్రధాన్ కు ఛాన్స్

ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సరైన కొత్త వ్యక్తి ఎవరా అనే చర్చ ఆసక్తికరంగా ఉంది. ఇటు పార్టీలో అటు పార్టీ బయట కూడా ఈ చర్చ గత కొన్ని నెలలుగా సాగుతున్నా దీనిపై మోడీ-షా చేస్తున్న కసరత్తు మాత్రం కొలిక్కి రావటం లేదు. పైగా ఏరకంగా చూసినా జగత్ ప్రకాష్ నద్దానే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించేలా మోడీ-షా ద్వయం మొగ్గుచూపుతోంది. ఇది మరింత ఆసక్తికరమైన విషయమే.

- Advertisement -

జనవరి 2023లో నద్దా అధ్యక్ష పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా ఎవరినైనా ఎంపిక చేసుకుందామన్న ప్రక్రియ ఎటూ తేలటం లేదు. దీంతో నద్దానే మరోసారి పార్టీ బాధ్యతలు తీసుకునే ఛాన్సులు వంద శాతం ఉన్నాయని బీజేపీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. మోడీ, షాల ఆంతరంగికుడిగా, వారిద్దరి విశ్వాసం చూరగొన్న క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నద్దాకు ఇమేజ్ ఉంది. మోడీ, షాల మాట మీరని వ్యక్తిగా అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయన మూడేళ్లుగా తన పదవిని నిర్వహిస్తున్నారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో మరోమారు పార్టీని అధికారంలోకి తేలేకపోయారనే అపప్రథతోపాటు సొంత రాష్ట్రంలో పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులను నద్దా సముదాయించలేకపోయారనే ఆరోపణలున్నా ఇవేమంత పెద్ద విషయంగా పార్టీ పెద్దలు భావించటం లేదు. అటు సంఘ్ పరివార్ కూడా నద్దాపై ఎటువంటి ఫిర్యాదులు చేయటం లేదు దీంతో నద్దా ఈ పదవిలో ప్రశాంతంగా పాతుకుపోయారనే చెప్పాలి.

పార్టీ అధ్యక్షులు ఎవరైనా మోడీ చెరిష్మానే ప్రధానంగా పార్టీ పనిచేస్తుంది. ఇక పార్టీ వ్యవహారాలను తెర వెనుక ఉండి చక్కబెట్టేది మాత్రం అమిత్ షానే అనే ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిలో ఎవరు కూర్చున్నా వ్యవహారం నడిపించేది మాత్రం ప్రధాని మోడి, హోం మంత్రి అమిత్ షానే అన్నది ఓపన్ సీక్రెట్.

దీంతో 2024లో జరిగే జనరల్ ఎలక్షన్స్ కు బీజేపీ సారథిగా నద్దా కొనసాగించటం దాదాపు ఖాయంగానే ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో జనవరిలో జరిగే పార్టీ కీలక భేటీలో ఈమేరకు ఫార్మాలిటీలు పూర్తి చేసే పనిలో పార్టీ కార్యాలయం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నద్దా కొనసాగుతున్నట్టు ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి అన్నట్టు వ్యవహారం ఉంది. నద్దా స్థానంలో వేరేవారిని నియమించే అవకాశాలుంటే ఈపాటికి అంతర్గంతా పార్టీలో జరగాల్సిన ఎన్నికలు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో పూర్తయి ఉండాల్సింది. అప్పుడే వచ్చే ఏడాది తొలి భాగంలో మిగతా తంతు పూర్తై నద్దా స్థానంలో మరొకరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాసెస్ ఏమీ ఇంకా ప్రారంభమే కాలేదు కాబట్టి నద్దాను కొనసాగించటం ఖాయంగా మారింది.

బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం కాస్త సుదీర్ఘమైంది. ఈ ప్రక్రియ ఇంకా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మరోవైపు జనవరితో ఆయన అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయననే మరోమారు అధ్యక్షుడిగా కొనసాగిస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. త్వరలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ భేటీ వచ్చే నెల జరిగే అవకాశాలున్నాయి. పైగా ఇవి ఢిల్లీలోనే జరగచ్చుకూడా. ఈ భేటీలోనే వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఘాటుగా చర్చోపచర్చలు సాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్టీ విధి విధానాలపై కూడా చర్చ సాగనుంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో పార్టీ ఆర్గనైజేషనల్ ఎన్నికలను వాయిదా వేయటాన్ని ప్రధాన అజెండాగా ఈ భేటీలో చర్చించే సూచనలున్నాయి. దీనర్థం జేపీ నద్దా చేతుల్లోనే పార్టీ పగ్గాలుంటాయని.

నద్దా స్థానాన్ని మరొకరితో భర్తీ చేసే అసలు ప్రక్రియ మాత్రం 2024 ఏప్రిల్-మేలో జరిగే లోక్ సభ ఎన్నికల తరువాతే ప్రారంభం కానుంది. నద్దా కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్నఅమిత్ షా నేతృత్వంలోనూ పార్టీ ఇదే వైఖరి, వ్యూహాన్ని అనుసరించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాకే, అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ స్థానంలో నద్దాను ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా నద్దాకు ఎక్స్టెన్షన్ ఇచ్చి సాధారణ ఎన్నికల తరువాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే సరిపోతుందనే యోచనలో పార్టీ పెద్దలున్నారు. పైగా అటు సంఘ్ పరివార్ తో అటు మోడీ-షాతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు నెరపుతూ ఉన్న నద్దా వంటి వారు పార్టీలో పెద్దగా మరొకరు కనిపించటం లేదు. వివాదాస్పదమైన వ్యక్తి కాకపోవటం, మిత భాషి కావటం, సీజన్డ్ పొలిటీషియన్ గా, ఆర్గనైజేషన్ లో కమిటెడ్ గా కష్టపడే తత్వమున్న వ్యక్తిగా ఈయనకు మంచి ఇమేజ్ ఉంది.

కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, మిజోరం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ముందు కొత్తగా ఎవరికి పార్టీ పగ్గాలు ఇచ్చినా వారు పార్టీ వ్యవహారాల నిర్వహణకు అలవాటు పడేందుకు ఎక్కువ సమయం కావాల్సి వస్తుంది. ఈనేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధతపై దాని దుష్ప్రభావం ఎక్కువగా పడుతుంది. పైగా ఏదో ఒక మ్యాజిక్ చేసి ఎలాగోలా హ్యాట్రిక్ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న మోడీ-షా ఇటు అసెంబ్లీ అటు లోక్సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలనే స్పష్టతతో చాలా దూకుడు చూపుతున్నారు. అందుకే నద్దానే కొనసాగిస్తే సరిపోతుందని కొన్ని నెలలపాటు నద్దా పార్టీ పదవీ కాలాన్ని కొనసాగించేలా వ్యూహాలు సాగుతున్నాయి.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఆతరువాత జూలై 2019లో అధికార పగ్గాలు చేపట్టిన నద్దా పదవీ కాలం 2023, జనవరి 20తో ముగియనుంది. నద్దా నేతృత్వంలో పార్టికి పెద్ద పరాజయాలు ఏమీ లేవు. చిన్నా చితకా అపజయాలు తప్ప పెద్దగా పార్టీ జయాపజయాలపై ఎలాంటి నెగటివ్ ప్రభావం పడకపోవటంతో నద్దాను కొనసాగించటమే అత్యుత్తమమైన నిర్ణయం అనేలా పార్టీ ట్రాక్ రికార్డ్ కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు మొదలు, బై పోల్స్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గరిష్ఠంగా విజయాలు సాధించేలా ఈ మూడేళ్ల పార్టీ ప్రయాణం సాగింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడిగా ఎవరికైనా రెండు సార్లు కొనసాగే అవకాశం ఉంది కూడా. అంటే ఆరేళ్లపాటు కంటిన్యూగా పార్టీ అధ్యక్ష పగ్గాలు నిర్వహించవచ్చు.

పార్టీ విజయాలపరంగా, సెంటిమెంట్ పరంగా మాట్లాడాలంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నద్దాలది మంచి టీముగా పేరుపడింది కూడా. సరే మరి నద్దా తరువాత ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది మరో ఆసక్తికరమైన విషయం. పాత తరం వారిని పక్కనపెట్టిన మోడీ ఈసారి ఆ ఛాన్స్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ధర్మేంద్ర ప్రధాన్ కు మీడియాలోనూ మంచి ప్రధాన్యతను దక్కేలా పార్టీ వేదికను తయారు చేసింది. పలు అంశాలపై ధర్మేంద్ర మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. భూపేంద్ర యాదవ్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే మంచి నెగోషియేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తిగా ధర్మేంద్రకు ఇమేజ్ ఉండటం ఆయనకు ఎక్కువ కలిసివచ్చేలా చేస్తోంది. విద్యార్థి దశ నుంచే అఖిల భారత విద్యార్థి పరిషద్ లో చురుకైన పాత్ర పోషించిన ధర్మేంద్ర ప్రధాన్ పలు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా పేరుగాంచారు. మంచి బేరసారాలు జరపటం, చెప్పాల్సినంత మాత్రమే ముక్కుసూటిగా చెప్పి ముగించే వ్యక్తిగా ఆయన పార్టీలో పాపులర్ అయ్యారు.

అరుణ్ జైట్లీ మరణంతో ఆయన స్థానంలోకి వచ్చారు ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పక తప్పదు. సో ఇప్పుడు బీజేపీలో ట్రబుల్ షూటర్ గా ధర్మేంద్రకు మంచి ప్రాధాన్యత దక్కుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో ఏమాత్రం అలజడి చెలరేగినా తేడాలు వచ్చినా తక్షణం ఆ పనిని ధర్మేంద్రకు అప్పగించి, పనయ్యేలా చేస్తుంటారు మోడీ. అందుకే అతి తక్కువ సమయంలో ఆయనకు ట్రబుల్ షూటర్ అనే హోదా వచ్చింది. మోడీ ఇచ్చిన అవకాశాన్ని అందుకుని, తన చాకచక్యాన్ని చూపించటంలో ధర్మేంద్ర ముందుంటారు.

భూపేంద్ర యాదవ్ తో పోల్చితే ధర్మేంద్ర ఈ రేసులో చాలా ముందున్నారు కూడా. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈమద్యనే వచ్చి చేరారు భూపేంద్ర యాదవ్. ఒరిస్సాకు చెందిన ధర్మేంద్రను బీజేపీ మనీ మ్యాన్ ఇన్ ఒరిస్సాగా పార్టీలో పిలుస్తుంటారు. రాష్ట్ర పార్టీ శాఖకు ఫండ్స్ తేవటంలో ఈయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. యూపీ ఎన్నికల్లోనూ పార్టీని విజయం దిశగా పయనింపచేయటంలో ప్రధాన్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే ఆయనకు యూపీ అసెంబ్లీ ఎన్నికల హీరోగా పార్టీలో మంచి క్రెడిట్ దక్కింది. ఉత్తర్ ప్రదేశ్ లో కల్యాణ్ సింగ్ హయాంలో ప్రమోద్ మహాజన్ చక్రం తిప్పితే, ఆతరువాత అమిత్ షా రాక కంటే ముందు అరుణ్ జైట్లీ పార్టీ వ్యవహారాలను బ్రహ్మాండంగా నడిపితే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆ పాత్రను పోషించే పనుల్లో తలమునకలై ఉన్నారు. మోడీ విజన్, షా గైడెన్స్ ను తూ.చ. తప్పకుండా పాటించే లాయల్ మినిస్టర్ గా ఈ కేంద్ర మంత్రికి మంచి పేరుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News