Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Book reading a great passion: వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

Book reading a great passion: వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

పుస్తక పఠనం అతి గొప్ప వ్యాపకం

పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్ని పెంచుతుంది. పుస్తకం సామాన్యుని ఆయుధం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ మాటలు నే టికి పుస్తక ప్రియుల చేవుల్లోమార్మోగుతూనే ఉంటాయి. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహానుభావుడు. ఎందరో మహానుభావులు పుస్తక పఠనం విశిష్టతను ప్రయోజనాలను తెలియచేశారు.
ఒంటరి తనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం. ‘పుస్తకం ఓ మంచి నేస్తం’. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. బాధపడే వారిని ఓదార్చుతుంది. అలసిన మనసులను సేదతీరుస్తుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా నేస్తంగా అన్నితరాలను అలరిస్తోంది. జీవితంలో విజ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడే సాధనం పుస్తకం. మనోవికాసానికి మార్గనిర్దేశానికి ‘గురువుగా‘ ఉపయోగపడుతుంది. పుస్తక ప్రచురణ ప్రారంభమయిన తర్వాత మానవ జీవన గమనంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉదయం టీ తాగితే వచ్చే హాయి పుస్తక పఠనంతో అంత హాయి వస్తుంది అంటారు పుస్తక ప్రియులు. పుస్తక ప్రియులకు అన్నిటినీ మరిపించే విజ్ఞాన, వినోద, వికాస భాండాగారం పుస్తకం. జీవితములో ఉన్నత స్థాయికి ఎదిగిన వారి విజయ రహస్యం పుస్తకం. వారు ఎదిగిన క్రమంలో అనుభవాలు ఎదురుకొన్న కష్టాలను అక్షర రూపములో అందించి ధైర్యాన్ని ఇస్తుంది పుస్తకం. పుస్తక పఠనం వల్ల సామాజిక అవగాహన సమస్యల పరిష్కార శక్తి యుక్తి ఇనుమడిస్తుంది. సమయానుకూల స్పందనను మెరుగైన ప్రజా సంబంధాల దృఢత్వంతో మానవీయ విలువలు రక్షించబడుతాయి. నా భార్య బిడ్డల కన్నా పుస్తకమే నాకు ఎక్కువ నా ప్రాణం పుస్తకం అని అంబేడ్కర్‌ అన్నారు. పుస్తకాలకు ఆయన అంత విలువనిచ్చేవారు.
ప్రస్తుతం అన్ని వయసుల వారు పుస్తకాలకు దూరమై, టీవీ చూస్తూ, వీడియో గేమ్స్‌ ఆడుతూ మానవ సంబంధాలు లేకుండా ఒంటరి జీవితానికి అలవాటు పడడం శోచనీయం. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ఉంటూ, కాలం గడిపే దుస్థితిలో కూరుకుపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడడం తప్ప చదవడానికి ఆసక్తి చూపడం లేదు.
మనోవికాసానికి మార్గదర్శి పుస్తకం
ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవంతో తెలిసివస్తుంది. పుస్తకాన్ని చదవడంతో మనోవికాసం కలిగి నూతన ఆలోచనలు జనిస్థాయి. పుస్తకం అజ్ఞాన్ని తొలిగించి విజ్ఞాన్నిఅందిస్తుంది. గురువులా బోధిస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలాగా అక్కున చేర్చుకుంటుంది. బాధపడేవారిని ఓదారుస్తుంది. అలసిన మనసుకు సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం పఠనం తరాలతరాల సంస్కృతిని అందిస్తుంది. మానవ నాగరికత చరిత్ర వారసత్వం జాతి ఔన్నత్యం పట్ల అవగాహనకు పుస్తక పఠనం ‘వారధిగా‘ నిలవడం గమనార్హం. ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని పుస్తక పఠనం ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగాల్సిన అవసరం ఉంది.
మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది. సమకాలీన సమాజములో సామాజిక సాంకేతిక మార్పులు ఎన్ని వచ్చినా పుస్తక ప్రియులు పుస్తకాన్ని వదల లేదు. సినిమాలు టీవీలు ‘ఇంటర్నెట్‌ మొబైల్‌’ మాయలు దరి చేరినా పుస్తకం విలువ తగ్గలేదు.
‘మనల్ని గుచ్చి గాయపరిచి ఇబ్బంది పెట్టే రచనలు చదవాలి. మంచి పుస్తకం మనలో దాగి వున్న ప్రతిభను సృజనను తట్టి లేపాలి. పుస్తక పఠనం మనలో గడ్డ కట్టిన సముద్రాన్ని గొడ్డలి లాగా పగుల కొట్టాలి’ అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా.
పుస్తక పఠనం ఆరోగ్యానికి మేలు పుస్తక పఠనం ఆరో గ్యానికి మేలు చేస్తుంది. మేధస్సు సక్రమంగా పనిచేస్తుంది పాజిటివ్‌ ఆలోచనలు ప్రేరేపిస్తుంది. నెగెటివ్‌ దృక్పథాన్ని అరికడుతుంది.
పుస్తక పఠనం బహుళ ప్రయోజనాలను నూతన ఆలోచనలు సృజన శక్తి తాత్వికత శాస్త్రీయత పరిశీలన పరిశోధన పరిష్కారం సామర్ధ్యం నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది. విశ్లేషణా సామర్ధ్యాలను. పెంపొందిస్తుంది. పుస్తకం పఠనం ఒత్తిడిని తగ్గిస్తుంది.
అనవసర ఆలోచనలు నియంత్రిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే రాత్రి పడుకునే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితననాన్ని దూరం చేస్తుంది. ఎదిగే పిల్లలకు ఒక్కో వయసులో ఒక్కో తరహా పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలు కథలు పుస్తకాలు మొదలు పెట్టి నాగరికతలు పరికరాలు, సాహస గాథలు, మహనీయుల జీవిత చరిత్రలు శాస్త్ర వేత్తలు, శాస్త్రవేత్తల, పరిశోధనలు మొదలగు అంశాల మీద అవగాహన చైతన్యం కలిగించడానికి అవసరమయ్యే పుస్తకాలు చదివే అలవాటు జీవన విధానములో భాగం కావాలి.
ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగావేరు వేరు (విభిన్న) తేదీలలో జరుపుకుంటున్నప్పటికి ఇన్ని ప్రత్యేకతలు వున్న ఏప్రిల్‌ 23 వ తేదీని ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955 లో యునెస్కో ప్రకటించింది. అంతే కాకుండా ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా జరుపాలని రచయితలు ప్రచురణ కర్తలు పాఠకులు ఉపధ్యాయులను ఈ రోజు గౌరవించాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ‘పుస్తక మహోత్సవాన్ని‘ నిర్వహిస్తారు ఏప్రిల్‌ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని పారిస్‌లో 1955 లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశములో 23 ఏప్రిల్‌ను ప్రపంచ పుస్తక కాపీ రైట్‌ దినోత్సవంగా ప్రకటించింది.
భారత్‌లో చదువరుల సంఖ్య ఎక్కువ
ప్రపంచంలోపుస్తకాలు చదివే (పాఠకులు) చదువరుల సంఖ్య మీద జరిపిన సర్వేలో భారతదేశంలో చదివే వారు ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ పుస్తకాలు చదివే వారు భారతీయులే. భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు పుస్తక పఠనం చేస్తారని దశాబ్ధం కింద చేసిన ఒక అధ్యయనములో తేలింది. 2013 నాటి సర్వే ప్రకారం పుస్తక పఠనం సమయం 10.4 గంటలకు పెరిగింది. టీవీలు సినిమాలు ఇంటర్నెట్‌ వినియోగం మారుతున్న జీవనశైలి వల్ల పుస్తక పఠనంపై మోజు తగ్గలేదు. పుస్తక పఠనంలో భారత్‌ టాప్‌ లో వుండడం గర్వించదగిన అంశం (గమనార్హం) పుస్తక పఠనం చేసే వారి సంఖ్య మరింత పెరగాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో పుస్తక పఠనం తగ్గిపోయింది ఆన్లైన్లో చదువుతున్నారు. పుస్తకాలు పట్టుకుని పఠనం చేయడం మర్చిపోతున్నారు. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా పుస్తక పఠనం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పుస్తక ప్రదర్శన పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై సెమినార్లు సదస్సులు వివిధ ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించడం గమనార్హం.
ప్రభుత్వం పౌరసమాజం
పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, గ్రంధాలయాల స్థాపనకు నిర్వహణకు పూనుకోవాలి. పఠనంతో పరిజ్ఞాన పరివ్యాప్తిలో క్రియాశీలక భాగస్వాములు కావాలి. పుస్తకాలు చదివే లక్షణం వాతావరణం ప్రజల్లో కలిగించాలి.
పుస్తకాలు కొని చదివే సంస్కృతిని పెంపొందించడం. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవడం కొత్త తరాలను పుస్తక పఠనం వైపు ఆకర్షించడం ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం సందర్భంగా యునెస్కో ఆశ యాలసాధన దిశగా కృషి జరగాలి.
కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పౌర గ్రంధాలయాలు స్థాపనకు పూనుకోవాలి. పాఠశాల కళాశాల స్థాయిలో లైబ్రరీలలో డిజిటల్‌ టెక్నాలజీ ఆధునిక సమాచార సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఆధునిక టెక్నా లజీ ఉపయోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పాఠకులకు మెరుగైన సేవలు అందించాలి. మానవ వనరుల సర్వతో ముఖాబివృద్ధికి దోహదపడే బహుముఖ చర్యలు చేపట్టి విజ్ఞాన భారత్‌ నిర్మాణానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో సగ్రమైన చర్యలకు సంసిద్ధం కావాలని ఆశిద్దాం.
నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News