Monday, September 16, 2024
Homeఓపన్ పేజ్Bulldozer action right or wrong?: ‘బుల్‌ డోజర్‌ న్యాయం’ న్యాయ విరుద్ధమేనా?

Bulldozer action right or wrong?: ‘బుల్‌ డోజర్‌ న్యాయం’ న్యాయ విరుద్ధమేనా?

పాలకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం..

ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్‌ న్యాయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. అనధీకృత, అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించవలసిన అవసరం ఉందని సూచించింది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తుండడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్పందించింది. నిజానికి, ఇటువంటి చర్యలకు సుప్రీంకోర్టు మొదట్లోనే అడ్డుపడాల్సింది. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి వ్యక్తిగత నిర్మాణాల కూల్చివేతలు చోటు చేసుకున్న ప్పుడు న్యాయస్థానాలు స్పందించడం జరిగింది. ఒకప్పుడు హర్యానాలో ఇటువంటి కూల్చివేతలు అడ్డూ ఆపూ లేకుండా సాగినప్పుడు పంజాబ్‌-హర్యానా హైకోర్టు దీన్ని జాతి ప్రక్షాళనగా అభివర్ణించింది. నేరాలకు పాల్పడిన నిందితుల ఇళ్లను కూల్చివేయడమన్నది ఒక సాధారణ శిక్షగా పరిగణన పొందుతోంది. ఇది న్యాయబద్ధమైన చర్యగా ప్రజల నుంచి ఆమోదం కూడా పొందుతోంది. అయిదేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించిన ఈ బుల్డోజర్‌ న్యాయాన్ని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరుగుతోంది.
నేరాలకు పాల్పడిన వారి ఇళ్లను కూల్చేయడం అన్నది చట్టవిరుద్ధమైన వ్యవహారం అనడంలో సందేహం లేదు. అయితే, న్యాయస్థానాల్లో న్యాయం వెలువడడానికి తీవ్రంగా జాప్యం జరుగుతుండడం, నిందితులు నేరం చేసి కూడా నిర్భయంగా, నిబ్బరంగా తిరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని చివరికి ప్రభుత్వాలు సైతం న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం జరుగుతోంది. న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోని రాజకీయ నాయకులు దేశంలో లేరంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మాఫియాలు రాజ్యమేలుతూ, ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతుండడం, వారికి ఎంత కాలానికీ శిక్షలు పడకపోవడం వంటి కారణాలు ఈ బుల్డోజర్‌ న్యాయానికి కారణమవుతున్నాయి. బుల్డోజర్‌ న్యాయం వంటి న్యాయాలను అమలు చేయడానికి ఏ చట్టమూ అంగీకరించదు. ఎవరు ఏ నేరం చేసినా చట్టాలు, న్యాయ స్థానాల ప్రకారమే వారిని శిక్షించాల్సి ఉంటుంది. తక్షణ న్యాయానికి ప్రజలు మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని ఎన్‌ కౌంటర్‌ పేరుతో కాల్చి చంపిన సంఘటనలు కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరస్థుల ఇళ్లను కూల్చివేస్తున్నందువల్ల సహజంగానే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు ముస్లింలకు చెందిన ఇళ్లనే కూల్చివేస్తున్నాయని, ఇవి న్యాయ చర్యలుగా కాక, విద్వేషపూరిత చర్యలుగా కనిపిస్తున్నాయని అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు సాగిస్తున్నాయి. నిజానికి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మార్గదర్శక సూత్రాలు అవసరం లేదు. ఇటువంటివి చట్టవిరుద్ధమైన చర్యలనీ, వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వరాదని పిటిషనర్లు కోరడం జరిగింది. ఒక కేసులో నిందితుడైనంత మాత్రాన ప్రభుత్వాలు అతని ఇంటిని ఎలా కూల్చగలవని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఒక నిందితుడు నేరస్థుడిగా నిర్ధారణ అయినప్పటికీ అతని ఇంటిని కూల్చడానికి ఎవరికీ హక్కు లేదని న్యాయ స్థానం స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయవచ్చని చెబుతున్న కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకుని ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఒక వర్గానికి చెందిన ఇళ్లను మాత్రమే కూల్చి వేస్తున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. నిజానికి అక్రమ నిర్మాణాలను కూల్చడంతో తాము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నట్టు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం వాదిస్తోంది.
అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వివక్షాపూరితంగా వ్యవహరిస్తు న్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యాయస్థానాలు మార్గదర్శక సూత్రాలను రూపొందించే పక్షంలో ఇటువంటి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ వసతిని ఏర్పాటు చేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఏమాత్రం సమంజసం కాదు. నిజానికి మతంతోనో, వర్గంతోనో సంబంధం లేకుండా నిందితులకు శిక్ష వేయడం చాలా అవసరం. తాము వివక్షతోనో, విద్వేషంతోనో ఇటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఏ వర్గానికి చెందినవారైనప్పటికీ నేరానికి పాల్పడినప్పుడు మాత్రమే వారికి బుల్డోజర్‌ శిక్షను వేయడం జరుగుతోందని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News