Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Canada Visa no more problematic: కెనడా వీసా సమస్యకు విముక్తి

Canada Visa no more problematic: కెనడా వీసా సమస్యకు విముక్తి

పాక్షికంగా పునరుద్ధరించిన సర్వీసులు

కెనడాతో పాక్షికంగా వీసాలను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిశ్చయించడం ఈ రెండు దేశాల సంబంధాలకు సంబంధించి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. చాలాకాలంగా ప్రగాఢ మైత్రీ సంబంధాలను కొనసాగిస్తున్న భారత్‌, కెనడాల మధ్య కొద్దికాలంగా ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల క్రితం ఖలిస్థాన్‌ ఉద్యమ నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అకస్మాత్తుగా హత్యకు గురికావడం, అందుకు భారత ప్రభుత్వ ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం జరిగిన దగ్గర నుంచీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అడుగంటాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నాయకుడు నిజ్జర్‌ భారతదేశంలో అనేక హింసా విధ్వంసకాండలకు కారకుడు. పైగా కెనడాలో కూడా ఆయన భారత వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టిన వ్యక్తి. కెనడా ప్రధాని ఆరోపణలు చేయడం ప్రారంభించగానే భారత ప్రభుత్వం ఈ రెండు దేశాల మధ్యా వీసా సంబంధాలను రద్దు చేసింది. కెనడా పౌరులెవరూ భారత్‌ లో ప్రవేశించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనివల్ల కెనడా నుంచి పర్యాటకులు రావడం ఆగిపోయింది. వ్యాపారులు, వాణిజ్యవేత్తల రాకపోకలు నిలిచిపోయాయి. భారత సంతతికి చెందిన వారు భారత్‌ కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో కొన్ని కెనడా కంపెనీలు తమ స్థానిక ఉద్యోగులు ఎక్కడికీ ప్రయాణాలు చేయకుండా ఆపేసింది.
మొదట్లో కెనడా తన వీసాలను ఆపలేదు కానీ, ఆ తర్వాత మూడు భారతీయ నగరాలకు కెనడా పౌరులు ప్రయాణం చేయడానికి వీల్లేదంటూ పాక్షికంగా వీసాలపై ఆంక్షలు విధించింది. ముంబై, కోల్కత్తా, చెన్నై నగరాలకు వీసా సర్వీసులను, దౌత్య సర్వీసులను పాక్షికంగా నిలిపివేయడం జరిగింది. ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో మాత్రమే ఈ సర్వీసులు అందేవిధంగా ఆంక్షలు విధించింది. కెనడా నుంచి తరచూ భారత్‌ సందర్శించే ప్రయాణికులు, పర్యాటకులు బాగా ఇబ్బంది పడడం జరిగింది. కెనడాకు చెందిన పర్యాటకులు వేల సంఖ్యలో తమ పర్యటన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం జరిగింది. నిరుడు సుమారు 2.8 లక్షల మంది కెనడా దేశీయులు భారత్‌ పర్యటన చేశారు. కెనడాలోని భారతీయ విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు సెప్టెంబర్‌ నెలలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న దగ్గర నుంచి దిక్కుతోచని పరిస్థితిలో నిరీక్షించడం జరుగుతోంది. కెనడాలో ఉన్నత విద్యావకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఉద్యోగావకాశాలు కూడా అధికంగా ఉండడం వల్ల సుమారు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు.
అదృష్టవశాత్తూ, ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తినడమనేది వాణిజ్యంపై తన ప్రభావాన్ని చూపించలేదు. ఈ రెండు దేశాల మధ్య ఏటా 800 కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోందని అంచనా. అయితే, ఈ దేశాల మధ్య వైరం మరింత ముదిరితే మాత్రం వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఖనిజ ఇంధనాలు, నూనెలు, ఎరువులు, పప్పు ధాన్యాలను అధిక మొత్తాలలో భారత్‌ కెనడా నుంచి దిగుమతి చేసుకుంటోంది. వాస్తవానికి భారతదేశ వాణిజ్యంలో కెనడా భాగం ఒక శాతం మాత్రమే. భారతదేశానికి దిగుమతి అయ్యే పప్పు ధాన్యాల దిగుమతిలో కందిపప్పు దిగుమతి సుమారు 95 శాతంగా ఉంటోంది. దేశీయంగా పప్పు ధాన్యాల దిగుబడి పడిపోయే పక్షంలో దేశం సంకట పరిస్థితిలో పడే అవకాశం ఉంది. భారత్‌, కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాకాలం క్రితమే కుదరాల్సింది కానీ, ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న కారణంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశం తలెత్తింది.
దేశానికి భద్రత అనేది అవసరమే కానీ, వీసాలను ఎక్కువ కాలం సస్పెండ్ చేయడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం ఎంట్రీ వీసాలను, బిజినెస్‌ వీసాలను, మెడికల్‌ వీసాలను పునరుద్ధరించినందు వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా క్రమంగా పట్టాలెక్కుతాయని భావించవచ్చు. వాణిజ్యం పెరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా వృత్తి నిపుణులు స్వేచ్ఛగా, సజావుగా ఈ రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News