Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Canada wrong steps: కెనడా ప్రధాని తప్పటడుగులు

Canada wrong steps: కెనడా ప్రధాని తప్పటడుగులు

కెనడా తీరుతో 'ఫైవ్ ఐస్' దేశాల ఆందోళన

గత జూన్‌ నెలలో కెనడాలోని ఖలిస్థానీ నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిర్జర్‌ ను భారతీయ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా అడుగంటాయి. ట్రూడో ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా, ఈ విషయంలో తమ దగ్గరున్న సాక్ష్యాధారాలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నామని, గతవారం మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పడం మరింతగా వివాదాస్పదమైంది. దీంతో సంబంధాల క్షీణతకు సంబంధించి వరుస పరిణామాలు చోటుచేసుకోవడం ప్రారంభించాయి. కెనడా ఒక సీనియర్‌ భారతీయ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించగా, భారత ప్రభుత్వం కూడా కెనడా హైకమిషనర్‌ ను పిలిపించి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ను బహిష్కరించింది. కెనడాతో ‘ఫైవ్‌ ఐస్‌’ దేశాల ఇంటెలిజెన్స్‌ భాగస్వామ్యంలో సభ్యులుగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియాలు ఈ పరిణామాలను చూసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.
భారత్‌ లోని కెనడా దౌత్యవేత్తలు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఆరోపించింది. మరింత మంది దౌత్యవేత్తల మీద నిఘా పెట్టామని కూడా వెల్లడించింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తోందని, కెనడా సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తోందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఫలితంగా కొత్త సమస్యల మీద ఘర్షణ ప్రారంభమైంది. దీనిపై ట్రూడో ప్రభుత్వానికి తమ రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. పియరీ పోలివియర్‌, జగ్మీత్‌ సింగ్‌ వంటి నాయకులు భారత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. 2025 వరకు కెనడా ప్రభుత్వానికి ఈ నాయకుల మద్దతు అవసరమవుతుంది. ఈ నాయకులు తలచుకుంటే ట్రూడో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. పాకిస్థాన్‌ తో మాదిరిగా కెనడాతో ఆనవాయితీ ఘర్షణలు జరిగే అవకాశం లేదు. అయితే, భారత దేశంలో వేల సంఖ్యలో కెనడా పౌరులు ఉండడం, కెనడాలో కూడా పెద్ద సంఖ్యలో భారత పౌరులు ఉంటున్న నేపథ్యంలో ఈ ఘర్షణల ప్రభావం విస్తారంగా ఉండే అవకాశం ఉంది. పైగా నాటో కూటమిలో కెనడా సభ్యురాలు కావడం వల్ల కూడా దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది.
సమీప భవిష్యత్తులో భారత, కెనడా దేశాలు తాము పరస్పరం చేసుకున్న ఆరోపణలను రుజువు చేయాల్సి ఉంది. అందుకు తగ్గ సాక్ష్యాధారాలను ప్రపంచం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. మొదటగా ట్రూడో తాను చేసిన ఆరోపణలను రుజువు చేయాల్సి ఉంటుంది. సిక్కు తీవ్రవాదుల భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా కేంద్రంగా, ప్రధాన స్థావరంగా మారుతోందని భారత ప్రభుత్వం ఇదివరకే ఆధారాలతో సహా కెనడా ముందుంచింది. 1980ల నుంచి ఇటీవల ఒక భారతీయ దౌత్యవేత్త మీదా, భారతీయులకు చెందిన ఆస్తిపాస్తుల మీదా అక్కడి ఖలిస్థానీ తీవ్ర వాదులు దాడులు జరపడాన్ని అది రుజువులతో సహా కెనడా ప్రభుత్వానికి తెలియజేసింది. ‘ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌’ అనే దళానికి నాయకుడైన నిజ్జర్‌ భారత్‌ లో కరుడు గట్టిన నేరస్థుడుగా పరిగణన పొందుతున్నాడు. అతని కోసం భారత ప్రభుత్వం డేగ కళ్లతో నిరీక్షిస్తోంది. 1990లలో అతను పంజాబ్‌ లో పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. అతని మీద భారత ప్రభుత్వం ఇంటర్‌ పోల్‌ కు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అతను ప్రస్తుతం కెనడా పౌరుడు. ట్రూడో ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 2015లో కెనడాను సందర్శించడం జరిగింది. 1973 తర్వాత ఒక భారత ప్రధాని కెనడాను సందర్శించడం ఇదే మొదటిసారి. మోదీ పర్యటనతో ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఖలిస్థానీ తీవ్రవాద సమస్య పరిష్కారం అయిపోతుందని అంతా భావించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత, కెనడాల మధ్య వివాదం పరిష్కారం కావడానికి మరో అవకాశం అందివచ్చింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలపై చర్చలు జరిగాయి. కాగా, జి-20 సమావేశాల సందర్భంగా, మోదీ, ట్రూడోల మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ ఖలిస్థానీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఈ సందర్భంగా సంబంధాలు మెరుగుపడకపోగా, మరింతగా క్షీణించడం ప్రారంభమయింది. తాజా పరిణామాలతో ఈ సంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News