Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్Canadians Vs Indians: క‌ల‌ల కెన‌డా.. ఇప్పుడు క‌ల్లోల కెన‌డా!

Canadians Vs Indians: క‌ల‌ల కెన‌డా.. ఇప్పుడు క‌ల్లోల కెన‌డా!

ఇది కెనడా భాగోతం..

కెనడా… భారతీయ యువతీ యువకుల్లో చాలామందికి కలల దేశం. నిజానికి కొంతమంది డాలర్‌ డ్రీమ్స్​‍ పేరుతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని భావించినా, అక్కడి యూనివర్సిటీల ఫీజులు, అక్కడ ఉండేందుకు అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని.. ఆ తర్వాత అత్యుత్తమ గమ్యస్థానంగా కెనడాను ఎంచుకుంటారు. యూరోపియన్‌ దేశాల్లో కోర్‌ బ్రాంచిలలో ఉన్నత చదువులు చదివినవాళ్లు కూడా అక్కడ కాకుండా.. చివరకు కెనడాలో స్థిరపడాలని భావించేవారు. అందుకు… అక్కడ ఉండే ప్రశాంత వాతావరణం, తక్కువ ఖర్చుతోనే జీవితం గడిచిపోవడం, యూనివర్సిటీల ఫీజులు కూడా అమెరికాతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం… ఇలా ఎన్నో కారణాలున్నాయి. అమెరికాలో కొన్నాళ్లు ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా కెనడాలో త్వరగా పర్మినెంట్‌ రెసిడెన్సీ (పీఆర్‌) వస్తుందని, ఆ తర్వాత ఇక కెనడా పౌరసత్వం కూడా వచ్చేస్తుందని అటువైపు వెళ్లేవారూ ఉంటారు. అమెరికా, కెనడాల మధ్య దూరం కూడా పెద్ద ఎక్కువగా లేకపోవడమూ చాలామంది కెనడాను ఎంచుకోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి.

- Advertisement -

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే!!
ఇప్పుడు రెండోవైపు చూస్తే.. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అత్యంత అస్తవ్యస్తంగా తయారయ్యాయి, ముఖ్యంగా గత కొంతకాలంగా పలు అంశాలు. కెనడాలో ఇతర దేశస్థులు.. ముఖ్యంగా భారతీయులకు, అందునా విద్యార్థులు, ఇంకా ఉద్యోగాలు రావాల్సిన వాళ్లకు ఇబ్బంది కరంగా మారుతున్నాయి. ఎన్నికల ముంగిట కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాకిస్థాన్‌ నుంచి, ఇతర కొన్ని దేశాల నుంచి వలసలను ప్రోత్సహించారు. దాంతో అక్రమంగా వచ్చిన అనేకమంది కెనడాలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. స్థానికులతో వాళ్లు గొడవలు పడుతుండడంతో.. ఒకరకంగా ఆసియా ఖండం నుంచి వచ్చినవాళ్లంతా ఇలాగే ఉంటారనుకుని.. కెనడాలోని వివిధ వ్యాపార సంస్థల యజమానులు భారతీయులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం మానేశారు. నిజానికి అక్రమమే అయినా, చాలామంది విద్యార్థులు ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లినప్పుడు అక్కడ బతికేందుకు అవసరమైన డబ్బులు సంపాదించుకోవాలని.. పార్ట్‍ టైం ఉద్యోగాలు ఏవో ఒకటి చేసుకుంటారు. గంటకు పది నుంచి పదిహేను డాలర్ల వరకు సంపాదించి.. తల్లిదండ్రుల మీద మరీ ఎక్కువ భారం పడకుండా చూసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగాలు ఏవీ రావట్లేదు.
ఈ సమస్య చిన్నదే. కొన్నాళ్ల తర్వాతైనా సర్దుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు అంతకంటే మరో పెద్ద భూతం ముంచుకొచ్చింది. కెనడా పౌరుడైన హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ గత ఏడాది జూన్‌లో అదే దేశంలో హత్యకు గురయ్యాడు. దీనిమీద చాలా కాలం నుంచి ప్రధాని జస్టిన్‌ ట్రూడో మన దేశం మీద కాస్త కన్నెర్ర జేస్తున్నారు. నిజ్జర్‌ హత్యలో భారత భద్రతా సంస్థల పాత్ర ఉందేమోనన్న అనుమానాలను ఆయన పదే పదే లేవనెత్తేవారు. వాళ్లు అన్న ప్రతిసారీ ఆ హత్యతో తమకు ఏమాత్రం సంబంధం లేదని భారత ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. దాని మీద విచారణ పేరుతో.. చివరకు తాజాగా ఏకంగా కెనడాలోని భారత హైకమిషనర్‌ సహా కొందరు ఉన్నతాధికారులను “పర్సన్స్​‍ ఆఫ్‌ ఇంట్రస్ట్‍” అని పేర్కొన్నారు. దాంతో కెనడా-భారత్‌ల మధ్య ఒక్కసారిగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ముందుగా కెనడా ఆరోపణలు చేయడంతో భారతదేశం నుంచి కెనడా రాయబారులు అందరూ తక్షణం వెళ్లిపోవాలని భారత్‌ ఆదేశించింది. దాంతోపాటు.. కెనడాలో ఉన్న భారత రాయబా రులను కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు.. భారతీయులకు టూరిస్ట్‍ వీసాల జారీని సైతం చాలా కఠినతరం చేసింది. దాంతో కొన్ని కుటుంబాలకు తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన చాలామంది పిల్లలు కెనడాలో ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లిళ్లు కూడా అయ్యాయి. దంపతులిద్దరూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ.. పిల్లల్ని కంటున్న తరుణంలో తల్లిదండ్రులను సాయంగా తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చిన ఘర్షణల కారణంగా వాళ్ల తల్లిదండ్రులకు వీసాలు దొరకట్లేదు. పిల్లల దగ్గరకు వెళ్లలేక.. అలాగని వారి పరిస్థితి తెలిసి కూడా ఇక్కడ ఉండలేక వారు పడుతున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు.

ఎందుకింత గొడవ?
ఖలిస్తాన్‌ అనే ప్రత్యేక దేశం కావాలంటూ కొంతమంది సిక్కులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. దానికోసం కొందరు ఉగ్రవాద బాట పట్టడం కూడా మనకు తెలిసిందే. అలాంటి వారికి తొలినాళ్లలో నాయకత్వం వహించిన జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే, ఇతర ఉగ్రవాదుల ఆట కట్టించాలని 1984లో నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రయత్నించింది. వాళ్లంతా వెళ్లి అమృతసర్‌లో సిక్కులకు అత్యంత పవిత్ర ప్రాంతమైన స్వర్ణ దేవాలయం (హర్‌ మందిర్‌ సాహెబ్‌)లో దాక్కున్నారు. దాంతో ఆ సంవత్సరం జూన్‌ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు “ఆపరేషన్‌ బ్లూ స్టార్‌” పేరుతో సైన్యాన్ని ఆలయంలోకి పంపించారు. కేవలం ఒక్క స్వర్ణ దేవాలయం మాత్రమేకాక.. పంజాబ్‌ వ్యాప్తంగా ఏ గురుద్వారాలో ఉగ్రవాదులు దాక్కున్నా వారందరినీ వెతికి వెతికి హతమార్చాలని ఆదేశించారు. ఇందుకోసం సైన్యం హెలికాప్టర్లు, ట్యాంకుల్లాంటి భారీ ఆయుధాలనూ వినియోగించింది. ఆ భారీ ఆపరేషన్‌లో భింద్రన్‌వాలే సహా ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టారు. అనంతరం 1984 అక్టోబర్‌ నెలలో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు.
తర్వాత చాలామంది ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కులు కెనడా వలస వెళ్లిపోయారు. వారితో పాటు సాధారణ ప్రజలు కూడా చాలామంది వెళ్లారు. కెనడాలోని భారతీయుల్లో అత్యధిక సంఖ్యలో సిక్కులే ఉంటారన్నది ఒక అభిప్రాయం. దాంతో పాటు.. ఖలిస్తానీ ఉద్యమం కూడా క్రమంగా అక్కడ వేళ్లూనుకోసాగింది. ఈ విషయం మీద భారతదేశం చాలా కాలం నుంచి అభ్యంతరం చెబుతూనే ఉంది. ఖలిస్తానీ మద్దతుదారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే కెనడా పట్టించుకోవడం లేదు. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను భారత్‌ ఖలిస్తాన్‌ ఉగ్రవాదిగా ఎప్పుడో ప్రకటించింది. అతడిని తమకు అప్పగించాలని కోరింది. ఈలోపే నిజ్జర్‌ అక్కడ హత్యకు గురయ్యాడు. దాంతో ఈ హత్య వెనక భారతదేశానికి చెందిన రా (రీసెర్చ్‍ అండ్‌ ఎనాలసిస్ వింగ్‌) లాంటి సంస్థలు ఉండి ఉంటాయన్నది కెనడా అనుమానం. నిజానికి జనాభా శాతాన్ని బట్టి చూసుకుంటే భారతదేశం కంటే కెనడాలోనే ఎక్కువ శాతం సిక్కులు ఉంటున్నారు.
పాశ్చాత్య దేశాల్లో కెనడాతోనే క్షీణించిన సంబంధాలు
సోవియట్‌ యూనియన్‌ (యూఎస్ఎస్ఆర్‌) విచ్ఛిన్నం అయిన తర్వాత.. పాశ్చాత్య దేశాలన్నింటితోనూ భారతదేశానికి సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు కెనడాతో తప్ప.. మరే దేశంతోనూ ఇంతలా క్షీణించలేదు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరు చుకున్న భారత్‌, మెల్లమెల్లగా పూర్తి స్థాయి మార్కెట్‌ ఎకానమీ సాధించే దిశగా పయనిస్తోంది. జీ7, నాటో దేశాలతో ఆర్థిక, వాణిజ్య, రాజకీ య సంబంధాలను మెరుగుపరుచు కునేందుకూ ప్రయత్ని స్తోంది. ఈ రెండు గ్రూపులలోనూ భాగంగా ఉన్న కెనడాకు అమెరికాతో చాలా సన్నిహిత సైనిక సంబంధాలున్నాయి. రెండు దేశా లలో ఆర్థిక వ్యవస్థపరంగా కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన కెనడాతో భారత్‌ సంబంధాలు అంతంత మాత్రంగా మారడం విశేషం. ఎందు కంటే.. అమెరికాతో భారత దేశానికి ఇటీవలి కాలంలో చాలా మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత తరచు అక్కడ పర్యటించడం, అక్కడి అధ్యక్షులు ప్రత్యేకంగా భారతీయులకు అను కూల నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. రక్షణ పరంగా కూడా అనేక ఒప్పందాలు జరుగుతున్నాయి.

‘పర్సన్స్​‍ ఆఫ్‌ ఇంట్రెస్ట్‍’ అంటే ఏమిటి?
నిజ్జర్‌ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తలు, ఇతర హైకమిషన్‌ అధికారులను పర్సన్స్​‍ ఆఫ్‌ ఇంట్రెస్ట్‍గా కెనడా చేసిన ప్రకటన, ఇరు దేశాల దౌత్యవేత్తల బహిష్కరణకు దారి తీశాయి. కెనడాలో పర్సన్స్​‍ ఆఫ్‌ ఇంట్రెస్ట్‍ అంటే నేరానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని విచారణ అధికారులు భావిస్తారు. నిజ్జర్‌ హత్య తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో భారత అధికారుల ప్రమేయానికి సంబంధించి బలమైన సాక్ష్యం ఉందన్నారు. ఈ ఆరోపణలను భారత్‌ పూర్తిగా ఖండించింది, ఈ ఆరోపణలకు సంబంధించి గట్టి సాక్ష్యాలు, ఆధారాలు ఏమైనా ఉంటే వెంటనే తమకు ఇవ్వాలని కెనడాను కోరింది. కానీ, టూడో ప్రభుత్వం మాత్రం ఒక్కటంటే ఒక్క ఆధారాన్నీ చూపించలేకపోయింది. అయినా ఇప్పుడు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. త్వరలో కెనడాలో జరగబోతున్న ఎన్నికలే. అక్కడ ప్రబలమైన సంఖ్యలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు సాధించుకోవాలంటే.. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపించాలని, ఖలిస్తాన్‌కు తాము అను కూలం అన్న కలర్‌ ఇవ్వాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.
కెనడియన్ల భద్రత, దేశంలోని శాంతిభద్రతలపై తన దృష్టి ఉందని ట్రూడూ ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా, చాలా కష్టతరంగా ఉన్నాయని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీని కూడా అన్నారు. భవిష్యత్తులో కూడా కెనడా గడ్డపై నిజ్జర్ల తరహా హత్యలు జరగవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా లావోస్లో ఇటీవల రెండు దేశాల అధినేతల మధ్య సమావేశం జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే… ఈ సమస్యను వదలకూ డదని కెనడా నిర్ణయించు కున్నట్లు తెలు స్తోంది. దాన్ని పరిష్కరించడానికి భారత్‌ కూడా అంత ఆసక్తి ఏమీ చూపించడం లేదు. ఎందుకంటే.. 2025లో కెనడాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడో ఓటమి దాదాపు ఖాయమై పోయింది. దాంతో కొత్త ప్రధాని వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం అవుతుంది.అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిషేధిత సంస్థ అయిన సిఖ్స్​‍ ఫర్‌ జస్టిస్ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. కెనడా ప్రధానికి రాసిన పాత లేఖ ఇప్పుడు మరోసారి బయటపడింది. నిజ్జర్‌ హత్యలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పాత్ర ఉందని ఆరోపిస్తూ, ఆయనను బహిష్కరిం చాలని ఆ లేఖలో పన్నూ కోరాడు. ఈ బహిష్కరణ వెంటనే జరగకపోతే…. కెనడాలో చురుకుగా ఉన్న భారత ఏజెంట్ల చేతుల్లో మరికొంతమందికి హాని జరగొచ్చని తాము భయపడు తున్నామని అందులో పేర్కొన్నాడు. అలాగే నిజ్జర్‌ శాంతిని కోరుకొనే, చట్టాన్ని గౌరవించే కెనడా పౌరుడని అందులో పేర్కొనట్లు సమాచారం. హత్యలు మొదలు బాంబుపేలుళ్ల వరకు అనేక అకృత్యాలకు పాల్పడిన హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌- రవిశర్మ అనే పేరుతో ఒక తప్పుడు పాస్పోర్టు సంపాదించి, ఆ తర్వాతే కెనడాలో ఆశ్రయం పొందాడు. ఈ భారత వ్యతిరేకికి పౌరసత్వం కట్టబెట్టిన కెనడా ప్రభుత్వం అతడి హత్య విషయంలో ఇండియాపై నిరాధార ఆరోపణలు చేస్తోంది.

అమెరికాలోనూ కొంత ప్రతిస్పందన?
ఈ వివాదం ప్రభావం అమెరికా వర్గాల మీద కూడా పడిందా అంటే… అవుననక తప్పదు. ఎందుకంటే నిజ్జర్‌ హత్య జరిగిన కొన్నాళ్ల తర్వాత అమెరికన్‌ – కెనడియన్‌ పౌరుడైన గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు గురయ్యాడు. నిజానికి ఈ పన్నూకు ఐఎస్ఐతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వాళ్ల ప్రోద్బలంలోనే తర్వాతి కాలంలో ఖలిస్తాన్‌ అనుకూలవాదిగా మారి.. విదేశాల్లో ఉంటూ భారతదేశం మీద కుట్రలు పన్నుతు న్నాడని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తి హత్యకు గురైతే.. నిఖిల్‌ గుప్తా అనే భారతీయ పౌరుడిని నిందితుడిగా పేర్కొంది. అయితే, నిఖిల్‌ గుప్తా కేసును ఎప్పుడు బయటపెట్టాలనే విషయాన్ని అమెరికా, కెనడా కలిసి నిర్ణయించాయా? అమెరికాను సంప్రదించిన తర్వాతే పార్లమెంటులో ట్రూడో ప్రకటన చేశారా? భారత్‌ నుంచి ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘స‌మ‌యం’ -స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌ శ‌ర్మ‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News