Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Federal country: కేంద్రం గుప్పిట్లో రాష్ట్రాల అధికారాలు?

Federal country: కేంద్రం గుప్పిట్లో రాష్ట్రాల అధికారాలు?

రాజకీయ కోణం నుంచి కాక, పరిష్కారం వైపు అడుగులేయాలి

తమపట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని రాష్ట్రాలు తరచూ గగ్గోలు పెడుతుంటాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆరోపణే వినవస్తూండేది. దాదాపు ప్రతి ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వమూ ఇదే విధమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది. నిజానికి ఇలా గగ్గోలు పెట్టాల్సి రావడం దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాఖ్య స్ఫూర్తికి ఏమాత్రం ఆరోగ్య దాయకం కాదు. నిజానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను, విభేదాలను రాజ్యాంగ నిర్మాతలు ఊహించ కపోలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుని, ఈ వివాదాలను, విభేదాలకు పరిష్కరించుకోవడానికి రాజ్యాంగంలో వారు కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. ఇందుకోసం 1952లోనే జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1990లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263 కింద అంతర్రాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించడమే కాకుం డా వీటి మధ్య సమన్వయాన్ని, సహకారాన్ని పెంపొందిం చడానికి కూడా ఈ రెండు మండలులు కృషి చేస్తాయి. ఇవి చురుకుగా, క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు విజృంభించడానికి కారణమేమిటి? వీటి మధ్య వివాదాల కారణంగా పెరుగు తున్న సవాళ్లను ఇవి పరిష్కరించలేకపోతున్నాయా? పక్షపాత, వివక్షాపూరిత రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోందా?
సహకారం, సమన్వయాల మీద ఆధారపడిన సమాఖ్య స్ఫూర్తి చుట్టూ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తిరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం తన పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు. ఏ కారణంగానైనా ఈ రెండింటి మధ్యా సంబంధాలు దెబ్బతినే పక్షంలో రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతినడం ఖాయం. కేంద్ర ఖజానా నుంచి తమకు రావాల్సిన వాటా రావడం లేదని, తమ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్రాలు ఆరోపించే పరిస్థితికి ఈ రెండింటి సంబంధాలు దిగజారకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భౌగోళిక విభజనేదీ ఉండకూడదు. దేశమంతా ఒక్కటేనన్న భావన తప్ప ఇక్కడ రాజకీయ ప్రాధాన్యాలకు అవకాశం లేదు. అన్యాయం జరుగుతోందన్న భావన ఒక రాష్ట్రానికి కలిగే పక్షంలో దీని ప్రభావం ఇతర రాష్ట్రాల మీద కూడా పడే అవకాశముంటుంది. అయితే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, రాజస్థాన్‌ (అశోక్‌ గెహ్లాత్‌ హయాంలో), కేరళ, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలు ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంతో ఈ పక్షపాత ధోరణి విషయంలో అనేక ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలన్నిటి నుంచి ఈ రకమైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
ఇందులో నిజమెంత?
అయితే, రాష్ట్రాల ఫిర్యాదులతో తమకేమీ సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవడంతో ఈ సమస్య పరిష్కారం కాదు. నిజానికి, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిరాధారంగా కూడా ఇటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది. మరిన్ని నిధుల కోసం ఒత్తిడి చేసే ఉద్దేశంతో ఇటువంటి ఫిర్యాదులు చేయడం కూడా జరుగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అవి కూడా ఒక ప్రతిపక్ష ప్రభుత్వంగానే పరిగణించడం జరుగుతుంటుంది. కాగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫిర్యాదులను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేక అధికారాలను, ముఖ్యంగా ఆర్థిక అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరించుకోవడం కూడా జరుగుతోందని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశం ఒకే విధానం అని ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే అది చివరికి రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలను బట్టి కేంద్ర ప్రభుత్వం అనేక అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తేలికగా అర్థమవుతోంది.
గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (జి.ఎస్‌.టి)ను ప్రవేశ పెట్టినప్పుడు, రాష్ట్రాలకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందని అంతా నమ్మడం జరిగింది. పన్నుల వసూళ్లను క్రమబద్ధం చేసినప్పుడు, రాష్ట్రాలకన్నిటికీ అత్యధిక మొత్తంలో పన్నుల సొమ్ము అందుతుందనే అంతా భావించారు. ఈ విధంగా ఆశించడంలో తప్పేమీ లేదు కూడా. అయితే, అనేక రాష్ట్రాల విషయంలో ఈ సదభిప్రాయం, సుహృద్భావం తలకిందులయింది. ఈ విషయంలో రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతోందంటూ ఫిర్యాదు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ కోణం నుంచి, ఎన్నికల కోణం నుంచి కాక, ఒక జాతీయవేత్త కోణం నుంచి పరిశీలించి సానుభూతితో పరిష్కరించడం సమంజసంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన, తమకు వీలైన పేర్లు పెట్టి వాటిని అమలు చేయడం జరుగుతున్న మాట నిజమే. కానీ, ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేయడం ఏమాత్రం సమంజసం అనిపించుకోదు. కేంద్ర ప్రభుత్వం అటువంటి సమస్యలను మరో విధంగా పరిష్కరించుకునే ప్రయ త్నం చేయడం మంచిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటినా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రాలు పసి పిల్లల్లా తప్పటడుగులు వేయడంలో అర్థం లేదు.
పరిష్కార మార్గమేదీ?
అధికారాలను కేంద్రీకృతం చేసుకోవాలనే తపన కేం ద్ర ప్రభుత్వంలో పెరగడం వల్ల రాష్ట్రాలు తప్పకుండా నష్టపోతాయి. కేంద్రానికి రాష్ట్రాలతో సమస్యలు తలెత్తినా, రాష్ట్రాలకు కేంద్రంతో విభేదాలు తలెత్తినా వాటిని పరిశీలించి పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర మండలి ఉందనే విషయాన్ని విస్మరించకూడదు. విచిత్రమేమంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర మండలి, జాతీయ అభివృద్ధి మండలి ఉన్నప్పటికీ, ఇంతవరకూ వాటికి తమ ఫిర్యాదులు అందజేసిన కేంద్ర ప్రభుత్వమూ లేదు, రాష్ట్ర ప్రభుత్వమూ లేదు. కేంద్రానికి రాష్ట్రాలతో సమస్యలు వచ్చినా, రాష్ట్రాలకు కేంద్రంతో సమస్యలు వచ్చినా, ముఖాముఖీ తలపడే ప్రయత్నమే జరుగుతుంది. దాన్ని రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం, ప్రతీకార కోణం నుంచి ఆలోచించడం అనేక ఏళ్లుగా జరుగుతోంది. ఈ రెండు వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తి బాగా పెరిగే అవకాశం ఉంది. వీటిని ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిదనే విషయం అటు కేంద్ర ప్రభుత్వానికీ లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకూ లేదు.
ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలను చర్చించడానికి ఈ రెండు సంస్థలు తరచూ సమావేశమవుతుంటాయి కానీ, అక్కడ సరైన అజెండా ఏమీ ఉండదు. ముఖ్యంగా రాష్ట్రాలు ఈ రెండు సంస్థలను సీరియస్‌ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సమస్య వచ్చినా దాన్ని రాజకీయ కోణం నుంచి కాక, పరిష్కార కోణం నుంచి తీసుకుని ఈ సంస్థలను ఆశ్రయించవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన సమస్యలను నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా, న్యాయంగా చర్చించడానికి, తగిన చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ మండలులకు విశేష అధికారాలున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి వ్యవహారాలను ఈ మండలుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కేంద్రం వల్ల ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఈ మండలులకు ఫిర్యాదు చేయడం వల్ల మరింతగా ఉపయోగం ఉంటుంది.
రాష్ట్రాల ఫిర్యాదులు
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా శక్తిమంతమైన ప్రభుత్వమే కావచ్చు. కానీ, కేంద్రం వద్ద చేరుతున్న సొమ్మంతా ఈ రాష్ట్రాల్లోని ప్రజల నుంచి పన్నుల రూపేణా అందుతున్న సొమ్మేనన్న విషయాన్ని మరచిపోకూడదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉండడం, రాష్ట్రాలు మాత్రం ఆర్థికంగా అధ్వాన స్థితిలో ఉండడం అనేది దేశానికి ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. దేశంలోని రాష్ట్రాలన్నిటి నుంచి తమకు అందుతున్న నిధులతో తాము ఆర్థికంగా శక్తిమంతం అవుతున్నామనే విషయాన్ని కేంద్రం అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయం కలగజేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు అందజేయవలసిన న్యాయమైన వాటాను చిన్నాచితకా కారణాలు చెప్పి, సాంకేతిక కారణాలు చూపించి దానికి దక్కకుండా చేయడం ఏ విధంగానూ న్యాయం కాదు.
రాష్ట్రాల న్యాయమైన హక్కులను కాదనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎంత అన్యాయం చేస్తున్నదీ గ్రహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ధర్మకర్తలా వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్రాల నమ్మకాన్ని చూరగొనాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రమైనా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదనే అభిప్రాయం కలిగినప్పుడు ఈ సమస్యను అంతర్రాష్ట్ర మండలి ద్వారా పరిష్కరించుకోవడం చాలా మంచిది. జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మంచిది.

  • వి. ఆనందరావు,
    న్యాయవాది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News