Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Chardham Literature: సాహిత్యపథంలో చార్‌ధామ్‌యాత్ర

Chardham Literature: సాహిత్యపథంలో చార్‌ధామ్‌యాత్ర

పద్మాచారి కలం నుండి మరో రచన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసే రచన ఇది

తెలుగు సాహిత్యాన్ని అనేక ప్రక్రియల మాదిరిగా యాత్రాచరిత్ర ప్రక్రియ కూడా పరిపుష్టం చేసింది. తెలుగు రచయితలు పలువురు తాము చూసిన యత్రా విశేషాలు, పొందిన అనుభవాలు, అనుభూతులతో పాటుగా ఆయా ప్రాంతాల ప్రజల వేష, భాష, సాంస్కృతిక, నాగరికతల జ్ఞానాన్ని వర్ణనాత్మకంగా గ్రంథస్థం చేసి అందించారు. విషయ వివరణకు తోడు వర్ణనా నైపుణ్యం కారణంగా ఇవి కేవలం సమాచార గ్రంథాలుగానే కాక సాహిత్య గౌరవాన్ని కూడా పొందాయి.
యాత్రాచరిత్ర అనగానే తెలుగు వారికి ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రాచరిత్ర, కోలా శేషాచలకవి నీలగిరి యాత్ర, నాయని కృష్ణకుమారి కాశ్మీర దీపకళికలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. వీటిని చదువుతున్నంత సేపు ఊహాలోకంలో విహరించడం అభిరుచిగల పాఠకునికే అనుభవైకం. తెలుగు సాహిత్యంలో యాత్రాచరిత్రలు విరివిగా వెలువడుకున్నా, సంఖ్యలో తక్కువైనా మళ్ళీమళ్ళీ చదివించేలా ఉండటం వీటికి గల ప్రత్యేక లక్షణం. ఇది ఆయా రచయితల ప్రతిభ, రచనా విన్యాసంగా చెప్పుకోవచ్చు. వీటి స్థాయిలో ఆకట్టుకునేది, ఇటీవలి కాలంలో వచ్చిన కూరెళ్ళ పద్మాచారి ఆధ్యాత్మిక దారుల్లో చార్‌ ధామ్‌యాత్ర ప్రముఖ యాత్రా చరిత్ర.
చేతులకు లాగానే నా కాళ్ళకు చక్రాలున్నాయని కొందరంటారు. అందుకేనేమో నాకు తిరుగుడు యోగం అన్నవి ఈ రచనలోని ప్రారంభవాక్యాలు. ఈ వాక్యంలో కాళ్ళకు చక్రాలు అనే జాతీయం (సందర్భశుద్ధితో ఇలాంటి ప్రయోగాలు అనేకం) ఇతనికి భాషపై గల పట్టును, విశేష భాషాంశాల ప్రయోగ సామర్ధ్యాన్ని తెలుపుతుంది. రచనలో జాతీయాల ప్రయోగం శుచిగల పదార్థానికి రుచి, పరిమళం తోడైనట్లే కదా! తిరుగుడు యోగం (ఆశయం, లక్ష్యం లేని తిరుగుడు రోగం) అనేది నూతన సమాససృష్టి. కవి, రచయిత అయినవాడు కొత్త పదబంధాలను, సమాసాలను కూర్చగల శక్తిని కలిగి ఉన్నప్పుడే ఆ రచనలో కొత్తదనం నిండి చదువరులను ఆకట్టుకుంటుంది. అలాంటి రచన పాఠకులను అక్షరాల వెంట ఆగిపోనీయని యాత్ర చేయిస్తుంది. ఇలాంటి పదునైన, సరళ సుందరమైన భాష, వాక్యవిన్యాసంతో అనుభూతి వచనకావ్యంగా దర్శనమిస్తుంది ఈ చార్‌ధామ్‌యాత్ర.
భారతదేశం పుణ్య ప్రదేశం. అణువణువు ఆధ్యాత్మిక, ఐతిహాసిక, చారిత్రకాది అనేక విశేషాల సమాహారం. అఖండ భారతంలో ఎన్నో యాత్రాస్థలాలు. వాటిలో చార్‌ధామ్‌ యాత్ర ప్రాశస్త్యం తెలిసిందే. హిమాలయ పాదపీఠాల్లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ అనే వాటిని చార్‌ధామ్‌ అంటారు. ఇక్కడికి చేసే యాత్రనే చార్‌ ధామ్‌యాత్ర. ప్రకృతి ప్రేమికులు, తమ స్థాయిలో చేయాలనుకునే సాహస యాత్రికులు, విశేషించి భక్తులు ఈ యాత్ర తమ జీవితసార్థకతకు ప్రమాణంగా భావిస్తారు. ఈ రచయితలో ప్రకృతి ప్రేమికుడు, సాహసికుడు, భక్తుడు దాగి ఉన్నారు. భక్తి అనేది అతనిలోని అంతర్వాహిని.
కుడివైపు ఆకాశాన్ని తాకే కొండలు. ఎడమవైపు అగాథపు లోయల్లో ప్రవహిస్తున్న యమున. భూమి గుండెలను ఒరుసుకుంటూ మృదంగ ధ్వనుల సవ్వడులతో అంతరాంతరాల కవితావేశాన్ని తట్టి లేపుతున్నాయి. కొండలు ఏ మునులచేతనో శపించబడిన గంధర్వుల్లా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. యమున దిగువకు. మేము ఎగువకు. యమున మెలికలు తిరిగిన త్రాచులా మెల్లగా నడుస్తుంది…. కన్నుమూస్తే లోయలు. కన్ను తెరిస్తే లోయలు… జీవితపు లోతుల్లోకి తొంగిచూస్తున్నట్లున్నాయని ప్రకృతిలో భాగమైన పర్వతాల నిమ్నోన్నతాలను జీవితంతో పోల్చి చూపడం, ప్రకృతి ప్రేమికుడిగా పారవశ్యం చెందడం రచయిత వైవిధ్య విషయప్రదర్శనం, వర్ణనా నైపుణ్యం ఏక కాలంలో విసరడం ఆశ్చర్యపరుస్తుంది. ఆహ్లాదాన్నిస్తుంది.
తీర్థయాత్రలు, విహారయాత్రల ప్రయోజనాలు వేరు వేరు. పుణ్యం పురుషార్థం ఆశించి చేసేవి తీర్థయాత్రలు. ఇవి సతీసమేతంగా చేయటం భారతీయ సనాతనధర్మ సంప్రదాయం. మానవ జీవితమే ఒక యాత్ర. ఈ యాత్రకు పారమార్థిక యాత్ర తోడైతేనే సమగ్రం. ఇంతటి విశిష్ట యాత్ర తన సహధర్మచారిణి, బంధుమిత్రులతో చేయడం రచయిత ధార్మిక, పారమార్థిక జీవనానికి ఉదాహరణ. వీరు శంషాబాద్‌ విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి ప్రైవేటు ట్రావెల్సు ద్వారా అక్షరధామ్‌ మొదలుకొని హరిద్వార్‌, యమునోత్రి, ఉత్తర కాశి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదిరీనాథ్‌ల మీదుగా యాత్ర కొనసాగింది. మార్గమధ్యంలో తపకేశ్వరం, పంచ ప్రయోగలు, గుప్తకాశి, గౌరీకుండ్‌ మొదలైన పవిత్రక్షేత్రాలను, తెహ్రీడ్యాం, కుతుబ్‌మినార్‌ లాంటి ఎన్నో సందర్శనీయ స్థలాలను ఈ యాత్రాచరిత్రలో పేర్కొనడంతో పాటు అతని మనసులో కలిగిన అనుభూతులను వర్ణనాత్మకంగా అక్షర బద్దం చేశారు. రచయిత ప్రతీ దృశ్యాన్ని ప్రకృతిరామణీయ తను, స్థల చరిత్రలను చక్కని శైలితో అక్షరీకరించటం ఈ రచనా స్థాయిని పెంచిందనవచ్చు.
హిమాలయ పర్వత సానువుల్లోని రమణీయప్రాకృతిక దృశ్యాలు రచయితలోని భావుకుణ్ణి, కవిని నిద్రలేపాయి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశంలో తేలియాడే మబ్బులను చూసి కాళిదాసును, అతని మేఘసందేశాన్ని గుర్తుచేసుకుంటాడు. ఒకచోట బస్సు ఆగినప్పుడు మందాకిని నీటిని తాకాలన్న తహతహతో లోయలోకి దిగుతుంటే అతని సహయాత్రికులు అనుసరించిన సందర్భాన్ని నా వెంట వైకుంఠమే కదిలింది అన్న భావావేశానికి లోనవుతాడు. రచనలో సందర్భానుసారంగా ఎక్కడలేరె సమీప్సిత దాతలు… (హరవిలాసం – శ్రీనాథుడు), పురాకవీనాం గణన ప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసు…, సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్‌ చేదోయి సంధింపడే… (భాగవతం – పోతన), అటజని కాంచె భూమిసురుడంబర చుంబి…. (మనుచరిత్ర – అల్లసాని పెద్దన)… ఇలా ఎన్నో ప్రసిద్ధ కావ్యాల నుండి సమయానుకూలంగా సందర్భశుద్ధితో పద్యాలు, శ్లోకాలు ఉట్టంకించడం ఈ రచనకు వన్నె తెచ్చిన అంశాలు. ఆచార్య సి.నా.రె., డా. ఎన్‌. గోపిలాంటి ఆధు నిక కవుల కవితాపంక్తులను కూడా సందర్భానుసారం ఉపయోగించుకోవడం ఆధునిక సాహిత్యం పట్ల రచయితకు గల పట్టును పట్టిస్తుంది.
కేదార్‌నాథ్‌ను చేరుకున్నప్పుడు అది ఏమి దారి! ఏమా అద్భుతం! ఎంత మనోజ్ఞత! భక్తులంతా బారులుకట్టి స్వర్గారోహణం చేస్తున్నారా! అన్నట్లున్నదా సుందర దృశ్యం. అసంఖ్యాక గుర్రాల మెడల్లో ఉన్న కంచుగంటల శబ్దం, అలకనాందానది మద్దెల చప్పుడు రెండూ కలిసి సంగీత జుగల్‌బందీలా చెవులకింపుగా రససామ్రాజ్యంలోకి తీసుకెళుతుంది ఇదే ఒరవడితో ప్రతి సందర్భాన్ని, స్థలవిశేషాల్ని, అనుభూతి పరంపరను వర్ణించడం ఇందలి విశేషం. గద్యం కవీనాం నికషం వదన్తి అన్న ప్రసిద్ధోక్తికి ఉదాహరణప్రాయం ఈ రచన. అందంగా గద్యం రాయడంలో సిద్ధహస్తుడని పద్మాచారి మొదటి రచనతోనే నిరూపించుకున్నారు. రచయిత తన కంటిలోని మెరుపును, గుండెలోని తడిని సమ్మిళితం చేసి రాయగల నేర్పరి. దానికి నిదర్శనం ఈ రచనలోని అనేక వాక్యాల్లో కొన్ని. వాటిని కవితా పంక్తులుగా పేర్చితే…
కాలం
బస్సుచక్రాల కింద నలిగి
ముందుకు సాగింది.
రాజకీయపు మాటల్లోపడి
సమయం కర్పూరమైంది

- Advertisement -

జగద్గురు ఆదిశంకరుని
పాదస్పర్శచే పులకించిన
రాంబారా ఏది తల్లీ!
ఎక్కడ తల్లీ?
నిరుడు విరిసిన సుమసమూహములు (పుట : 78)
ముప్పయేళ్ళ క్రితమే ఆకాశవాణి, హైద్రాబాద్‌, వివిధ పత్రికల ద్వారా తన కవిత్వపు రుచిని శ్రోతలకు, పాఠకులకు చూపించిన కవి. అజ్ఞాతం వీడిన అర్జున విహారంలా ఈ చార్‌ధామ్‌ యాత్రా రచనతో మనముందుకు వచ్చాడు.
కన్ను తెరిస్తే లోయలు, కన్నుమూస్తే లోయలు. మానవ జీవితపు లోతుల్లోకి తొంగిచూస్తున్న భ్రమలు అంటూ మనిషి జీవితం చుట్టూ ఆవరించిన మార్మికమైన తాత్త్విక జీవన అగాథాల చింతన చేస్తాడు. ఈ చింతనతోనే ఆగిపోకుండా చలనం ద్వారా మనసులో ఉద్భవించిన అనుకూల ఆలోచనా తరంగాలు మనిషికి ఒక తాత్త్విక సాంత్వన చేకూరుస్తాయి అని ముందుమాటలో సుప్రసిద్ధ విమర్శకులు, ఉస్మానియ విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డా.ఎస్‌. రఘు గారి ప్రశంసాత్మక వాక్యాలు ఈ రచనలోని భావసాంద్రతను, భావోద్విగ్నతల సమాహారాన్ని తెలుపుతాయి.
ఈ యాత్రారచనలో ప్రదేశాలు, క్షేత్రాల పేర్లు, పుట్టు పూర్వోత్తరాలు, వాటి ప్రత్యేకతలు సందర్భానుసారంగా వివరించడంలో రచయిత చారిత్రక, సాహిత్య అవగాహన కలవాడని నిరూపణ అయిందని తెలుగులో యాత్రా చరిత్రలు అన్న అంశంపై తొలి పరిశోధన చేసిన డా. మచ్చ హరిదాసు గారు చేసి తీర్మాణం అక్షరసత్యం. ఇంతటి గంగోధృతి లాంటి భావనాఝరిలో తేలియాడుతున్న పద్మాచారి బ్రహ్మకపాలం దగ్గర క్షేత్రం పేరు తెలుగులో రాసి వుండడమన్న గమనింపు ఇతని సూక్ష్మ పరిశీలనా దృష్టిని పట్టిస్తుంది. ఇక్కడ తన తల్లిదండ్రులతో పాటుగా వారి వంశంలోని కీర్తిశేషులకు, కీర్తిశేషులైన బంధుమిత్రులకు, వారి తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి అపర భగీరథుడిలా వారికి ఉత్తమగతులకై చేసిన కర్మ ఇతని ధార్మిక దృష్టిని, కర్తవ్యనిష్టను తెలుపుతుంది. ఈ రచన చదివిన ప్రతివారు స్థాయీ భేదాలు మరిచి రచయితతో సహానుభూతి పొందడంతో పాటు ఈ యాత్రకై సిద్ధపడడం తథ్యం. పఠితలను యాత్రోన్ముఖులను చేయగల శక్తిమంతమైన రచన ఆధ్యాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర. ఈ రచనను తన సహాధ్యాయి, ప్రాణమిత్రుడు కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీ గాజుల శ్యాంప్రసాద్‌ గారికి అంకితమివ్వడం స్నేహానికిచ్చిన కానుకగా భావించవచ్చు.
కాశ్మీర దీపకళిక స్ఫూర్తితో, పలు యాత్రా కథనాల ప్రభావంతో తాదాత్మ్య స్థితిలో ప్రయాణించడమే కాక, ఆ జ్ఞాపకాలను చెదిరిపోనీయకుండా ఆలంకారిక పరిభాషలో ఒక సమాధి స్థాయికి చేరుకొని ఈ యాత్రా చరిత్రను అక్ష రీకరించాడు అని కితాబిచ్చిన డా మచ్చ హరిదాసు మాట ల్లోని సత్యం ఈ పుస్తకం చదివితేనే అనుభవంలోకి వస్తుంది. ఈ రచన ఆ ప్రదేశాలు చూడని వారికి పరోక్ష ప్రదేశాల ప్రత్యక్షానుభూతి కానుక. చూసిన వారికి అందమైన అనుభవాల, జ్ఞాపకాల మంజూష. పద్మాచారి కలం నుండి మరో రచన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసే రచన ఇది.
(మూల్యం : రూ. 150/-, ప్రతులకు : శ్రీమతి కె. మంజుల, సెల్‌ : 9885587783 )

  • దాసోజు జ్ఞానేశ్వర్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News