ఆకాశవాణి పట్ల బాగాఆదరణ, అభిమానం ఉన్న రోజుల్లో ‘గణపతి’ అనే హాస్యభరిత నాటకాన్ని విననివారుండరు. ఆసాంతం హాస్యాన్ని పండించే ఈ నాటకంలో ప్రతి పాత్రా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈనాటకాన్ని రాసినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. తెలుగులో అద్భుతమైన హాస్య నాటకాలను రాయడమే కాకుండా నవలలు, కథలు ఇతర సాహితీ ప్రక్రియలను కూడా సృజించిన చిలకమర్తి లక్ష్మీనరసింహం సాంఘిక సంస్కరణల్లో కూడా ముందున్న వ్యక్తి. ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అడుగుజాడల్లో మూఢాచారాలకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సాహితీవేత్త. బాలికలకు తప్పనిసరిగా విద్య ఉండాలని, మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్ద పీట వేయాలని, మహిళాభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గట్టిగా పోరాడిన వ్యక్తి చిలకమర్తి. 1909 ప్రాంతంలో ఆయన రాసిన ‘గయోపాఖ్యానం’, ఆ తర్వాత 1920లో ఆయన రాసిన ‘గణపతి’ నాటకాలను మరచిపోవడమనేది దుస్సాధ్యమైన విషయం. గయోపాఖ్యానంలోని పద్యాలు ఆంధ్రుల నోట ఇప్పటికీ నానుతూ ఉంటాయి.
ఆయనకు చిన్నప్పటి నుంచీ దృష్టి లోపం ఉండేది. ఆ తర్వాత అది పెరిగి పెద్దదయి, ఆయనను పూర్తిగా అంధుడిని చేసింది. అంధత్వం సంక్రమించేనాటికి ఆయన గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవిల్లి గ్రామంలో 1967 సెప్టెంబర్ 26న పుట్టిన చిలకమర్తి 1946 జూన్ 17న కన్నుమూశారు.పుట్టినప్పుడు ఆయన పేరు పున్నయ్య కానీ, అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి పేరును ఆయన పెట్టుకోవడం జరిగింది. కళ్లు పోయినప్పటికీ ఆయన రాజమండ్రిలోని ఆర్ట్ కళాశాలలో ఆయన అధ్యాపకుడుగా పనిచేశారు. ఆయన తన మావయ్య కుమార్తె అయిన పున్నమ్మను వివాహంచేసుకున్నారు కానీ, ఆమె ఒక శిశువును ప్రసవించి కన్నుమూయడం జరిగింది. మొదటి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొంటూ వచ్చిన చిలకమర్తి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, అప్పటి నుంచి ఖద్దరు దుస్తులు ధరించడం ప్రారంభించారు.
మొదట్లో ఆయనకు రేచీకటి మాత్రమే ఉండేది. ఆయన రాత్రిళ్లు చదవడం, రాయడం చేతనయ్యేది కాదు. ఆయనకు మొదటి నుంచి పద్యాలను శ్రావ్యంగా చదవడం అలవాటుగా ఉండేది. అయిదవ ఏట నుంచి ఆయన పద్యాలను కంఠతా పాడుతూ, శ్రావ్యంగా చదివేవారు. ఆయనకు సరిగ్గా కనిపించకపోయినా ఆయన అనేక పద్య కావ్యాలను, పురాణాలను విని, తన పాండితీ ప్రకర్షను పెంచుకున్నారు. ఒక పక్క వీరేశలింగం తన సంస్కరణలతో క్షణం తీరిక లేని పరిస్థితిలో ఉన్నట్టుగానే, చిలకమర్తి కూడా సంఘ సంస్కరణలతో, మరొకపక్క సాహితీ సంబంధమైన రచనలు, పరిశోధనలతో బాగా బిజీగా ఉండేవారు. కళ్లు కనిపించకపోయినా, ఆయన తన సంస్కరణాభిలాషను, సాహిత్యాభిలాషను ఒక్క క్షణం కూడావదిలి పెట్టి ఉండలేదు. 1889లో ‘కీచక వధ’ అనే నాటకంతో సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టిన చిలకమర్తి, 1946లో ‘బమ్మెర పోతన’ అనే అసంపూర్తి నాటకంతో ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ‘హరిశ్చంద్ర’ అనే మరో నాటకాన్ని కూడా ఆయన అసంపూర్తిగానే వదిలిపెట్టడం జరిగింది.
ఆయన కొన్ని గద్య కావ్యాలను కూడా రాశారు. పద్యాలు, నాటకాలు, కథలు, ప్రహసనాలు, నవలలు, శతకాలు, జీవిత కథలు, చివరికి ఆత్మకథ వగైరాలన్నీ కూడా ఎంతగానో జనాదరణకు నోచుకున్నాయి. వాల్మీకి రామాయణాన్ని సంక్షిప్తంగా రాయడం కూడా జరిగింది. సభలో, సమావేశాలో జరిగినప్పుడు ఆయన తప్పనిసరిగా తన పద్యాలను ఆలపించడం జరిగేది. ఆయన నాటకాలను ప్రదర్శించని ఊరు ఆంధ్రనాట మచ్చుకైనా కనిపించదు. ఆయన నాటక ప్రదర్శనల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఆయన కొన్ని నాటకాలను సంస్కృతం నుంచి కూడా తీసుకున్నారు. ఆయన సొంతగా రాసిన నాటకాల్లో ఎక్కువగా సాంఘిక సంస్కరణలు కనిపించేవి. ఇక సామాజిక ఇతివృత్తాలతోనూ, పౌరాణిక ఇతివృత్తాలతోనూ ఆయన కొన్ని నవలలు రాశారు. నాలుగు నెలల కాలంలో ఆయన రాసుకున్న ఆత్మకథ “స్వీయ చరిత్రము’ అనేక విధాలుగా రికార్డు సృష్టించింది. ఈ గ్రంథం ఎన్ని వేల ప్రతులు అమ్ముడుపోయిందో లెక్క లేదు. తెలుగు నాట ఆయనకు విపరీతంగా జనాదరణ పెంచిన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ఇది అనేక రికార్డులను సృష్టించింది. అంధత్వం వల్ల ఆయన పుస్తకాలను తిరగేయడానికి, తన వ్యక్తిగత రికార్డులను చూసుకోవడానికి అవకాశం లేనందువల్ల ఆయన పూర్తిగా తన జ్ఞాపకాల నుంచే తన జీవిత విశేషాలను తీసుకుని ఈ ఆత్మకథను రాయడం జరిగింది. అయినప్పటికీ, అందులోని విశేషాలతో పాటు, ఆయన తెలుగు మాధుర్యానికి పరవశించిపోయి వేలాది మంది ఆయన ఆత్మకథను పదిలపరచుకోవడం జరిగింది.
జి. రాజశుక