ప్రమాదకర ఉద్యోగాల్లో పిల్లలతో పనిచేయించడాన్ని నిషేధిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 24ను ప్రవేశ పెట్టి 75 ఏళ్లు దాటినప్పటికీ, బాలలకు విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ రెండు దశాబ్దాల క్రితం చట్టాలను రూపొందించినప్పటికీ ఇప్పటికీ పిల్లలతో పని చేయించుకోవడమన్నది కొనసాగుతూనే ఉంది. ఈ రెండు ప్రాథమిక హక్కులను అనుభవించడానికి పిల్లలు నోచుకోవడం లేదు. ఒక సమగ్ర సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికీ కోటి మందికి పైగా బాల కార్మికులున్నారు. సుమారు 4.30 కోట్ల మంది పిల్లలకు విద్యావకాశాలు అందడం లేదు. పిల్లలతో పనిచేయించుకోవడమన్నది ఏ గ్రామీణ ప్రాంతాలకో పరిమితం అవుతోందనుకుంటే పొరపాటే. దేశ రాజధాని ఢిల్లీతో సహా దాదాపు ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ బాల కార్మికులు పని చేయడమన్నది కనిపిస్తూనే ఉంది. ఇళ్లల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, దుకాణాల్లో వేలాది మంది 14 ఏళ్ల లోపు పిల్లలు పని పేరుతో, ఉపాధి పేరుతో చిత్రహింసలు అనుభవిస్తూనే ఉన్నారు. దేశంలో బాల కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.
ఇళ్లల్లో పిల్లలను పనిలో పెట్టుకోవడమన్నది అవిచ్ఛిన్నంగా జరిగిపోతూనే ఉంది. వారిని కొట్టడం, తిట్టడం, వారితో గొడ్డు చాకిరీ చేయించడం, వారికి ఆకలి వేసినా, ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టించు కోకపోవడం, వారి మీద లైంగికంగా కూడా దాడులు జరగడం, వారి ప్రాథమిక హక్కులను కాలరాయడం వంటివి జరుగుతున్నా, అటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నా పాలకులకు, రాజకీయ నాయకులకు చీమకుట్టినట్టయినా ఉండడం లేదంటే ఆశ్చర్యం, ఆవేదన కలుగుతాయి. పిల్లలయితే చౌకగా లభిస్తారని, ఎంత చాకిరీ అయినా కిమ్మనకుండా చేస్తారనే ఉద్దేశంతో వారిని గ్రామాల నుంచి, చిన్న పట్టణాల నుంచి నగరాలకు తీసుకురావడం ఎక్కువైందని తాజా నేషనల్ లేబర్ సర్వే నివేదికలో వెల్లడయింది. పేదరికాన్ని భరించలేక, ఆర్థిక సమస్యలకు తట్టుకోలేక తల్లితండ్రులు తమ పిల్లలను పనులకు పంపించడం, నగరాలకు తరలించడం జరుగుతోంది. కొందరైతే వీరిని అనేక విధాలైన అక్రమాలకు ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది. వారి ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించుకోవడం కూడా జరుగుతోంది.
పిల్లలను పనుల్లో పెట్టుకునే బదులు వారి తల్లితండ్రులను పనిలో పెట్టుకోవచ్చు కదా? పని చేయించుకుంటున్న పిల్లలకు సరైన జీతభత్యాలు ఇవ్వడం జరుగుతోందా? వారితో రోజుకు నిర్దేశిత ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయించుకుంటున్నారా? పిల్లలతో తక్కువ ఖర్చుతో ఎక్కువగా చాకిరీ చేయించుకోవచ్చన్న ఉద్దేశంతోనే వారిని పనుల్లో పెట్టుకోవడం జరుగుతోంది. వీరిని పనుల్లో పెట్టుకోవడం వల్ల తమ లాభాలు పెరుగుతాయని భావింరడం వల్ల, బాల కార్మికులకు సంబంధించిన చట్టాలు బలహీనంగా ఉన్నందువల్ల, వాటిని సరిగ్గా అమలు ఎవరూ అమలు చేయకపోవడం వల్ల కంపెనీలు, కర్మాగారాలు వీరిని ఎక్కువ సంఖ్యలో పనుల్లో పెట్టుకోవడం జరుగుతోంది. మొత్తం మీద ఇటువంటి ధోరణి ఒక వ్యవస్థీ కృత నేరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. బాల కార్మికులతో పని చేయిస్తున్నందుకు ఇంత వరకూ చట్టప్రకారం శిక్ష పడినవారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
పిల్లల హక్కులను కాపాడే వ్యవస్థగా ప్రభుత్వం బాల కార్మికుల విషయంలో ఒక జాతీయ విధానాన్ని రూపొందించడం మంచిది. పిల్లలను పనుల్లో పెట్టుకునే సంస్థల విషయంలో ప్రభుత్వాలు ఏమాత్రం దయాదాక్షిణ్యాలతో వ్యవహరించవలసిన అవసరం లేదు. పిల్లలను ఉద్యోగాల నుంచి తప్పించి వారికి పునారావాస పరిహారంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 20,000 ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని లక్ష రూపాయలకు పెంచడం మంచిది. గ్రామాల నుంచి పిల్లలను పనుల నిమిత్తం పట్టణాలు, నగరాలకు తరలించకుండా గ్రామ పంచాయతీలతో నిఘా ఉంచాలి. అంతేకాక, 2025 నాటికి దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సి ఉంటుంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం చాలా అవసరం.
కష్టాల కడలిలో బాల కార్మికులు
నాగరికతతో పాటు పెరుగుతున్న బాల కార్మికులు