Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Children literature is important: బాల సాహిత్యాన్ని బతికించుకోవాలె

Children literature is important: బాల సాహిత్యాన్ని బతికించుకోవాలె

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి సౌజన్యంతో మాతృమూర్తి శ్రీమతి కోడూరు శాంతమ్మ స్మారక బాల సాహిత్య సమ్మేళనం రెండు రోజుల పాటు హైదరాబాదులో జరిగింది. రెండు తెలుగు ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బాల సాహితీ వేత్తలు, రచయితలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. వక్తలు విభిన్న అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. బాల సాహిత్యం తీరుతెన్నులు, వివిధ పోకడలు, జరుగుతున్న పరిణామాలు, కాలాను గుణమైన మార్పులు మొదలైన అంశాలపై పెద్ద ఎత్తున చర్చించి అటు బాలలకు, ఇటు బాల సాహితీ వ్యక్తులకు ఒక దిశా నిర్దేశం చేయడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాలను,ఆచార వ్యవహారా లను వారసత్వంగా అందించేందుకు బాల సాహిత్యమే కీలకమని గ్రహించడం జరిగింది.
హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రాంగణంలో వున్న డాక్టర్‌ దేవులపల్లి రామానుజారావు కళామందిరంలో రెండు రోజుల పాటు పండుగ వాతావరణం కనిపించింది. సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాంతా- వసంతా ట్రస్ట్‌ అధ్యక్షులు, పద్మభూషణ్‌ గౌరవ డాక్టర్‌ వరప్రసాద రెడ్డి రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు బాల సాహిత్యం బాలలకు ఎంతో కీలకమని అన్నారు. బాల సాహిత్యం బాలకు చేరువ అయినప్పుడే ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు ఎలాంటి పౌరులుగా తయారవుతారనేది పెద్ద సవాలుగా మారిందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మ భాషను ఆదరిస్తూనే అవసరం కోసం అన్య భాష ఆంగ్లాన్ని నేర్చు కోవడంలో తప్పు లేదన్నారు. మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఎన్నికలలో రాజకీయ నాయకులు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే తరాలకు బాల సాహిత్యం మంచి విలువలు నేర్పాలని, దానికిగాను తన ఆర్థిక సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తానని తెలియజేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి మాట్లాడుతూ సమాజంలోని మంచి చెడులను చెప్పేది కవులు, రచయితలేనని వారు తమ కలాలకు పదును పెట్టి అక్షర బాణాలను ఎక్కుపెట్టాలని అన్నారు. నాణ్యమైన బాల సాహిత్యాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేటి బాలలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలియజేసే విభిన్న ప్రక్రియలకు బాల సాహిత్యంలో చోటు కల్పించాలని, బాల సాహిత్యం యొక్క ప్రయోజనాలను విడమర్చి సమాజానికి తెలి యజేయాలని అందుకు ప్రభుత్వ బడులే తావులుగా, ఉపాధ్యాయులే మార్గదర్శకు లుగా మారాలని సూచించారు. ఇప్పటికే బాల సాహిత్యం రాశిలోనూ పెరిగిందని, నాణ్యత లోను మరింతగా పెరగాలని, అందుకోసం బాలసాహిత్యం రాస్తున్న బాల సాహితీవేత్తలను, రచయితలను మరింతగా ప్రభుత్వం ప్రోత్సహించాలని అభి ప్రాయపడ్డారు. గౌరవ అతిథిగా పాల్గొన్న గరిపెల్లి అశోక్‌ రెండు రోజుల బాల సాహిత్య వర్క్‌ షాప్‌ సమావేశాన్ని తగిన సమన్వయంతో నిర్వహించడంలో కీలక పాత్ర వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే బాలల కోసం సారస్వత పరిషత్‌ రూపొందించిన ‘భాషా సాహిత్య వైభవం’, ‘ఆరోగ్యం- విజ్ఞానం‘, ‘పిల్లల కథలు’ (1,2,3,45) ఐదు భాగాలు గల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ సమా వేశంలో పరిషత్తు కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య, చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, అమరవాది నీరజ పాల్గొన్నారు.
మొదటి రోజు మొదటి సదస్సులో ‘బడిలో తెలుగు భాష’ అనే అంశంపై ప్రముఖ బాలసాహితీవేత్త డాక్టర్‌ వి. ఆర్‌.శర్మ అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్‌ దాసరి వెంకట రమణ విశిష్ట అతిథిగా పాల్గొని అనతి కాలంలోనే మాతృభాష అయిన తెలుగు మృతభాష అవుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నదని అందుకుగాను భాషాభిమా నులు మేల్కొని మాతృభాషను కాపాడుకోవాలని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖులు బడిలో తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తూ తమ తమ అభిప్రాయాలను సవివరంగా చర్చించారు. అమెరికా లాంటి దేశాలలో పాఠ శాలల్లో పిల్లలు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అదే మన పాఠ శాలలో కథల పుస్తకాలు ఇస్తే చించి వేస్తారనే అభిప్రాయం ఉండడం వల్లే కనీసం గ్రంథాలయంలోని పుస్తకాలను తెరవడం లేదని తెలిపారు. అలాంటి అభిప్రాయా లను తమ తమ మెదళ్ల నుండి తొలగించుకోవాలని బడుల్లో మాతృభాషా ఔన్నత్యా నికి, స్థిరత్వానికి గట్టిగా పునాదులు పడాలని ఉపాధ్యాయులు సమన్వయంతో అమ్మ భాషను కాపాడుకునే విధంగా ప్రయత్నాలు జరగాలని సూచించారు. నేటి తరం పిల్లలలో ఉన్న మానసిక రుగ్మతలకు బాల సాహిత్యం ఒక అరకు కావాలని అదంతా అమ్మ భాష తెలుగు ద్వారానే సాధ్యమని ’నోమ్‌ చోమ్‌ స్కీ ’అనే ప్రముఖ విద్యావేత్త చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. డాక్టర్‌ ఉప్పల పద్మ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో కూకట్ల తిరుపతి, గోపగాని రవీందర్‌, పుల్లా రామాంజనేయులు, గోపగాని రవీందర్‌, సయ్యద్‌ షఫీ, బాల బోయిన రమాదేవి, గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ, బద్రి కుర్మారావు, కొండూరు పోతన, అక్షరం ప్రభాకర్‌, చక్రవర్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రెండవ సదస్సు నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవదాస్‌ అధ్యక్షతన ‘పత్రికలు- బాల సాహిత్యం ‘ అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది . ఈ సందర్భంగా దేవదాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నేటి నిజం పత్రిక పూర్తి పేజీని బాల సాహిత్యం కోసం ప్రతి బుధవారం కేటాయించిందని తెలియ జేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న బాల చెలిమి సంపాదకులు మణికొండ వేద కుమార్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికలు బాల సాహిత్యానికి చేస్తున్న కృషిని కొనియాడారు. పత్రికలు కొంతవరకు నష్టపోతున్నప్పటికీ పిల్లల మీద ఉన్న ప్రేమతో సమాజ మార్పు కోసం పనిచేస్తున్నాయని, బాల సాహిత్యంలో వివిధ ప్రక్రియలు రాస్తున్న కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ బాల సాహిత్యాన్ని ముందుకు నడిపిస్తూ బాలలకు చేరువయ్యేలా తపనతో పని చేస్తున్నామని తెలిపారు. పిల్లలు, పెద్దలు రాసిన అంశాలతో బాల చెలిమి పిల్లల పత్రికలను మళ్ళీ తీసుకు వచ్చామని అన్నారు. ఈ చర్చా గోష్టిలో పాల్గొన్న వివిధ పత్రికల సంపాదకులు ఆయా పత్రికలలో బాల సాహిత్యం కోసం ఏ విధంగా కృషి జరుగుతుందో సవివ రంగా తెలిపారు. నేడు పత్రికలు చాలా ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్నాయని అయినప్పటికీ బాలలను ప్రోత్సహించే ఉద్దేశంతో బాల సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. రాబోవు రోజులలో ఆన్లైన్లోనే చూడవలసి వస్తుందని తెలిపారు. బాల సాహిత్య పత్రికలను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని ఆర్థిక సహకారం అందించాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రముఖ బాలసాహితీ వేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహ రించిన ఈ సమావేశంలో విపుల, చతుర పూర్వ సంపాదకులు కంతేటి చంద్ర ప్రతాప్‌, మొలక సంపాదకులు వేదాంత సూరి, చెకుముకి నిర్వాహకులు రాజా, సాహితీ కిరణం బాధ్యులు పొత్తూరి సుబ్బారావు, బాలల నేస్తం సంపాదకులు డాక్టర్‌ నెమిలేటి కిట్టన్న, గడుగ్గాయి పత్రికా నిర్వాహకులు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మూడవ సదస్సు డాక్టర్‌ చొక్కాపు వెంకటరమణ అధ్యక్షతన ‘కథ చెప్పే కళ’ అనే అంశంపై చర్చ గోష్టి జరిగింది. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ కథలు ఏ విధంగా చెప్పాలో, కథలు చెప్పేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, కథను ఎలా చెబితే పిల్లలు వింటారో అనే అంశాలపై అనేక మెళుకువలు అందించారు. ఇందులో పాల్గొన్న డాక్టర్‌ ఎం హరి కిషన్‌ ఒక కథను ఉదాహరణకు తీసుకుని చెప్పారు. ఎన్న వెళ్లి రాజమౌళి మరో కథను కూడా ఉదా హరించారు. కథలు చెప్పడంలో మొదటగా తమకు ఆసక్తి ఉండాలని కథలు చెప్పే టప్పుడు హావ భావాలను ప్రదర్శించాలని సన్ని వేషాలకు తగ్గట్టుగా కథలు బోధిం చాలని, పిల్లలను కథల వైపు దృష్టి పడేలా చూడాలని అన్నారు. ఈ సదస్సులో సమ్మెట ఉమాదేవి, మనోజ, దివ్య, పద్మ, ప్రమీల, కృష్ణ చైతన్య, సుబ్రహ్మణ్యం, తది తరులు కథలు చెప్పె విధానం పై మాట్లాడారు.
రెండవ రోజున నాలుగో సదస్సులో ‘లలిత కళా పరిచయం’ అంశంపై బాల వికాస కారులు శాంతారావు అధ్యక్షతన జరిగింది. శాంతారావు మాట్లాడుతూ పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి లలిత కళలు కూడా ఎంతో దోహదపడతాయని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి డాక్టర్‌ జి. అమృతలత పిల్లల సంపూర్ణ మూర్తిమత్వానికి చతుషష్టి కళలు ఎంతో ఉపయోగ మని, కానీ తల్లిదండ్రులలో కళల పట్ల పెద్దగా శ్రద్ధ లేదని అందుకుగాను తల్లి దండ్రులు, సమాజం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు.
అనంతరం సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పం, జానపద కళలు పిల్లల మనోవికాసానికి ఏ విధంగా దోహదపడతాయో సవివరంగా తెలిపారు. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు ఈ కళల పట్ల ఆసక్తి ఎట్లా కలిగించాలో అందుకుగాను ఉపాధ్యాయులు చేయవలసిన బాధ్యతలు ఏమిటో అనే మొదలైన అంశాలపై తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాడభూషిణి రాజ్యలక్ష్మి, ప్రముఖ నర్తకి కోకా విజయలక్ష్మి, ప్రముఖు రంగస్థలం నటులు, దర్శకులు బీచ రాజు శ్రీధర్‌, ప్రముఖ చిత్రకారులు జె. వెంకటేశ్వర్లు, జానపద కళాకారులు గజవెల్లి ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా అధ్యాప కులు, కళాకారులు కోకిల నాగరాజు వ్యవహరించారు.
అనంతరం జరిగిన ఐదవ సదస్సులో ‘ బాల సాహిత్యం -ప్రమాణాలు ‘ అనే అంశంపై చర్చా గోష్టి ప్రముఖ బాలసాహితీ వేత్త శ్రీమతి ముంజలూరి కృష్ణకు మారి అధ్యక్షతన జరిగింది. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీమతి మాడభూషి లలితా దేవి మాట్లాడుతూ బాల సాహిత్యం అంటే ఏమిటి? బాల సాహిత్యానికి ఉండవ లసిన ప్రమాణాలు ఏమిటి? వంటి అంశాలపై మాట్లాడారు.. ఇందులో పాల్గొన్న ప్రముఖ వక్తలు మాట్లాడుతూ బాల సాహిత్యంలో పాటించవలసిన నియమాలు, వస్తువు, విషయం , రాశి వాసి, ఎలా ఉండాలి అనే అంశంపై విస్తృతంగా చర్చిం చారు. ఏది బాల సాహిత్యం అనడానికి బాలలకు ఏది చేరువవుతుందో అదే బాల సాహిత్యంగా పరిగణించాలని, అదే ప్రమాణంగా పాటించాలని, మెరిసేదంతా బంగారం కానట్లు రాసేదంతా బాల సాధ్యం కాదని, కొంతమంది రచయితలు పేరు కోసం ఏదో రాస్తున్నట్లు ఉన్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. అట్లా అని ఏది పడితే అది రాయొద్దని, సున్నిత మనసులైన బాలలకు నష్టం కలిగించొద్దని హితవు పలికారు. పిల్లల స్థాయిని బట్టి ఆసక్తి కలిగించే విధంగా తగిన బొమ్మలతో కథలు, గేయాలు అనేక ప్రక్రియలు నాణ్యతతో రావాలని అందుకుగాను బాల సాహిత్య రచయితలు తగిన ప్రమాణాలు పాటించాలని తెలియజేస్తూ అనేక సూచ నలు చేశారు. ఈ సదస్సులో గంగిశెట్టి శివకుమార్‌, పుప్పాల కృష్ణమూర్తి, పైడిమర్రి రామకృష్ణ , ఉండ్రాల రాజేశం, టి.వి. రామకృష్ణ, ఆర్‌ సి కృష్ణస్వామి రాజు, డాక్టర్‌ సాగర్ల సత్తయ్య, బి వి ఎస్‌ స్వామి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్ర మానికి డాక్టర్‌ అమరవాది నీరజ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం జరిగిన ఆరో సదస్సులో ‘ బాల సాహిత్యం -గ్రంథాలయాలు ‘ అనే అంశంపై సి.ఏ ప్రసాద్‌ అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది. విశిష్ట అతిథిగా స్వచ్ఛంద గ్రంథాలయ నిర్వాహకులు శీల అవిలేను పాల్గొని మాట్లాడుతూ బాల సాహిత్యానికి గ్రంథాల యాలు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయో, భవిష్యత్తులో బాలలకు ఇంకా ఎట్లా ఉపయోగపడాలో తెలిపారు. గ్రంథాలయంలోని పుస్తకాలను బాలల కు ఎట్లా అందించాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైన అంశాలను అంది ంచారు. డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో కూచిమంచి నాగేంద్ర, పరుశరాములు, ప్రవీణ్‌ శర్మ, కందుకూరి భాస్కర్‌, రమేష్‌ వెంకటనారాయణ, సుమిత్ర దేవి, పోరెడ్డి అశోక్‌, మహేశ్వర్‌, కిరణ్‌ కుమారి, దుర్గం బైతి తదితరులు పాల్గొన్నారు.
తదుపరి చివరి ముగింపు సమావేశం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన మండలి డైరెక్టర్‌ శ్రీమతి ఎం. రాధారెడ్డి పాల్గొని మాట్లాడారు. బాల సాహిత్యంపై రెండు రోజులపాటు సారస్వత పరిషత్తు కొనసాగించిన కృషిని కొనియాడారు. బాలసాహిత్యానికి బడులలో పెద్దపీట వేయగలమని హామీ ఇచ్చారు. బాల సాహి త్యం బాలలకు మరింత చేరువ కావాలని అందుకు పాఠశాలలు ప్రధాన కేంద్రా లుగా మారాలని ఆశించారు. పాఠశాలలో ఉన్న గ్రంథాలయాలలోని పుస్తకాలు విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించాలని పుస్తక పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని కోరారు. పాఠశాలలో బాలసభలు నిర్వహించి పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయాలని అప్పుడే విజ్ఞానవంతమైన సమాజం రాగల దని అందుకు గాను బాల సాహిత్య వేత్తలు మరింత కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మోడల్‌ స్కూల్‌ సంయుక్త సంచాల కులు, రచయిత్రి పాలడుగు సరోజినీ దేవి మాట్లాడుతూ పిల్లల కోసం మంచి బాల సాహిత్యం రాస్తున్న రచయితలను అభినందించారు. బాల సాహిత్యం ద్వారానే పిల్లల్లో మార్పు వస్తుందని అందుకుగాను పాఠశాల స్థాయి నుండే బాల సాహిత్యం పట్ల మక్కువ పెరిగేలా ఉపాధ్యాయ రచయితలు తగినంత శ్రద్ధ వహించాలని కోరారు. నేను కూడా ఒక రచయితనేనని, ఒక కథ రావాలంటే ఎంత వేదన ఉం టుందో తెలుసునని అన్నారు. అనంతరం సారస్వత పరిషత్తు కార్యదర్శి డాక్టర్‌ చెన్నయ్య మాట్లాడుతూ పిల్లల కోసం రూపొందించిన పుస్తకాలు ప్రభుత్వ పాఠశా లలకు అందేలా చూడాలని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి డైరెక్టర్‌ రాధారెడ్డిని కోరారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాధారెడ్డి ఇచ్చిన హామీ కార్య శాలలో భరోసా లభించినట్లు అయింది. ఈ బాల సాహిత్య సమ్మేళనానికి రామా నుజ చారి, సత్యనారాయణ మూర్తి, సంగనభట్ల చిన రామకిష్ణయ్య, షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, లక్ష్మణరావు, వడ్డేపల్లి వెంకటేష్‌, జానకిరామ్‌ తదితరులు కూడా హాజరైనారు.
రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన బాల సాహిత్యం కార్యశాలలో నిర్వ హించిన ఆరు సదస్సులలో అనేక మంది ప్రముఖులు పాల్గొని బాల సాహిత్యం పై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సారస్వత పరిషత్‌ రూపొందించిన పుస్తకాలనే కాకుండా బాల సాహితీ వేత్తలు, రాసిన చందమామలో మేనమామ, బహుమతి, పిల్లల జాబిల్లి, బాల రత్నాలు, పసిడి మొగ్గలు , చిగురింతలు, ఆనందలహరి , శ్రీకృష్ణ శతకం , పిల్లల మనసు, బుడుగో…బుడుగో వంటివే కాకుండా పత్రిక ఎడి టర్లు రూపొందించిన బాల చెలిమి, మొలక , చెకుముకి , బాలల నేస్తం, మొదలగు అనేక పుస్తకాలను వివిధ సదస్సులలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించబడి నవి. రచయితలు రాసిన ఉత్తమ కథలకు ఏడుగురికి నగదు పురస్కారం సారస్వత పరిషత్‌ వారు అందించడం మరింత ప్రోత్సహించే విధంగా అనిపించింది. బాల సాహిత్యకారులకు ఈ వర్క్‌ షాప్‌ దిశ నిర్దేశం చేస్తూ సరైన తోవలో పయనించేలా చేసిందని చెప్పవచ్చు. ఇందులో బాలసాహిత్య రచయితలు, తమ అభిప్రాయాలను ఒకరికి ఒకరు పంచుకున్నారు. తగిన మెలకువలు తెలుసుకున్నారు. రాబోవు రోజు లలో కూడా తెలంగాణ సారస్వత పరిషత్‌ ఇటువంటి సమావేశాలు ప్రతి ఏటా నిర్వహించి బాల సాహిత్యం బాలలకు మరింతగా చేరువయ్యి మార్పులకు, విలువ లకు శ్రీకారం చుట్టుతుందని, మరింతగా భరోసా కలిగిస్తుందని మనమందరం ఆశిద్దాం.

  • కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
    9441561655
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News