Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Children literature: మాండలిక భాషలో బాలల కథలు

Children literature: మాండలిక భాషలో బాలల కథలు

వివిధ యాసల్లో బాల సాహిత్య కథలు

మన మాతృభాష తెలుగైనా అందరం ఒకేలా మాట్లాడము. ఒక మండల ప్రాంతంలో మాట్లాడే భాషను ‘మాండలికం’ అంటాము. ఒక రాష్ట్రంలోని ప్రజలందరూ ఒకేలా మాట్లాడరు. ఒకే జిల్లాలలో నివసించే ప్రజలు కూడా ఒకేలా భాషా పదాలు పలుకరు. ప్రతి వంద కిలో మీటర్లకు మాట్లాడే యాస, భాషల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
మాండలికాల్లో కథా సంపుటాలు పెద్దల కోసం వచ్చి నంతగా బాలలకోసం రాలేదు. బాలల కోసం రాయాలంటే వారి ఊహల రెక్కలను అందుకోగలగాలి. బాలల ఊహల రెక్కలు చాలా పెద్దవి. ఆ స్దాయికి రచయిత ఎదిగి రాయాలి. పైగా మాండలికంలో రాసి మెప్పించటం అంత సులువు కాదు. భాషపై పట్టు ఉండాలి. బాలల కోసం చాలా సరళంగా రాయాలి. సరళ మాండలిక పదాలు పొందికగా అమర్చగలగాలి. అప్పుడే బాలలు చదివి ఆనందించ గలుగుతారు.
తెలుగులో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో మాట్లాడే భాషను కోస్తా భాషగా, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ భాషగా, ఇక తెలంగాణ భాషగా తెలంగాణ ప్రాంతపు భాషని, కళింగాంధ్ర భాషగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని ప్రామాణికగా తీసుకోవచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా ప్రత్యేక యాసలో మాట్లాడుతారు.
రాయలసీమ మాండలికంలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘మా అమ్మ చెప్పిన కథలు’, ఉత్తరాంధ్రా మాండలికంలో బమ్మిడి సరోజినీ, జగదీశ్వర్‌ రావుల ‘అమ్మచెప్పిన కథలు’, తెలంగాణలో ‘బడి పిలగాల్ల కతలు’ ఆయా మాండలికాల్లో తొలి బాలల కథా సంకలనాలుగా పేర్కొనవచ్చు. ఐతే ఇవన్నీ పాత కథలు, అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పగా సేకరించి వాటికి తమ ప్రాంతపు మాండలిక భాషా పరిమళాలు అద్ది తిరగ రాసినవనే చెప్పాలి. తెలంగాణ నుంచి డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ వెలువరించిన ‘మాయల చిప్ప’ సంకలనంలోని కతలు, డాక్టర్‌ ఎం. హరికిషన్‌ కర్నూలు మాండలికంలో రాసిన కథలు సైతం ప్రపంచ జానపద కథలు సేకరించి వాటిని వారి శైలిలో, వారి వారి మాండలిక భాషలో బాలలకోసం తిరగ రాశారు.
తెలంగాణకు చెందిన సీనియర్‌ బాలసాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ వీరికి భిన్నంగా బాలలకోసం జంతు పాత్రలతో కథలు కొత్తగా సృష్టించి తెలంగాణ భాషలో ప్రచురించిన బాలల కథల సంపుటి ‘జోర్దార్‌ కతలు’.
తెలంగాణ భాషలో అలవోకగా మిళితమయ్యే ఉర్దూ పదాలు జన వ్యవహారంలో కనిపిస్తూ ఉంటాయి. నారాజ్‌, షాది, దావత్‌, పరేషాన్‌, మస్త్‌, ఇజ్జత్‌, గలీజ్‌, జంగల్‌, గరం, సమజ్‌, ఖాయిష్‌, జల్దీ వంటి ఉర్దూ పదాలను పైడిమర్రి రామకృష్ణ తమ కథల్లో సందర్భానుసారం అలవోకగా ప్రయోగించారు. ఇక తెలంగాణ భాషలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే సోపతి, ఇగురం, బొక్కలు, యాది, బువ్వ, పాయిరంగ, లబ్బ లబ్బ మొత్తుకునుడు, బీరి పోవుడు, కమాయించుడు, పిస్స మొదలైన పదాలు ఈ కథల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇదే కోవలో తెలంగాణ నుంచి గరిపెల్లి అశోక్‌ రాసిన ‘బడిబువ్వ’ కతలు, ‘ఎంకటి కతలు’ కథా సంపుటాలు కూడా బాలల కోసం తెలంగాణ జీవితాన్ని చిత్రించి సరళమాండలికంలో రాసిన కథలుగా చెప్పుకోవచ్చు. తన బాల్యాన్ని కథల ద్వారా ఆవిష్కరించి చిత్తూరు మాండలికంలో ఆర్‌.సి.కృష్ణ స్వామి రాజు రాసిన ’కిష్టడి కతలు’ కూడా ఈ కోవకు చెందినవే. ఇటీవల ఆయా ప్రాంతాల బాలసాహితీవేత్తలు తమ ప్రాంత తెలుగు భాషలో రచనలు చేస్తుండటం వలన వినూత్న బాల సాహిత్యం వెలుగులోకి వస్తూంది.ఇక తమిళనాడు సవి హద్దు ప్రాంతం నుండి డాక్టర్‌ సగిలి సుధారాణి సేకరించి ముద్రించిన కథల సంపుటి తమిళనాట తెలుగునుడి పల్లెకతలు. తమిళనాట తెలుగు ప్రజలు వాడే తెలుగు భాష నుండి ఇది వేరుగా, భిన్నంగా కనిపిస్తుంది. ఈ కథలు చాలా వరకు చిన్న తనంలో మనం విన్న బాలల జానపద కథలే. ఆ కథల్ని తమిళనాడులో నివసించే తెలుగువారు మాట్లాడే మాండలికంలో ఉండటం విశేషం. చేయి తిరిగిన బాల సాహితీవేత్తల తమ ప్రాంత మాండలికంలో కథలు రాయటం ఎంతో అవసరం ఉంది. దీని వలన ఒక ప్రాం\ తం బాలలకు మరో ప్రాంత భాషా పదాలు తెలుసుకోవటానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఇలా కథలు చదవటం వలన సరికొత్త అనుభూతి పొందుతారనటంలో ఎటువంటి సందేహం లేదు.

  • తేజశ్రీ
    89197 73272
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News