Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Children literature: బాలలకు అర్థమయ్యే చిట్టి చిట్టి పదాలతో బాల గేయ రచన సాగాలి

Children literature: బాలలకు అర్థమయ్యే చిట్టి చిట్టి పదాలతో బాల గేయ రచన సాగాలి

మొదటితరం నుండి నేటి మూడోతరం బాలసాహితీవేత్తలతో కలిసి పని చేసిన వారు చాలా కొద్దిమందే ఉన్నారు. అలా కలిసి నడిచిన వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత, బాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావు ఒకరు.
అలపర్తి ఇంకా నేటి యువ బాలసాహితీవేత్తలతో పోటీపడి రాస్తూనే ఉన్నారు.ముఖ్యంగా బాలగేయ రచనల్లో అలపర్తి వెంకట సుబ్బారావుది ప్రత్యేక శైలి, వారిగేయాలు లయ, అంత్యప్రాసలతో కూడి ఉంటాయి. బాలలు ఆడుతూ పాడుకునేలా ఉంటాయి.
1952 లో పిల్లల పత్రిక ‘బాల భారత్’ లో వీరి తొలి బాలగేయం “పిల్లలంటే ఎవ్వరోయ్? ” ప్రచురితమైంది.
వాస్తవానికి అది వచన కవిత అనిపిస్తుంది. కానీ ఆతర్వార ‘బాలబంధు’ బి.వి. నరసింహారావు, నార్ల చిరంజీవి, బాలాంత్రపు రజనీకాంతా రావు, సండూరి రామమోహన రావు లాంటి పెద్దల గేయ రచనలు చదివి గేయ లక్షణాలు తెలుసుకున్నారు. చక్కటి బాలగేయాలు రాశారు.

- Advertisement -

రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు వీరి రచనలను ‘బాల’ లో ప్రచురించి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే వీరికి ఉత్సాహాన్ని కలిగించింది. పిల్లలకు అర్థమయ్యే చిట్టి చిట్టి పదాలతో, అంత్యప్రాసలతో, మాత్రా ఛందస్సుతో ఆయబద్ధంగా అనేక బాలగేయాలు రాశారు.
” బాలసాహిత్యాన్ని – 3 సంవత్సరాల లోపు పిల్లలను ఒక వర్గంగాను- 3 నుండి 6 సంవత్సరాలు – 6 నుండి 9 సంవత్సరాలు – 9 నుండి 14 సంవత్సరాలుగా వర్గీకరించి, వారికి తగ్గ బాలగేయాలను అందించాలి. సహజంగా అమ్మో, అమ్మమ్మో,, నాయనమ్మో, తాతయ్యో పిల్లలకు పాటలు, కథలు చెప్పుతూ వుంటారు. వాళ్ళు చెప్పిన పాటలను 3 సంవత్సరాల పిల్లలు గూడా పాడతారు. ఇది స్వానుభవంతో చెబుతున్నమాట ” అంటారు అలపర్తి.
మ్యావు మ్యావు పిల్లి
పాలకొరకు వెళ్లి
మూత నెట్టిబాగే
మూతికాలె బాగ

అనే వీరి బాలగేయాన్ని వీరి మూడేళ్ళ ముని మనుమరాళ్ళు సమిర, శివాని పాడుతుంటే అంతులేని ఆనందం పొందుతారు అలపర్తి. 1955లో అలపర్తి తొలి పుస్తకం ” బాలానందం” వచ్చింది. అదో కదంబం. అందులో గేయాలు, గేయ కథలు, పద్యాలు, పద్యకథలు వున్నాయి ‘బాలానందం’ లోని ‘పాప ఊహ’ అనేగేయం మాత్రం అంత్యప్రాసలతో నడిచింది. యతి, ప్రాసల ఆలోచనేలేదు. అదే –
కాకి ఎత్తుకెళ్లె మా సబ్బు బిళ్ల
కాకి ఏమి చేయు నా సబ్బు బిళ్ల?
కాకి కున్నదేమొ ఓ చంటిపిల్ల
ఓళ్లు రుద్దనేమొ ఈ సబ్బు బిళ్ల
సబ్బు రుద్దినా గాని కాకిపిల్ల నల్లగానెకుంటుంది ఎందువల్ల?
నల్ల గుండు కాకికా కాకిపిల్ల
రుద్దుకోట మెందు కంట సబ్బు బిళ్ల
కాకికి ముద్దుగగా కాకి పిల్ల
అందుకే రుద్దు సదా సబ్బు బిళ్ల !!

ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది.

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రెండవ తరగతి తెలుగు వాచకం ‘ తెలుగు తోట’లో ‘సబ్బుబిళ్ల’ పేర కొద్ది మార్పులతో ప్రచురింపబడింది. ‘బాలానందం’లో ‘తాటి బుర్రల బండి’ గేయం బాలలు ఇట్టే ఆడుతూ పాడుతుంటారు.

తాటి బుర్రల బండి
మేటియైనదండి
మాటలెందుకులెండి
వాటమైన దండి
పిల్లల మాటలు వినిపించునాకు
పిల్లన గ్రోవి పాటలుగా
పిల్లల చేష్జలు అనిపించు నాకు
అల్లరి కృష్ణుని లీలలుగా.

అందుకే తర్వాత ప్రచురించిన పాటల పుస్తకానికి “పిల్లన గ్రోవి’ పేరుపెట్టాను. ఇందులోని
తొలకరి యొకపరి
తొంగిచూడగా
మిలమిల తళతళ
మెరుపు మెరిసెను అనే
ఈగేయం 1984 లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండవ తరగతి తెలుగు వాచకంలో ప్రచురింప బడింది. శబ్ద సౌందర్యానికి ఉదాహరణ ఈ గేయం.

ఆంధ్రపత్రిక దినపత్రికలో యామిజాల పద్మనాభ స్వామిగారు “పిల్లనగ్రోవీని సమీక్షిస్తూ -“పిల్లన గ్రోవి’ పేరు ముద్దుగా సరిపోయింది. శైశవానికి చైతన్యం కలిగించే గేయాలు” అన్నారు. అందులో మచ్చుతునక –
ముద్దూ ముద్దూ బొమ్మాలేస్తా
చూద్దురు రారండి!
కుంచే, రంగులు కొనుక్కువస్తా
బారుగ గీతాగీసే దానిని
బలపం అంటాను !
పలకల బిళ్లా గీసే దానిని
పలకని అంటాను !
గుండ్రని సున్నా చుట్టీ దానిని
గోలీ కంటాను !
వంకర టింకర గీతా గీసీ
పామని అంటాను!
అంతా నీలం రంగూ పులిమి
ఆకస మంటాను !

అందులో తెలుపూచుక్కా అలదీ చందురుడంటాను !!

ఈ పాటలన్నీ కొంచెం పెద్దపిల్లలకు పనికొచ్చేవే.. తర్వాత ‘ఆటల పాటలు’ రా
సి ప్రచురించారు. ఇందులోని ‘బొంగరం’ పాట –
ఇదిగో నా బొంగరం
ఇంపైనా బొంగరం
రంగు రంగు బొంగరం
రత్నాలా బొంగరం!
వీరబాల చంద్రునీ
ధీర శరాబందినీ
బొంగరాల ఆటలో
భంగపరచు బొంగరం

బొంగరం పాట లో తిరిగే బొంగరంతోపాటు, పోటీలు గెలిచిన బాలచంద్రుడు, శరాబంగీలను జ్ఞప్తికి తేవడం – వీరగాథలు తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలకు కలిగించడమే” అన్నారు ‘ఎస్సార్’ ముదునూరు సోదరుల’ బాలానందం’ పత్రికలో. ఈ బొంగరం పాట, ఇందులోని గాలిపటం’ పాట ఆకాశవాణి విజయవాడ వారు 1961 లో బొమ్మరిల్లు పాటలుగా రికార్డు చేసి పిల్లల కార్యక్రమాలలో ప్రసారం చేశారు.
ఉర్విపైగల – సర్వజనులకు- గర్వదినములు – పర్వదినములు అందుకే ప్రతి పండుగకూ పాట రాశారు వాటిని ‘పండుగల పాటలు’ పుస్తకంగా తెచ్చారు- ఇందులో ‘ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వీరి ఆనందానుభూతికి నిలువుటద్దం. . .

ఎన్నాళ్లకు దిన్నామూ
ఎన్నాళ్లకు కన్నామూ
కన్నతల్లి సంతకించ-అన్నదమ్ములొకటైశని
నవ్య రాష్ట్ర ముదయించెను
దివ్యగీతి వినిపించెను
చిరవాంఛిత మోగే రెను

ఈ తీపి తాయం
ఇదె చేతు మాయం
ఇంకెవరి సాయం
లేకుండ ఖాయం
సరిగ ఒక మారు

తెరిచేసినోరు గుటకేస్తె ఆహా గుటకాయస్వాహా !!

ఇది’ తాయం’ పుస్తకంలోని ఓ నర్సరీ గేయం. ఇందులోని గేయాలన్నీ ఇలాగే తాయం తిన్నంత కమ్మగా వుంటాయి. మరో గేయం. ఇది సంభాషణా గేయం –

బాలా బాలా అలిగావేల
మిఠాయి తాయం పెట లేదుగా!
బాలా! బాలా! ప్రకపకలేల ?

మిఠాయి తాయం పెట్టినావుగా ! ఎందుకు బాలా! ఏరుపు మరలా? తాయం కాకీ తన్ను వెళ్లేగా!! అంకెలు, రంగులు, రుచులు, నవ్వులు లాంటి నర్సరీ గేయాలు పిల్లల్ని సంబర పరుస్తాయి.

పంచదార తొపి
పట్టు చెయ్యి చాపి
చింతకాయ పులుపు
చెట్టు ఎక్కిదులుపు
పేపకాయ చేదు
వేడ్క నమల రాదు
వక్కపలుకు వగరు
పాపలు తిన దగరు
మిరప కాయ కారం
కొరుకు తెలియు సారం
ఉప్పుగల్లు ఉప్పన
చప్పరించు చప్పున!!.
ఇందులో హాస్య గేయాలు గూడా చోటు చేసుకున్నాయి

పలకా చెక్క
బలపం ముక్క
దొరికాయక్క
ద్వారం ప్రక్క
పలకాచెక్క
పైనా లెక్క
వేస్తా చెక్క
చూస్తావక్క. ?
బొచ్చూ కుక్క
బొమ్మొక ప్రక్క
గీస్తా చెక్క
చూస్తా వక్క
కాకీ నక్కా కథ అటు ప్రక్క
వ్రాస్తా చక్క
చూస్తా వక్క
చీకును మెక్క
చివరకు ఒక్క
బెల్లం ముక్క
పెడతా వక్క??

వీరి వూరి వ్యక్తులను గురించి వ్యంగ్యంగా ‘మా వూరివారు’ పేర కొన్ని మినీ గేయాలు రాశారు. అప్పటికి ‘ మినీకవితలు’ గూడా రాలేదు.
గుళ్లో పూజారి
గోవింగాచారి
పిక్కి ముప్వాలు
పెట్టు అప్పాలు !
వరహాలు పెట్టి
వర్తకం పెట్టి
లాభాలు తీసే
డాబాలు వేసె !

వీరి చివరి బాలగేయ సంపుటి ‘శ్రుతిలయలు’- ఇందులోని గేయాలన్నీ
శ్రుతిబద్ధంగా లయబద్ధంగా వుంటాయి.

శ్రుతిలయలు
అతి హొయలు
పట్టి చూసిన
బట్టబయలు
ఎత్తుకొమ్మని అసలు
ఏడ్వనమ్మానిజము
గుడికి నీ వెంట నే
నడచి వస్తాననీ
అడుగు బయట పెట్ట
అమ్మ చంకెక్కేటి
శ్రుతిలయలు
అతిహొయలు !!

”శ్రుతిలయలు’ లో 60 గేయాలున్నాయి. 2015లో ” శ్రుతిలయలు”కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం దక్కింది. 2016లో “స్వర్ణ పుష్పాలు” గేయకథల పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. వీరి గేయ రచనలకు గుర్తింపు వచ్చింది. వీరి 70 ఏళ్ళ కృషి ఫలించింది.

( వచ్చేవారం మరో బాలసాహితీవేత్త గేయరచనల గురించి పరిశీలిద్దాం)

పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News