చరిత్రకారుడు, పరిశోధకుడు, విద్యావేత్త, పాత్రికేయుడు అయిన చిలుకూరి వీరభద్రరావు పుస్తక పఠనానికి, విద్యాగోష్టికి రోజులో దాదాపు పద్ధెనిమిది గంటలు వెచ్చించేవారంటే ఆశ్చర్యం వేస్తుంది. నిద్రలో సైతం ఆయన పరిశోధనల గురించే కలలు కనేవారని ఆయన సన్నిహితులు, ఆయన మీద పరిశోధనలు చేసినవారు చెప్పేవారు. ఒక చిన్న వ్యాసం రాసినా, ఒక ఉద్గ్రంథం రాసినా లోతులకు వెళ్లకుండా రాసేవారు కాదని ప్రతీతి. పాత్రికేయుడుగా వార్తలు రాసినా, వ్యాసాలు రాసినా తప్పకుండా సంబంధిత వ్యక్తులను సంప్రదించకుండా రాసేవారు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా రేలంగిలో పుట్టి పెరిగిన చిలుకూరి మొదటి నుంచి విద్యారంగంలో అగ్రస్థానంలో నిలబడుతూ వచ్చారు. అతి చిన్న వయసు నుంచే ఆయనలో విద్యాకాంక్ష ప్రబలంగా ఉండేది. ఎక్కువ సమయం గ్రంథాలయాల్లోనే గడిపేవారు. ఏ సబ్జెక్టును పట్టుకున్నా ఆసాంతం చదివి ఒంట బట్టించుకుంటే గానీ వదిలిపెట్టేవారు కాదు. ఉపాధ్యాయులకు, ఆ తర్వాత అధ్యాపకులకు కూడా ఆయన ఆదర్శంగా నిలవడమే కాకుండా, వారికి సలహాలు, సూచనలు కూడా అందించేవారు.
ఆయన పాత్రికేయుడుగా పలువురు పత్రికల వారికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఏ పత్రికలో పనిచేసినా ఆ పత్రిక రాణించేది. సరైన సమాచారాన్ని అందించడంలో ఆయన ముందుండేవారు. ఒక పక్క వార్తాకథనాలను అందిస్తూనే, చక్కని వ్యాసాలు రాసేవారు. సాహిత్యం, చరిత్ర, కళలు ఆయనకు ఎంతో ఇష్టమైన అంశాలు. ఈ రంగాలకు సంబంధించిన వ్యాసాలను ఆయన ఎంతో లోతుగా అధ్యయనం చేసి రాసేవారు. 1939లో ఆయన తుదిశ్వాస విడిచే వరకూ ఈ రకమైన వ్యాపకమే, ఈ స్థాయి అధ్యయనమే కొనసాగింది. ఆయన దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుద రంజని, ఆంధ్రకేసరి, సత్యవాది వంటి దేశభక్తి పత్రికల్లో ఆయన పనిచేశారు. ఆయన కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలలో పత్రికా రచయితగా పనిచేశారు.
ఇదే వృత్తిలో ఉంటూ, చిలుకూరి వీరభద్రరావు ఆయన తన గ్రంథ పఠనాన్ని, అధ్యయనాన్ని, పరిశోధనను కొత్త శిఖరాలకు తీసుకు వెళ్లారు. 1909-12 సంవత్సరాల మధ్య ఆయన చెన్నైలో కూడా పనిచేశారు. ఒక పక్క ఉద్యోగంలో తన విధులను నిర్వర్తిస్తూనే మరో పక్క తన పరిశోధనను విస్తృతం చేశారు. ఆయన ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి, చెన్నైలో అయిదు సంపుటాల ‘హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని రాశారు. ఆంధ్రుల చరిత్రను ఆయన దాదాపు తిరగ రాసినట్టయింది. ఆయన చెన్నైలోని గ్రంథాలయా లనే కాకుండా, తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి ఎన్నో గ్రంథాలయాలను సందర్శించి, ఎందరో చరిత్రకారులతో చర్చించి, ఎన్నో అరుదైన, అద్భుతమైన విషయాలను సేకరించి ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇటువంటి గ్రంథం వెలువడడం ఇదే మొదటిసారి. ఇది అప్పటి చరిత్రకారులనే కాకుండా, సాహితీవేత్తలను సైతం ఉర్రూతలూగించింది.
అప్పట్లో ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ఉన్న ఆంధ్ర మహాసభ ఈ అత్యుత్తమ పరిశోధన గ్రంథాన్ని పాఠ్య గ్రంథంగా సిఫారసు చేయడమే కాకుండా దాని విశిష్టతను ఆంధ్ర దేశంలో చాటి చెప్పింది. ఇంతటి మహా గ్రంథాన్ని రాసినందుకు గుర్తింపుగా ఆయనకు ‘చతురానన’ అనే బిరుదును కూడా ఇచ్చింది. ఈ గ్రంథాన్ని ఆ తర్వాత ‘ఆంధ్రుల చరిత్ర’ పేరుతో అను వదించడం కూడా జరిగింది. అప్పటికీ, ఇప్పటికీ ప్రతి చరిత్ర పరిశోధకుడికి, ప్రతి చరిత్రకారుడికి ఈ గ్రంథం ప్రామాణికంగా ఉంటూ వస్తోంది. వందలాది మంది విద్యార్థులు ఆయన గ్రంథం మీదే పరిశోధనలు చేయడం జరిగింది.