Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Chittiprolu: శాశ్వత విలువల రత్నపాత్రిక

Chittiprolu: శాశ్వత విలువల రత్నపాత్రిక

రాజుకు, ప్రజలకు పరస్పరం చాలా ఆత్మీయత ఉందన్న మాట. ఇలాంటి రాజ్యమే అసలు ఆదర్శ రాజ్యం. అలెగ్జాండర్‌ స్వగతం, నిష్కారణంగా ఏ రాజ్యం మీదా దండెత్తని నిష్కల్మష భారత భూమి మీద యవన దండ యాత్ర పురుషోత్తముని స్వగతం. ఈ రెండు స్వగత సంభాషణలూ ఇటీవల ప్రచురించబడిన రక్షా బంధం నాటకం లోనివి. కీర్తి శేషులు శ్రీమాన్‌ చిటిప్రోలు కృష్ణమూర్తి గారిచే రచించబడిన ‘పురుషోత్తముడు’ అన్న మహా కావ్యానికి 2008వ సంవత్సరపు ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురష్కారం లభించింది. ప్రస్తుత నాటకానికి మూలంపై పురుషోత్తముడు కావ్యమే. ఆ కావ్యాన్ని తాజాగా, రక్షాబంధం అన్న చరిత్రాత్మక పద్య, వచన నాటకం (రక్షాబంధనిబద్ధుడై మహాత్యాగం చేసిన పురు షోత్తమ చక్రవర్తి పరమోజ్వల గాధ)గా తెలుగు విశ్వ విద్యాలయ ‘సాహితీ పురస్కార’ గ్రహీత శ్రీ చిటిప్రోలు వెంకటరత్నం గారు వ్యవహారిక భాషలో నాటకీకరణ చేసి ప్రచురించారు. ఈ రచయిత కీ.శే. శ్రీమాన్‌ చిటిప్రోలు కృష్ణమూర్తి గారి తనయుడు.
కావ్యంలో ఎంత నాటకీయత ఉన్నా నాటకీయత ఉన్న కావ్యమని అంటారే గాని నాటకమని అనరు గదా అని; అందులోని విశిష్ట కథ, అందులోని ఉదాత్తమైన సందేశం నాటక ప్రక్రియ ద్వారా ఐతే ఎక్కువ మందికి అందుతాయి గదా అని కూడా అనిపించి నాటకంగా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి ఆచరణ రూపమే ఈ నాటక రచన అని రచయిత తన ముందు మాట (తెర తీసే ముందు..) లో చెప్పుకొచ్చారు. ఈ సంద ర్భంగా ఇటీవల వెలువడిన ఓ వ్యాసంలోని ప్రస్తావన నాటక ప్రభావం గురించిన అవగాహన ఇస్తుంది: సమా జంలోకి టి.వి. రాక ముందు, గ్రామాలలోకి విద్యుత్తు రాక ముందు పెట్రోమాక్స్‌ లైట్ల కాంతుల్లో ఊరూరా పద్య నాటక రంగమే బ్రహ్మరథం పట్టించుకొంది. ప్రజల జేజేలు అందుకోంది. పొలాలలో దున్నపోతుల మీద కూడా గ్రాం ధికమైన పద్యాలు శ్రావణానందంగా వినిపించేవి. తెల్ల వార్లూ నాటకం చూసిన కర్షకుడు అదే హుషారుతో తెల్లా రిన తరువాత పొలం పనికి వెళ్ళేవాడు. ఆ విధంగా జన పదాల్లో ఘల్లుఘల్లుమని మార్మోగిన జానపదకళల స్థానంలో స్వాతంత్య్రానంతరం పద్య పౌరాణిక నాటక రంగం స్థిరమైనర్తించిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే నేటి డిజిటల్‌ యుగంలో ఈ నాటక రంగం మినుకు మినుకు మంటున్నా, నాటక ప్రచురణలు, ప్రదర్శ నలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల కవితలని, కథలని నాటకాలుగా మార్చి ప్రదర్శిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. సమాజంలో ఆరోపణలకు గురవుతున్న బుల్లితెరల మీది షోలూ గట్రా, వాటి కన్నా ఇవి ఎంతో సామాజిక ప్రయోజనంతో, బాధ్యతతో వెలువడుతూ ప్రద ర్శింపబడుతున్నాయి. సాధారణంగా మాటా, మంత్రం, పాటా, పద్యమూ, కథా, కవితా, నవలా వీటన్నిటికీ వేరు వేరు సందర్భాలూ, సన్నివేశాలూ ఉంటాయి. ఒక కవితనే తీసుకుంటే దాన్ని వివిధ రూపాలుగా మార్చవచ్చు. ఈ కవితను లేక ఇంకో కథను ముడి ఖనిజంగా భావించ వచ్చు. అలాగే ఒక్కో ప్రక్రియను మరో ప్రక్రియలోకి మల చుకోవడం అన్నది సన్నివేశ అవసరాలకి అనుగుణంగా జరుగుతుంది. సృజనకారుడి ప్రతిభను సాన పట్టాల్సి వస్తుంది ఈ వ్యవహారంలో .
ఇక ఈ నాటకాన్ని ప్రస్తావించుకుంటే, ఇది ఆదర్శం, దేశభక్తి పునాదుల మీద నిర్మితమయ్యింది. నేటి సత్యా నంతర కాలంలో, నిజమన్నది మచ్చుకైనా కానరాని కాలంలో, ఇచ్చిన మాటకి నిలబడడం, ఆశ్రితులని రక్షిం చడం (రక్షాబంధం) అన్న విలువలతో చరిత్రలోని సంఘట నలను ప్రజల మెదళ్ళకు జ్నప్తికి తెస్తూ బాధ్యతావంతులని చేయడం, మొదలగు సన్నివేశాలతో ప్రబోధాత్మకంగా ఈ నాటకం దాని కర్తవ్యాన్ని నెరవేర్చింది. చరిత్రని గుర్తుకి తెస్తూ, చరిత్ర సృష్టిస్తూ, చరితార్ధులని చేయడం చేస్తూ ఉంటాయి కళలు. ఈ నాటకంలో కథానాయక పాత్రధారి పురుషోత్తముడు సంభాషణ ఒక చోట ఇలా ఉంది: అఖండ భారత మహా జాతీయతకు ప్రతినిధిగా వ్యవహరిం చాలి. అలా వ్యవహరించడమంటే భారత మాట కున్న ‘నిత్య సత్య వ్రత’ ప్రశస్తికి, ‘ఆశ్రిత కల్ప వృక్ష’ ప్రసిద్ధికి భంగం కలగకుండా వ్యవహరించడమే. (ఇక్కడ ‘ఆశ్రిత కల్ప వృక్ష’ అన్న దానికి నాటకంలోని ప్రతినాయక పాత్ర ధారుడు అలెగ్జాండర్‌ ప్రియురాలు రుక్సానా పురుషోత్త ముడికి రక్షాబంధాన్ని కట్టి అలెగ్జాండర్‌ ప్రాణాలు నిలబెట్ట మని, తన నుంచి హామీ తీసుకుంటుంది. ఆ వాగ్దాన పాలనకి పురుషోత్తముడు కట్టుబడి ఉండడం ఇక్కడి సన్ని వేశం. చరిత్ర ద్వారా అందరికీ విదితమే ఇది ).
ఈ నాటకం వర్తమానానికి గతకాలపు దర్పణంగా రూపొందింది. నాటక ప్రేక్షకులకి అవగాహన కుదిరేం దుకు సామెతలూ, పలుకుబళ్లూ సద్వినియోగం చేయ బడ్డాయి ఇందులో. ఇంకా అక్కడక్కడ కవితా చరణా ల్లాంటి సంభాషణలు అంతరాంతర ఆవేదనలు పెల్లుబికే టట్లు చేస్తాయి. అలాగే పద్యాలు, గేయాలు సన్నివేశాలకు బాగా తోడ్పడ్డాయి. కావ్య నాయకుడి ఔన్నత్యం కృతికర్తలో కూడా చూస్తామనడానికి నిదర్శనంగా ఈ రచన జరిగింద నడంలో సందేహం లేదు. కాలానికి ప్రతీకాత్మకంగా, ప్రభో దకంగా కూడా నడిపించారు ఈ నాటకాన్ని. పురాణ పోలి కలు కూడా చొప్పించడం జరిగింది ప్రేక్షకుడు మరింత దగ్గరవడానికి.
కవన వ్యవసాయమే ఎక్కువగా సాగుతున్న నేటి కాలంలో, ఈ నాటకం, ఆధునిక కవితా లక్ష్యాలన్నిటినీ అక్కున చేర్చుకుని ప్రగతిశీలంగా ముందుకు సాగింది. ఇంతటి సాహిత్య కృషి సాధికారమైన సాహిత్య శాస్త్ర అనుభవంతోనే సాకారమయింది. ఇందుకు భాష కీలకం. అటువంటి భాష నామరూపాలు లేకుండా అంతరించే పరిస్థితులు కల్పించడం ఓ నాగరిక ప్రపంచానికి తగని పని. ప్రాణాలతో సహా కాపాడుకునే చర్యలు చేపట్టాలి.
అడుగంటి పోతున్న ఆదర్శాలని మళ్ళీ వెలుగులోకి ఈ నాటకం ద్వారా తీసుకు రావడం ఓ గొప్ప విధి. ‘రత్న పాత్రిక’ అన్న శీర్షికతో ముందు మాట రాస్తూ విశ్రాంత ఆంధ్రాచార్యురాలు శ్రీమతి కోలవెన్ను మలయావాసిని, ఆంధ్ర విశ్వ విద్యాలయం, విశాఖపట్నం, గారు పిత్రార్జితా నికి స్వార్జితం జోడించి, వీర రస ప్రధానమైన నాటక రచన చేసి, కవి రుణం, పితృ ఋణం ఏక కాలంలో తీర్చుకున్నారని రచయితని అభినందించారు. శాశ్వత విలువల ప్రాసంగికతతో అలరారింది ఈ రత్నపాత్రిక.

-ఒబ్బిని సన్యాసి రావు
హైదరాబాద్‌
9849558842

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News