Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Civil war in Pakistan: పాకిస్థాన్‌ లో అంతర్యుద్ధం

Civil war in Pakistan: పాకిస్థాన్‌ లో అంతర్యుద్ధం

పాకిస్థాన్‌ భద్రతా దళాలు పెంచి పోషించిన తాలిబాన్‌ 2021లో అఫ్ఘానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత నుంచి పాకిస్థాన్‌ ఉగ్రవాదుల దాడులతో ఉక్కిరిబిక్కిర వుతోంది. ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్‌, ఖైబర్‌ ఫక్తూన్ఖ్వా ప్రాంతాల్లో దాదాపు అంతర్యుద్ధం పరిస్థితి ఏర్పడింది. ఒక్క 2023లోనే పాకిస్థాన్‌ లో సుమారు 650 ఉగ్ర దాడులు జరిగాయంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ఇందులో 23 శాతం దాడులు బలూచిస్థాన్‌లోనే జరిగాయి. పాకిస్థాన్‌లో అత్యధిక జనాభా కలిగిన బలూచిస్థాన్‌ ప్రస్తుతం చొరబాట్లకు, ఉగ్రవాదులకు, దాడులకు, ఘర్షణలకు నిలయంగా మారింది. అనేక ఉగ్రదాడులు, ఊచకోతలు జరిగిన మాట నిజమే కానీ, రెండు రోజుల క్రితం జరిగిన దాడి మాత్రం వీటన్నిటినీ తలదన్నేలా కనిపించింది. బలూచిస్థాన్‌ వేర్పాటువాద నాయకుడు నవాబ్‌ అక్బర్‌ బుగ్తి 18వవర్ధంతి సందర్భంగా వేర్పాటువాదులు జరిపిన దాడుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వేర్పాటువాద నాయకుడిని 2006లో పాకిస్థాన్‌ సైన్యం కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా గత సోమవారం నాడు పెద్ద ఎత్తున వేర్పాటువాదులు దాడులకు పాల్పడ్డారు.
అనేక హత్యలకు తమదే బాధ్యత అని బలూచిస్థాన్‌ వేర్పాటువాదులు ప్రకటించారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ నుంచి బలూచిస్థాన్‌లోకి వలస వచ్చిన కార్మికులందరినీ వారు ఊచకోత కోశారు. ఇళ్లు, ఆఫీసుల్లోకి దూసుకుపోయి, అక్కడి ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ప్రాథమిక సదుపాయాలన్నిటినీ నాశనం చేశారు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి బలూచిస్థాన్‌లో అక్రమంగా ప్రవేశిస్తున్న చొరబాటుదార్లు, బలూచిస్థాన్‌ వేర్పాటువాదుల అఘాయిత్యాలకు అడ్డూ ఆపూ ఉండడం లేదు. బుగ్తి వర్ధంతి సందర్భంగా దేశంలో ప్రతి ఏటా ఇటువంటి హింసా విధ్వంసకాండలు జరుగుతూనే ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం పాకిస్థాన్‌ సైన్యానికి గానీ, గూఢచారి వర్గాలకు గానీ, వేర్పాటువాదుల దాడులు అంతుబట్టలేదు. బలూచిస్థాన్‌ వేర్పాటువాదుల ఆందోళనల విషయంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం మొదటి నుంచి క్రూరంగానే వ్యవహరిస్తోంది. తన సైన్యాన్ని ఉపయో గించి వీరిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
సహజ వనరులకు సంబంధించినంత వరకూ బలూచిస్థాన్‌ ఒక సుసంపన్నమైన ప్రాంతం. అయితే, మొత్తం పాకిస్థాన్‌లో ఇదే అత్యంత పేదరిక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పంజాబ్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రాంతం. పెద్దగా సహజ వనరులు లేనప్పటికీ, ఇది సుసంపన్నమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. రాజకీయంగా కూడా పంజాబ్‌ రాష్ట్రానికి ఉన్నంత ప్రాబల్యం దేశంలోని మరే ప్రాంతానికీ లేదు. ఫలితంగా బలూచిస్థాన్‌లో చాలా వర్గాల్లో పంజాబ్‌ పట్ల వ్యతిరేకత నరనరానా జీర్ణించుకు పోయింది. ఇక్కడి పేదరికాన్ని, పక్షపాతాన్ని వేర్పాటువాదులు అవకాశంగా తీసుకుని ప్రత్యేక బలూచిస్థాన్‌ కోసం ప్రజలను రెచ్చగొట్టి, తమ వైపు తిప్పుకోవడం జరిగింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఉపయోగమూ కలిగించకుండా, స్థానికులకు ఏ మాత్రం సహాయం చేయ కుండా ఇక్కడి సహజ వనరులను ప్రభుత్వం దోచుకోవడాన్ని వీరు నిరసిస్తున్నారు. ఈ ప్రాంతం మీదుగా నిర్మాణమవుతున్న పాకిస్థాన్‌-చైనా ఆర్థిక నడవాను కూడా ఇక్కడి వేర్పాటువాదులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నడవా వల్ల చైనా అత్యధికంగా లబ్ధి పొందుతోందని వీరు విమర్శిస్తున్నారు.
పాకిస్థాన్‌ ప్రభుత్వం బలూచిస్థాన్‌ కు చెందిన మానవ హక్కుల సంఘాలను కూడా పట్టించుకోవడం లేదు. ఈ సంఘాల ప్రతినిధులు తరచూ ఇస్లామాబాద్‌, కరాచీ వంటి నగ రాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి బలూచిస్థాన్‌లో మానవ హక్కులను దుర్వి నియోగం చేస్తున్న ఉదంతాలను వెల్లడించడం జరుగుతోంది. అయితే, పాకిస్థాన్‌ ప్రభుత్వం, పాకిస్థాన్‌ సైన్యం ఈ మానవ హక్కుల ఉద్యమ నాయకులను పాకిస్థాన్‌ శత్రువులుగా పరి గణించి, వారిని మట్టు బెట్టడమో, అరెస్టు చేయడమో జరుగుతోంది. అంతేకాక, బలూచిస్థాన్‌ ఆందోళనకారుల మీద, వారి కుటుంబాల మీద సైనికులు మరింతగా దమననీతిని ప్రద ర్శించడం కూడా జరుగుతోంది. ఇటీవలి దాడులను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, పాక్‌ సైనికుల దమననీతి కారణంగా వేర్పాటువాద ఉద్యమం మరింత ఉధృతం అవుతోందే తప్ప తగ్గడం లేదని అర్థమవుతోంది. పాకిస్థాన్‌ ప్రభుత్వం బలూచిస్థాన్‌ సమస్యను పరిష్కరించా లన్న పక్షంలో, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, మానవ హక్కులను కాపాడడం, స్థానికులతో చర్చించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News