Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Cong-SP seat sharing a ray of hope of INDIA Alliance: ఇండీ...

Cong-SP seat sharing a ray of hope of INDIA Alliance: ఇండీ కూటమికి ఆశా కిరణం

నాలుగైదు నెలలుగా నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉన్న ఇండీ కూటమికి ఒక చిన్న ఆశా కిరణం కనిపించింది. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. దేశవ్యాప్తంగా సీట్ల సర్దుబాటు విషయంలోనే 28 పార్టీల ఇండీ కూటమి దాదాపు కకావికలమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే, బీజేపీని ఢీకొనడానికి వీలుగా జాతీయ స్థాయిలో సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం మాత్రం కనుచూపుమేరలో ఎక్కడా కనిపించడం లేదు. మొత్తానికి సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మాత్రం ఉభయ తారకంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన సీట్ల సంఖ్యను దక్కించుకుంది. నిజానికి 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో బీజేపీ మీద విజయం సాధించే అవకాశం లేదు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. నిజానికి 1952 నుంచి రాయబరేలీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 17 సార్లు విజయాలు సాధించింది. ఆమెమ కుమారుడు రాహుల్ గాంధీ కానీ, కుమార్తె ప్రియాంక గానీ రాయబరేలీ నుంచి లేదా దాని పక్కనే ఉన్న అమేథీ నుంచి పోటీ చేస్తారా అన్నది తెలియడం లేదు. ఈ రెండు నియోజకవర్గాలు ఆ 17 సీట్లలోనే ఉన్నాయి.

- Advertisement -

కాగా, ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని ఎదుర్కోవాలని రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో తమకు చెక్కుచెదరని ఓటు బ్యాంకులుగా ఉన్న యాదవులు, ముస్లింల ఓట్లను దక్కించుకోవాలని సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పట్టుదలతో ఉంది. బీజేపీని ఎదుర్కోవాలన్న పక్షంలో ఈ పార్టీకి ఈ వర్గాల ఓట్లను అత్యధికంగా కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ఈ రెండు పార్టీలకు బాగా అనుకూలంగా ఉంది. అయితే, ఈ రెండు పార్టీల పరిస్థితి చావో రేవో అన్నట్టుగా కూడా ఉంది. నిజానికి, పొత్తు కుదిరినంత మాత్రాన విజయాలు సాధిస్తారనే నమ్మకమేమీ లేదు. 2019లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి కానీ, వాటి ఓట్ల శాతం పెరగకపోగా, బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 2014లో కాస్తంత అనుకూలంగా ఉన్న పరిస్థితి కూడా ఈ పొత్తు తర్వాత కనిపించకుండా పోయింది.

ఈ మధ్య కాలంలో బీహార్ లో జనతా దళ్ (యు), ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ఇండీ కూటమి నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల పొత్తు ఈ కూటమికి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అంతేకాక, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల మధ్య మళ్లీ సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు ప్రారంభం అయ్యాయి కానీ, పట్టు విడుపుల ధోరణి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో రెండు సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. ఈ రెండు సీట్లకు ప్రతిఫలంగా మేఘాలయలో ఒక సీటు, అసోంలో రెండు సీట్లు తమకివ్వాలని కూడా ఆమె పట్టుబడుతున్నారు. ఇటువంటి షరతుల వల్లే గతంలో ఈ రెండు పార్టీల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.

ఇది ఇలా ఉండగా, ఈ పార్టీల మధ్య ఒక పక్క చర్చలు జరుగుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదాస్పద అంశంగా మారిన సందేశ్ ఖలి ప్రాంతాన్ని సందర్శించారు. మహిళలపై పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగిన ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేస్తూ, మమతా బెనర్జీని ఒక క్రూరమైన రాణిగా అభివర్ణించారు. బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి కానీ, అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటు చర్చలు ఫలవంతం కావాలన్న పక్షంలో, ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీలకు సీట్లు ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ పార్టీలు కూడా తమ పూర్వ వైభవాన్ని పక్కనపెట్టి, వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకుని, తమ వాటా సీట్లను హుందాగా స్వీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News