Thursday, April 18, 2024
Homeఓపన్ పేజ్Cong Vs IT department: ఆర్థిక సమస్యలతో కాంగ్రెస్ సతమతం

Cong Vs IT department: ఆర్థిక సమస్యలతో కాంగ్రెస్ సతమతం

216 కోట్ల ఫైన్ పై ట్రిబ్యునల్ లో పోరాటం

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఎన్నికల వేళ ఈ పార్టీని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో కాంగ్రెస్ నిధుల కటకటతో సతమతమవుతోంది. ఆదాయ పన్ను శాఖ ఈ పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలన్నిటినీ స్తంభింపజేయడంతో ఎన్నికల ప్రచారానికి నిధులు అందుబాటులో లేక పార్టీ నాయకత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. తాము తమ కార్యాలయాల సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంటున్నామని పార్టీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది. 2018-19లో ఎన్నికల రిటర్నులను బాగా ఆలస్యంగా అందజేసినందు వల్ల ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేసింది. ప్రజల నుంచి విరాళాలుగా అందిన సొమ్ముకు సంబంధించిన ఖాతాలను కూడా ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం జరిగింది. ఈ పార్టీ అపిలేట్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసింది కానీ, అక్కడ ఈ కేసు తేలడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవడానికి అది అవకాశమిచ్చింది కానీ, ఖాతాల్లో 115 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని అది ఆదేశించింది. కానీ, దాని కరెంట్ అకౌంట్లలో భారీ మొత్తంలో సొమ్ము లేకపోవడం వల్ల అది అవస్థలు పడుతోంది.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడానికి ఆదాయ పన్ను శాఖ చెబుతున్న కారణాలు సమంజసంగా కనిపించడం లేదని, ఇది ఆదాయ పన్ను శాఖకు సంబంధించి రోటీనుగా జరిగే వ్యవహారంగా కూడా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018-19లో, ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా, కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగానే రిటర్నులను అందజేసింది. అంతేకాదు, ఆ రిటర్నుల్లో కూడా 14.04 లక్షల రూపాయల మేరకు తేడా కనిపిస్తోంది. ఈ నిధులు తమకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి అందాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ తేడాకు, ఈ ఆలస్యానికి ఆదాయ పన్ను శాఖ ఏకంగా 216 కోట్ల రూపాయల జరిమానా విధించడం కూడా సాధారణ వ్యవహారంగా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఏ విధంగా చూసినా ఇది సమర్థనీయం కాదని కూడా పార్టీ వ్యాఖ్యానించింది.

విచిత్రమేమిటంటే, సాధారణంగా ముందస్తు నోటీసులు లేకుండా ఆదాయ పన్ను శాఖ హఠాత్తుగా ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. 2018-19 తర్వాత నుంచి తాము అనేక నోటీసులు జారీ చేయడం జరిగిందని, అయితే, కాంగ్రెస్ ఈ నోటీసులను నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలియజేశారు. ఫైనల్ గా ఇటీవల జారీ చేసిన నోటీసుకు కూడా కాంగ్రెస్ నుంచి స్పందన లేదని అది తెలియజేసింది. తామిచ్చిన గడువు పూర్తయిన తర్వాతే తాము ఈ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం జరిగిందని కూడా ఈ ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఇది ఇలా ఉండగా, 2018-19 నాటి ఆదాయ పన్ను శాఖాధికారుల దాడులకు సంబంధించి భోపాల్ లో పలువురు నాయకులు తమకు ఆదాయ పన్ను నోటీసులు అందుతున్నట్టు తెలియజేశారు. ఈ మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ రావాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడానికి, ఏదో ఒక విధంగా భయపెట్టడానికే ఇటువంటి ప్రయత్నాలు ప్రారంభం అయినట్టు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలు మూతపడినప్పటికీ, ఆ పార్టీ వద్ద అనధికార నిధులకు కొరత లేదని, ఈ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని బీజేపీ నాయకులు కొందరు విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత ఉండే అవకాశం లేదని బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ నాయకులు ధ్వజమెత్తారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని నిధుల స్తంభనతో అచేతనం చేయడమన్నది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన మరునాటి నుంచి ఈ విధంగా బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికేనని ఆ పార్టీ నాయకత్వం విమర్శలు చేసింది. ప్రతిపక్షాలను వేధించడానికి, అప్రతిష్ఠపాలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం, ఇ.డి, ఆదాయ పన్ను, సి.బి.ఐ వంటి విభాగాలను ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు మొదటి నుంచి ప్రచారం సాగిస్తున్నాయి. అవినీతికి పాల్పడినవారి మీదే ఈ సంస్థలు దాడులు సాగిస్తున్నాయనడంలో సందేహం లేదని, అవి కాలక్రమంలో తప్పకుండా నిరూపణ అవుతాయని బీజేపీ నాయకులు పేర్కొనడం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈ దాడుల లక్ష్యాలు, ఉద్దేశాలపై ప్రజలు తీర్పునివ్వడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News