దేశంలో కేంద్ర స్థాయిలో అవినీతి తగ్గుముఖం పట్టింది కానీ, అనేకానేక రాష్ట్రాలలో అవినీతే రాజ్య మేలుతోందంటూ అంతర్జాతీయ స్థాయి అధ్యయన సంస్థలు గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. అవి ప్రత్యేకంగా ఏ రాష్ట్రమన్నది వెల్లడించలేదు కానీ, ఇక్కడ అవినీతి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని, ఫలితంగా దేశం ప్రపంచ దేశాల్లో ఇంకా ఒక అవినీతి దేశంగానే గుర్తింపు పొందుతోందని ఆ అధ్యయనాలు వివరిస్తున్నాయి. దేశంలో అవినీతి తగ్గుముఖం పడుతోందనే ప్రచారం సాగుతున్న వేళ ఇటీవలి ట్రాన్స్ పెరన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతి సూచిక మాత్రం దేశంలో అవినీతి పెరుగుతున్నట్టు గణాంకాలతో సహా పేర్కొంటోంది. ఈ సంస్థ (సి.పి.ఐ) సూచిక 2023 సంవత్సర నివేదిక ప్రకారం 2022లో భారత్ అవినీతిలో 85వ స్థానంలో ఉండగా 2023 నాటికి అది 93కు పడిపోయింది. మొత్తం 180 దేశాలలో ఈ సంస్థ అవినీతిపై సర్వే జరిపింది. వందను ప్రాతిపదికగా తీసుకున్న పక్షంలో భారతదేశ స్థాయి 39నుంచి 40 శాతానికి తగ్గిపోయినట్టు ఈ సంస్థ అవినీతి సూచిక తెలియజేసింది. మొత్తానికి ఇది దేశాన్ని అత్యున్నత స్థాయి అవినీతి దేశాలలో ఒకటిగా పరిగణిస్తోంది. ఫలితంగా లెసోతో, కజకిస్తాన్ వంటి దేశాల కోవలో భారత్ కూడా చేరిపోయింది. అవినీతిరహిత దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండగా, అవినీతి దేశాలలో సోమాలియా అగ్ర స్థానంలో ఉంది.
అవినీతికి సంబంధించినంత వరకూ అధ్వాన స్థానంలో ఉన్న దేశాలలో ఎక్కువ భాగం అంతర్యు ద్ధాలలోనూ, అంతర్గత సంక్షోభాల్లోనూ మునిగి ఉన్నాయి. భారతదేశం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఈ దేశం మాత్రం అవినీతిలో బాగా పురోగతి చెందుతోంది. వ్యక్తిగత ప్రయోజనాలు, లాభాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ ట్రాన్స్పెరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అవినీతిగా పరిగణిస్తోంది. దాదాపు మూడు వంతుల దేశాలు 50వ స్థానం కంటే తక్కువ స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల జాబితాలో స్థానం సంపాదించడాన్ని అనేక దేశాలు ఒక గౌరవంగా భావించడం జరుగుతోంది.
దేశంలో అవినీతి అనేది నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతి నిధులు, బ్యురోక్రాట్లలో ఎక్కువ మంది అవినీతిలోనే నిమగ్నమై ఉన్నారని గణాంకాలను బట్టి అర్థం అవుతుంది. కేంద్ర స్థాయిలో అవినీతి బాగా తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాల స్థాయిలో ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగిపోతున్నట్టు సి.పి.ఐ వెల్లడించింది. మరో వాస్తవం ఏమిటంటే, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల్లో చాలామంది ఎంతగా అవినీతికి పాల్పడుతున్నప్ప టికీ, వారిపై చర్య తీసుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న అవినీతి నిరోధక చట్టాలు సరిపో వడం లేదు. మధ్య స్థాయి, దిగువ స్థాయి అధికారులు మాత్రమే అవినీతి వ్యవహారాల్లో పట్టు బడడం జరుగుతోంది. అవినీతి కార్యకలాపాల కారణంగా పట్టుబడినవారు అవినీతితోనే బయ టకు రాగలుగుతున్నారు. అత్యధికంగా అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నది ఎన్నికల సమయంలోనే. అజ్ఞాత దాతల నుంచి పార్టీలకు అందుతున్న భారీ మొత్తాలు ఎన్నికల సమయంలో వరదల్లా పారుతు న్నాయి. ఎన్నికల తర్వాత ఈ సొమ్మును తిరిగి అవినీతి ద్వారానే రాబట్టుకోవడం ఆన వాయితీగా మారిపోయింది.
ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనూ, ప్రభుత్వాలను దించడంలోనూ భారీ మొత్తా లలో డబ్బు ఖర్చుపెట్టడం జరుగుతోంది. ఈ డబ్బంతా అవినీతి వ్యవస్థలోకి చేరిపోతోంది. అవినీతి కార్యకలాపా లకు పాల్పడినవారిపై తర తమ భేదాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అవినీతి నిరోధక చర్యలకు విశ్వసనీయత లేనందువల్ల వాటిని నిరోధించడం కష్టసాధ్యంగా మారుతోంది. అధికారంలో ఉన్నవారే అవినీతికి పాల్పడుతున్నందువల్ల వారికి ప్రభుత్వం నుంచే తగినంత రక్షణ లభిస్తోంది. న్యాయవ్యవస్థ బలహీనంగా ఉన్నందువల్లే చట్టాలు సరిగ్గా అమలు కావడం లేదని, ప్రభుత్వాలు అవినీతిమయంగా తయారవుతున్నా యని సి.పి.ఐ పేర్కొంది. ఎవరికీ జవాబుదారీతనం ఉండడం లేదు. నియంతలే కాదు, ప్రజా స్వామ్య వ్యవస్థకు చెందిన నాయకులు కూడా న్యాయవ్యవస్థలను బలహీనపరచడం జరుగు తోంది. ఆందోళనకర విషయమేమిటంటే, న్యాయవ్యవస్థలో సైతం అవినీతి ప్రవేశించడం జరుగుతోంది.
ఇక ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ప్రజలకు పాలనలో భాగస్వామ్యం తగ్గిపోవడం, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుండడం వల్ల అవినీతి రాను రానూ పెరిగి పోతోంది. ప్రజలకే కాదు, పత్రికలకు కూడా స్వేచ్ఛ తగ్గిపోతుండడం వల్ల జవాబుదారీ తనాన్ని ప్రశ్నించేవారే కరువవుతు న్నారు. పారదర్శకత పెరిగిన కొద్దీ అవినీతి తగ్గుతుంది. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, ప్రభుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలన్నీ పారదర్శకతకు పెద్ద పీట వేసినప్పుడే సమాజం అవినీతిరహితం అవుతుంది.
Corruption in India: అనేక రాష్ట్రాల్లో అవినీతిదే రాజ్యం
ప్రపంచంలో అత్యధిక అవినీతి సోమాలియాలో