Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్CWC: కాంగ్రెస్‌ పార్టీలో కొత్త కసరత్తు

CWC: కాంగ్రెస్‌ పార్టీలో కొత్త కసరత్తు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుభవజ్ఞులకు, యువతతో జాబితా సిద్ధం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సి.డబ్ల్యు.సి)లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని 2022 మేలో ఉదయపూర్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆ పార్టీ భారీ ఎత్తున కసరత్తు ప్రారంభించింది. నిజానికి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమనే ధ్యేయం నెరవేరడం ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సుమారు ఆరు నెలల నుంచి ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొత్త సి.డబ్ల్యు.సిని ఏర్పాటు చేసే అధికారాన్ని ఆయనకు అప్పగిస్తూ గత ఫిబ్రవరిలో రాయ్‌ పూర్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 20వ తేదీన, అంటే మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ జయంతి రోజున ఈ సి.డబ్ల్యు.సి ఏర్పాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. మల్లికార్జున్‌ ఖర్గే అనుభవజ్ఞులకు, యువతకు తగిన ప్రాధాన్యమిస్తూ ఒక జాబితాను సిద్ధం చేశారు. పార్టీలోని అత్యున్నత నిర్ణయాత్మక కమిటీలో ఆయన విభిన్న వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు.
గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన శశి థరూర్‌ కు కూడా ఆయన ప్రాధాన్యం కల్పించారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి ఇది అద్దం పడు తోందని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోని సంశయాత్ముల ఉద్దేశాలను ఆయన పటాపంచలు చేశారు. దాదాపు యాభై శాతం ప్రాతినిధ్యం షెడ్యూల్డ్‌ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలకు ఇవ్వడం జరిగింది. ఉదయ్‌పూర్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని చాలావరకు అమలు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆహ్వానితులను కూడా ఇందులో కలిపే పక్షంలో అగ్రవర్ణాలకు, అల్ప సంఖ్యాక వర్గాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుంది. అయితే, వయసును బట్టి 50-50 శాతం నిష్పత్తిని పాటించడం కూడా జరిగింది. మధ్యశ్రేణి నాయకుల నుంచి చాలామందిని తీసుకోవడం విశేషం. ఇందులో 60 ఏళ్ల వయసున్న దళిత నాయకుడు, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్ని, మధ్యప్రదేశ్‌ కు చెందిన 49 ఏళ్ల ఓ.బి.సి నాయకుడు కమలేశ్వర్‌ పటేల్‌ ఉన్నారు. శాశ్వత ఆహ్వానితుడైన 64 ఏళ్ల తెలంగాణ నాయకుడు దామోదర్‌ రాజనరసింహ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
నిజానికి, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు క్రియాశీలంగా పనిచేస్తున్న దశలో మల్లికార్జున్‌ ఖర్గేకు ఈ విధమైన జాబితాను రూపొందించడం ఒక విధంగా కత్తి మీద సామే. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌ సభ ఎన్నికలనే కాకుండా, ఈ ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ జాబితాను రూపొందిం చారు. ఓబీసీల నాయకుడైన చత్తీస్‌ గఢ్‌ మంత్రి తామ్రధ్వజ్‌ సాహూ ఈ రాష్ట్ర ఎన్నికలలో కీలక పాత్ర పోషించబోతున్నారు. రాజస్థాన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ కు ఎన్నికల విషయంలో పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాగా, రాజస్థాన్‌ లో గెహ్లాత్‌ కు పక్కలో బల్లెంగా మారిన సచిన్‌ పైలట్‌ ను, గిరిజన నాయకుడు మహేంద్రజిత్‌ సింగ్‌ మాలవీయాలకు సి.డబ్ల్యు.సిలో స్థానం కల్పించడం వల్ల పార్టీలో ఐక్యతకు మార్గం సుగమం అయింది.
పార్టీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అసమ్మతి వర్గాలు, తిరుగుబాటు వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. భౌగోళికంగా, సామాజికంగా పార్టీని విస్తరించే ప్రయత్నం కూడా చేశారు. అంత మాత్రాన మున్ముందు తిరుగుబాట్లు జరిగే అవకాశం లేదని భావించలేం. ఖర్గే ప్రయత్నాన్ని చూస్తే, బాగా ఆలోచించే ఎంపికలు జరిపారని, అనేక విషయాలలో రాజీ పడ్డారని అర్థమవుతోంది. ఇది సరైన ప్రారంభమే కానీ, కాంగ్రెస్‌ పార్టీ తనను తాను సంస్కరించుకోవడానికి, చక్కదిద్దుకోవ డానికి మరెన్నో చేయాల్సి ఉంది. జనాకర్షణ కలిగిన నాయకులెవరూ అగ్రస్థానంలో లేకపోవడం ఒక పెద్ద లోపంగానే కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఇంతవరకూ ఒక వ్యూహం రూపు దిద్దుకోలేదు. పైగా లెక్కలేనన్ని వర్గాలు, సంస్కృతులున్న భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, సి.డబ్ల్యు.సిలో అన్ని వర్గాలకు నిజంగానే ప్రాతినిధ్యం లభించిందని కూడా భావించలేం. అన్నిటికన్నా మించి, రాజకీయ పరమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ సవ్యంగా లేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. 2024లో జరిగే లోక్‌ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంఘటితం అవుతున్న ప్రతిపక్ష కూటమిలో కేంద్ర బిందువుగా మారడానికి ఈ పార్టీ చేస్తున్నదేమీ లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News