Sunday, December 8, 2024
Homeఓపన్ పేజ్Difference between Cong & BJP: కాంగ్రెస్‌, బీజేపీల మధ్య తేడా ఇదే

Difference between Cong & BJP: కాంగ్రెస్‌, బీజేపీల మధ్య తేడా ఇదే

అవినీతి అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న వ్యవహారమే నంటూ కొద్ది సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో అవినీతిని గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా నాయకులు, అధికారులు దీని గురించి చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. దాన్ని మినహాయించి ఇతర విషయాలు చర్చించడానికే సిద్ధపడుతుంటారు. ఇందుకు ఏదో ఒక కారణాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. దేశంలో ఈ అవినీతి గురించి విస్తృతంగా మాట్లాడే ప్రయత్నమే కాదు, దీన్ని అరికట్టే ప్రయత్నం కూడా జరిగిన దాఖలాలు లేవు. నిజానికి దాదాపు ఆరు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీతో పోలిస్తే పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొద్దిగా నయమనే భావనే ఎవరికైనా కలుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న 23 ఏళ్ల కాలం గురించి వివరంగా తెలియజేశారు. ఇంతవరకూ తనపైన ఎటువంటి అవినీతి ఆరోపణలూ లేవని, అభివృద్ధి గురించే తాపత్రయపడతాననే పేరుందని ఆయన తెలిపారు. దేశంలో దాదాపు ప్రతి ప్రధానమంత్రి మీదా అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో ఆయన చెప్పింది నిజమేననిపిస్తుంది. అవినీతి వ్యవహారాలనేవి జవహర్‌ లాల్‌ నెహ్రూ హయాం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రిగా ఉండగా లాల్‌ బహదూర్‌ శాస్త్రి నియమించిన సంతానం కమిటీ నెహ్రూ హయాంలో పలువురు మంత్రులు అవినీతికి పాల్పడినట్టు, పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు కైంకర్యం చేసినట్టు నివేదికను సమర్పించింది. అన్యాయంగా, అక్రమంగా బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి, నిధులు స్వాహా చేసినట్టు అది గణాంకాలతో సహా తెలియజేసింది.
అవినీతికి వత్తాసు అయితే, తమ మంత్రుల మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి ఆ అవినీతి మంత్రిని కాపాడడానికే ప్రయత్నం చేయడం జరిగింది. 1940లలో బ్రిటన్‌ లో భారత హై కమిషనర్‌గా పనిచేసిన వి.కె. కృష్ణమీనన్‌ ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనపెట్టి, సుమారు 80 లక్షల రూపాయల విలువైన సైనిక శకటాలను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒక విదేశీ కంపెనీతో ఒప్పందం మీద సంతకాలు చేశారు. ముందుగానే సొమ్ము చెల్లించడం జరిగింది కానీ, జీపులు మాత్రం అతి తక్కువ సంఖ్యలో సరఫరా అయ్యాయి. కృష్ణ మీనన్‌ మీద చర్య తీసుకోవడం గానీ, ఆయనను ప్రశ్నించడం గానీ జరగలేదు.
ఇందిరా గాంధీ హయాంలో కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తుల్మోహన్‌ రామ్‌, రుస్తుం సోహ్రబ్‌ నాగర్వాలా అవినీతి వ్యవహారాలు ఆమె హయాంలోనే బయటపడ్డాయి. అప్పట్లో విదేశీ వాణిజ్య మంత్రిగా ఉన్న లలిత్‌ నారాయణ్‌ మిశ్రాతో కలిసి, అక్రమంగా లైసెన్సులను జారీ చేశారని పార్లమెంట్‌ సభ్యుడు తుల్మోహన్‌ రామ్‌ పై ఆరోపణలు వచ్చాయి. ఆ మంత్రి కూడా పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్టు, అక్రమంగా లైసెన్సులు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది కానీ, ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హయాంలో బోఫోర్స్‌ కేసులో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్టు వెల్లడైంది. ఆయనకు అనేక కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉండగా ఆయన కుమారుడు కాంతీ దేశాయ్‌ అనేక అవినీతి కార్య కలాపాలకు పాల్పడడం జరిగింది. కోట్లాది రూపాయల నిధులు స్వాహా అయ్యాయి. అయితే, మొరార్జీ తన కుమారుడిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు.
ప్రధానులంతా అంతే!
ఇక పి.వి. నరసింహారావు హయాంలో కూడా ఆయన కుమారుడు ప్రభాకర్‌ రావు యూరియా కుంభకోణానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. 1996 మేలో సి.బి.ఐ చార్జిషీటు దాఖలు చేసింది కానీ, అందులో ప్రభాకర్‌ రావు పేరు లేదు. ఇందులో ఆయనకు సంబంధించిన మరికొందరు బంధువుల పాత్ర కూడా ఉన్నప్పటికీ వారి పేర్లేవీ చార్జిషీటులో కనిపించడం లేదు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో అత్యధిక అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూమి కబ్జాలకు, ఆర్థిక అవినీతికి పాల్పడినట్టు ప్రస్తుతం ఇండీ కూటమిలో ఉన్న నాయకులు కూడా అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల కింద వాద్రాకు భూములు, నిధులు కట్టబెట్టడం జరిగింది. మధ్యలో అటల్‌ బిహారి వాజ్‌ పేయీ ప్రభుత్వాన్ని మినహా యిస్తే, మిగిలిన ప్రభుత్వాలన్నీ అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలాయి. చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, దేవెగౌడ, వి.పి. సింగ్‌, ఐ.కె. గుజ్రాల్‌ ప్రభుత్వాల్లో అవినీతి వ్యవహారాలు వెల్లువెత్తడం జరిగింది.
ఇటువంటి నేపథ్యంలో మోదీ తాను ‘అవినీతి రహిత’, ‘అభివృద్ధియుత’ ప్రధానినని చెప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన హయానికి సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది – బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి ఆయన అవకాశమివ్వ లేదు. రెండవది- దేశాభివృద్ధిలో అధికారులు కూడా పాలుపంచుకునేటట్టు ఆయన ప్రోత్సహించారు. ఆయన వ్యూహాత్మక విధానాల్లో ఈ రెండు అంశాలు ఎంతో కీలకమైనవని భావించాల్సి ఉంటుంది. ఆయన చెబుతున్న బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతమనేవి కేవలం కుటుంబ పాలనను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నవి కావు. ఆయనకు తన సిద్ధాంతాల పట్ల, తాను అనుసరిస్తున్న విలువల పట్ల ఉన్న నమ్మకమే ఆయన ఇటువంటి ఆరోపణలు చేయడానికి ధైర్యాన్నిస్తున్నాయి. కుటుంబ పాలన అయినంత మాత్రాన అటువంటి పాలకులకు సిద్ధాంతాలు, విలువలు ఉండవని కాదు. అయితే, విధానాల అమలులో మాత్రం ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
బంధుప్రీతికి పెద్ద పీట
సాధారణంగా కుటుంబ పాలనలో విలువలతో కూడిన పాలనకు అవకాశం ఉండదు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కూడా ఒక లక్ష్యం కోసమో, ఒక ప్రయోజనం కోసమో పనిచేయడమన్నది ఉండదు. తెలుగుదేశం పార్టీ నుంచి శివసేన వరకు, అకాలీ దశ్‌ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ వరకు ఈ కుటుంబ పార్టీలను చూసినా అవి చీలికలు వాలికలైపోవడమే కనిపిస్తూ ఉంటుంది. ఫలితంగా దేశ రాజకీయ రంగమే అనేక విభజనలకు, చిన్న పార్టీల ఏర్పాటుకు దారితీయడం జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు రాజకీయాల్లో ఉండడంలో తప్పేమీ లేదని, అయితే, ఒకే కుటుంబం పాలన సాగిస్తుండడం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థకు చీడగా మారుతుందని మోదీ ఇటీవల లోక్‌ సభలో చెప్పడం జరిగింది.
అవినీతిని, బంధుప్రీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని దగ్గరకు రానివ్వకపోవడమే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో మోదీకి సానుకూల అంశాలుగా మారాయి. మోదీ కుటుంబ సభ్యులెవరూ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ దగ్గరకు కూడా రావడం లేదు. మోదీ తల్లి గానీ, ఆయన భార్య గానీ తమ నిరాడంబర జీవితాన్ని వదిలిపెట్టడం జరగలేదు. స్వప్రయోజనాల కోసం ఆయన సోదరులెవరూ ఆయనను ఇంత వరకూ కలుసుకోవడం కూడా జరగలేదు. ఫలితంగా మోదీ ఇప్పుడు నైతిక బలంతో మాట్లాడగలుగుతున్నారు. రాజకీయాల్లో ఒక అసాధారణ వ్యక్తిగా, నాయకుడుగా కొనసాగుతున్నారు. బంధుప్రీతిని దగ్గరకు రానివ్వకపోవడం వల్లే ఆయనకు అవినీతి మరక కూడా అంటడం లేదు. అంతేకాదు, బ్యురోక్రాట్లను, అధికారులను దేశాభివృద్ధి వైపు, జాతీయ వాదం వైపు ప్రోత్సహించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మరో అనుకూల అంశంగా మారింది. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కొంతవరకైనా తగ్గడానికి అవకాశం కలిగింది. అధికారులు కేవలం కర్మచారులుగా కొనసాగకుండా కర్మయోగుల కింద కొనసాగాలని ఉద్బోధిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ అధికారుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఇప్పుడు అదే పథకాన్ని మరోవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన అమలు చేస్తున్నారు. అవినీతిరహిత అధికారుల్ని, ఫలితాలు సాధించే వారిని ఆయన ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. మొత్తం మీద మోదీ తాను అవినీతిరహిత, అభివృద్ధి సహిత ప్రధానినని చెప్పుకోవడంతో పాటు దాన్ని ఆచరణలో చూపించారనడానికి అనేక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. అవినీతి మరక లేకుండా సమర్థంగా పనిచేయగలనని మోదీ చెప్పగలుగుతున్నారు. అవినీతి లేకుండా పాలన సాగించడం అసాధ్యమని, ఇది విశ్వవ్యాప్తంగా ఉన్నదేనని చెప్పడం భావ్యం కాదనే విషయం రుజువవుతోంది.

  • వి.వి. రంగారావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News