Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Drinking water to all: అందరికీ తాగునీరు అందని ద్రాక్షపండేనా?

Drinking water to all: అందరికీ తాగునీరు అందని ద్రాక్షపండేనా?

హర్‌ ఘర్‌ జల్‌ మిషన్‌ పనులు జోరందుకునేదెప్పుడో

తాగు నీరు అనేది ఒక మౌలిక అవసరం. అయితే, దేశంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటికి కొరత ఉంటూనే ఉంది. ప్రస్తుతం 25 కోట్ల మందికి రోజుకు 55 లీటర్ల చొప్పున తాగు నీరు అందుతోంది కానీ, ఇప్పటికీ కొన్ని కోట్ల గ్రామీణ కుటుంబాలకు తాగునీరంటే అందని ద్రాక్షపండుగానే ఉంటోంది. దేశంలోని 19.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ఇప్పటికీ అవసరమైనంత తాగునీరు లభించే అవకాశం లేదు. 2024లో తమ పదవీ కాలం ముగిసేలోగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకన్నిటికీ పైపుల ద్వారా లేకా ట్యాంకుల ద్వారా మంచి నీరు సరఫరా చేయడం జరుగుతుందని 2019 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేసే సమయానికి 3.2 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే మంచి నీటి సరఫరా జరుగుతోంది. అంటే మొత్తం కుటుంబాలలో 16 శాతం మాత్రానికే నీరు అందుతోందన్న మాట. ఇప్పుడు ఆ సంఖ్య 64 శాతానికి చేరుకుంది. కానీ, ఇంకా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు.
‘హర్‌ ఘర్‌ జల్‌ మిషన్‌’ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి పైపుల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2019 తర్వాత ఇప్పటి వరకూ తొమ్మిది కోట్ల మంది గ్రామీణులకు పైపుల ద్వారా తాగునీరు అందుతోంది. ఇవి కాక, గ్రామాల్లోని పాఠశాలలకు, అంగన్వాడీలకు, కమ్యూనిటీ భవనాలకు పైపుల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ మోదీ ప్రకటించినట్టుగా 2024 ఏప్రిల్‌ నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నిటికీ నీటి సరఫరా జరిగే అవకాశం లేదు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా జల్‌ శక్తి మిషన్‌ లక్ష్యం నత్తనడక నడవక తప్పలేదు. పైపులు వేయడం, ట్యాంకులు నిర్మించడం, ఇతర నిర్మాణాలు దాదాపు నిలిచిపోయాయి. మొత్తం మీద 2024 ఎన్నికల లోగా 75 శాతం లక్ష్యం మాత్రమే నెరవేరే అవకాశం ఉంది. ఈ సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
వివిధ రాష్ట్రాలు అందించిన సమాచారం ఆధారంగా జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఈ వివరాలను అందించడం జరుగుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం, దేశంలోని దాదాపు ప్రతి గ్రామానికీ పైపుల ద్వారా లేదా ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. హర్‌ ఘర్‌ జల్‌ లక్ష్యం పూర్తయినట్టుగా కూడా చెబుతున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు అందిస్తున్న సమాచారం ప్రకారం, దేశంలోని మొత్తం 1.67 లక్షల గ్రామాలలో 50 వేల గ్రామాలకు మాత్రమే హర్‌ ఘర్‌ జల్‌ముద్రపడినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం మీద మూడు వంతుల గ్రామాలకు మాత్రమే నీరు అందుతున్నట్టు గ్రామ పంచాయతీల లెక్కలు చెబుతున్నాయి. కాగా, జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ జరిపిన సర్వేలో 13,300 గ్రామాలలో మొత్తం మూడు లక్షల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నీళ్లు అందుతున్నట్టు తెలిసింది. అంటే 62 శాతం గ్రామీణ కుటుంబాలు పైపుల ద్వారా, ట్యాంకుల ద్వారా నీటిని పొందుతున్నాయన్న మాట. గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలలో వంద శాతం గ్రామీణ కుటుంబాలకు తాగునీరు అందుతోంది. 2019 నాటికి అక్కడ ప్రభుత్వ లక్ష్యం చాలా వరకు నెరవేరింది. ప్రభుత్వం సరైన సమాచారం అందేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News