రాష్ట్రపతి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని, పక్షపాతరహితంగా చర్యలు తీసు కోవాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేరళ శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొక్కిపెట్టడాన్ని అది సుప్రీం కోర్టులో సవాలు చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెట్టడంపై ఇప్పటికే కేరళ ప్రభుత్వం న్యాయపరంగా సాగిస్తున్న పోరాటానికి ఇదొక కొనసాగింపు. ఎటువంటి కారణాలూ చెప్పకుండా రాష్ట్రపతి తమ బిల్లులను ఆపేశారని, ఆమోదం తెలియజేయడం లేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఆ బిల్లులు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు, సహకార సంఘాలకు సంబంధించినవి. నిజానికి అవి రాష్ట్ర అధికార పరిధిలోనివి. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రెండేళ్ల నుంచి ఈ బిల్లులను తొక్కిపెట్టి ఉంచారు. పైగా ఆయన ఈ మధ్య ఈ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఎంత కాలానికీ సమాధానం రాకపోయేసరికి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రపతి, గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 200, 201లకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. బిల్లులకు ఆమోద ముద్ర వేయడానికి రాష్ట్రపతికి గానీ, గవర్నరుకు గానీ రాజ్యాంగం కాలపరిమితిని లేదా గడువు కాలాన్ని నిర్ధారించలేదు. అయితే, ఏ కారణమూ చెప్పకుండా గవర్నర్ ఈ బిల్లులను సుదీర్ఘ కాలం తన వద్దే అట్టిపెట్టుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి తనకు ఎటువంటి ఆదేశాలూ రాకుండా ఉండడానికే గవర్నర్ ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కేంద్ర మంత్రివర్గ సలహా ప్రకారం, రాష్ట్రపతి ఈ బిల్లుల మీద సంతకాలు చేయడానికి నిరాకరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని, రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను తిరస్కరించడం ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యం చేసుకుంటున్నారని నిందలుపడడం జరుగుతోంది.
ఏ విషయంలోనైనా రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సలహా మేరకు వ్యవహరించాల్సిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ సలహా ప్రకారం వ్యవహరించే ముందు ఈ బిల్లులకు సంబంధించిన మంచి, చెడులను రాష్ట్రపతి పరిశీలించారా అన్నది సందేహమే. గవర్నర్ ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపించడాన్ని తిరస్కరించాలని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత. రాష్ట్రపతి తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు, ఆ రాష్ట్రాల గవర్నర్లకు మధ్య విభేదాలు తలెత్తడం, సమన్వయం ఏర్పడడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్నదే. మధ్య మధ్య సుప్రీంకోర్టు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దడం జరుగుతోంది. గత వారం సుప్రీంకోర్టు తమిళనాడులో మంత్రిగా కె. పొన్ముడిని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవితో ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు తమకు లేని అధికారాలను చెలాయించడం, రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం జరుగుతోంది. రాజ్యాంగానికి, రాజకీయ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. ఇందులో రాష్ట్రపతి కూడా కల్పించుకుని విమర్శలకు గురికావడం జరుగుతోంది.
Droupadi Murmu: గవర్నర్ల బాటలో రాష్ట్రపతి ముర్ము?
రాజకీయాలకు అతీతంగా ..?