Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్ED eyes on Tamil Ministers: తమిళ మంత్రులపై ఈడీ కన్ను

ED eyes on Tamil Ministers: తమిళ మంత్రులపై ఈడీ కన్ను

ఈడీ విచారణ జరపాల్సిన అవసరం ఏంటని విజిలెన్స్ విభాగం ఈడీని ప్రశ్నించింది

తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డి.ఎం.కె) ప్రభుత్వ మొదటి రెండేళ్ల పాలనలో ఒక్క మాట కూడా మాట్లాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పుడు చర్యలకు, దాడులకు ఉపక్రమించింది. రెండేళ్ల పాటు చడీ చప్పుడూ లేకుండా ఉండడాన్ని తుపాను ముందరి ప్రశాంతతగా భావించవచ్చు. డి.ఎం.కె ప్రభుత్వంలోని మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఈ దర్యాప్తు సంస్థ తన దాడుల్ని, దర్యాప్తుల్ని ఉధృతం చేసింది. మొదటగా డి.ఎం.కె సీనియర్ నాయకుడు, మంత్రి అయిన వి. సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఆస్తుల మీద దాడులు జరిపిన ఈడీ ప్రస్తుతం మరి కొందరు మంత్రుల పైన కూడా దృష్టి సారించింది.
2014లో డబ్బుకు ఉద్యోగాలు అమ్ముకున్న ఆరోపణ మీద సెంథిల్ బాలాజీని విచారించి అరెస్టు చేసి, పుళల్ జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె. పొన్ముడికి సంబంధించిన 12 ఏళ్ల క్రితం నాటి కేసునొక దానికి వెలికి తీసింది. తాజాగా, రాష్ట్ర మత్య్స పరిశ్రమల శాఖ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్ ను ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా ఈ దర్యాప్తు సంస్థ ఓ దిగువ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది.

- Advertisement -

బాలాజీ కేసులో తాము చేయగలిగిందేమీ లేదని అర్థం చేసుకున్న డి.ఎం.కె ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో దీని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. బాలాజీకి గుండె సంబంధమైన సమస్యకు శస్త్రచికిత్స జరిగింది. కొద్ది రోజులు అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత ఆయనను మళ్లీ జైలుకు పంపారు. పొన్ముడిని, ఆయన కుమారుడిని రెండు దఫాలుగా విచారించిన ఈడీ అధికారులు ఆయన ఆస్తుల వివరాలను పరిశీలించి, తనిఖీలు చేసి, కోటి రూపాయల మేరకు స్వదేశీ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2007-11 సంవత్సరాల మధ్య గనుల మంత్రిగా పనిచేసిన పొన్ముడి రెడ్ శ్యాండ్ గనుల కోసం అక్రమంగా లైసెన్సులు మంజూరు చేశారని, ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఈడీ అధికారులు ఆరోపించారు. ఆయన కుమారుడు, కొందరు బంధువుల ఆస్తుల విషయంలో కూడా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

మత్స్య శాఖ మంత్రి విషయంలో కూడా ఈడీ ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల మీద
దాడులు జరపదలచుకుంది. న్యాయస్థానం అనుమతి కోసం పిటిషన్ పెట్టుకున్న ఈడీకి వ్యతిరేకంగా రాష్ట్ర విజిలెన్స్ విభాగం రెండు అఫిడవిట్లను దాఖలు చేసింది. తమిళనాడుకు సంబంధించిన కేసుల్లో ఈడీ విచారణ జరపాల్సిన అవసరం ఏమిటని విజిలెన్స్ విభాగం ఈడీని ప్రశ్నించింది. ఈ కేసుపై ఆగస్టు 2వ తేదీన కోర్టు విచారణ జరుపుతుంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం సందర్భంగా పొన్ముడి గురించి ఈడీ వివరాలు బయటపెట్టడం జరిగింది. ప్రతిపక్షాలను భయాందోళనలకు గురి చేసి, వాటి మధ్య విభేదాలు సృష్టించడానికే కేంద్రం ఈ విధంగా చేసిందనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ చర్య తీసుకోవడం జరిగిందంటూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఇతర దర్యాప్తు సంస్థలను కూడా ప్రతిపక్షాల మీదకు ప్రయోగించే అవకాశం ఉందంటూ కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వానికి మాత్రం ఇదొక అగ్ని పరీక్షేననుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News